బెంజ్‌-2.. చకచకా..!

ABN , First Publish Date - 2020-11-23T06:21:37+05:30 IST

బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

బెంజ్‌-2.. చకచకా..!
భూగర్భ పిల్లర్ల పనులు

నెల రోజుల్లోనే మూడొంతులకు పైగా భూగర్భ పిల్లర్ల నిర్మాణం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో అత్యంత కీలకమైన భూగర్భ పిల్లర్ల నిర్మాణ పనులు నెల రోజుల్లోనే మూడొంతులు పూర్తయ్యాయి. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఒక్కో పిల్లర్‌కు భూగర్భంలో ఆరేసీ చొప్పున అండర్‌ గ్రౌండ్‌ పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. మొత్తం 47 పిల్లర్లలో 37 పిల్లర్ల వరకు భూగర్భంలో అండర్‌ గ్రౌండ్‌ పిల్లర్ల పనిని కాంట్రాక్టు సంస్థ ‘లక్ష్మీ ఇన్‌ఫ్రా’ పూర్తి చేయటం విశేషం. ఇక కేవలం 10 అండర్‌ గ్రౌండ్‌ పిల్లర్ల పనులు మిగిలి ఉన్నాయి. స్క్యూ బ్రిడ్జి ఎండ్‌ నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకు ఒక పోర్షన్‌గా, సర్కిల్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ కూడలి వరకు మరో పోర్షన్‌గా పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. శనివారం నుంచి రమేష్‌ హాస్పిటల్‌ కూడలి తరువాత సర్వీసు రోడ్డు వెంబడి మిగిలి ఉన్న చెట్ల తొలగింపు పనులు చేపడుతున్నారు. మొత్తం మూడు భాగాలుగా భూగర్భ పిల్లర్ల పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రెండు పోర్షన్లలో పని పూర్తి కాగా, మూడవ పోర్షన్‌లో కొద్ది దూరమే అయినా.. ఇవి కూడా త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. 


భూ ఉపరితల పిల్లర్ల నిర్మాణానికి సమాంతరంగా..

ఫ్లై ఓవర్‌ అండర్‌ గ్రౌండ్‌ పిల్లర్ల పనులకు సమాంతరంగా భూ ఉపరితల పిల్లర్ల నిర్మాణానికి కూడా కాంట్రాక్టు సంస్థ ప్రణాళికలను నిర్దేశించుకుంది. భూగర్భ పిల్లర్లు భూ ఉపరితలంపై రెండు, మూడు అడుగుల వరకు వస్తాయి. అన్ని పిల్లర్లు పూర్తయిన తర్వాత భూ ఉపరితలం మీదకు వచ్చిన రెండు, మూడు అడుగుల భాగాన్ని పగులగొట్టి పిల్లర్‌ పాదానికి ఐరన్‌ ఫ్రేమింగ్‌ పనులు చేపడతారు. ఈ పనులను కూడా సమాంతరంగా ప్రారంభించారు. 

Updated Date - 2020-11-23T06:21:37+05:30 IST