అమెరికా ఎన్నికలపై ఆయన చెప్పిందే జరిగింది.. వీడియో వైరల్ !

ABN , First Publish Date - 2020-11-06T01:30:06+05:30 IST

అగ్రరాజ్యం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఒకవైపు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి చాలా చేరువలో ఉంటే... మరోవైపు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అమెరికా ఎన్నికలపై ఆయన చెప్పిందే జరిగింది.. వీడియో వైరల్ !

వాషింగ్టన్: అగ్రరాజ్యం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఒకవైపు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి చాలా చేరువలో ఉంటే... మరోవైపు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధిస్తే గానీ, ఆయనకు మరోసారి అధికారం దక్కే అవకాశం లేదు. కానీ, ఇది సాధ్యపడకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అయినా చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇదిలాఉంటే... అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాలపై రెండు వారాల క్రితం డెమొక్రటిక్ సెనేటర్ బెర్నీ సాండర్స్ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బెర్నీ అంచనాలకు సంబంధించిన ఈ వీడియోకు 24 గంటల వ్యవధిలోనే 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి.


వీడియోలోని సమాచారం ప్రకారం... 79 ఏళ్ల బెర్నీ అక్టోబర్‌లో జిమ్మీ ఫాలన్‌ టునైట్‌ షో ఇంటర్వ్యూ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాల గురించి తన అంచనాలను ఈ షోలో చెప్పారు. "ఈ అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లు అధికంగా ఉంటాయని, ఫలితంగా కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. అంతేగాక పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. దీనికి పోస్టల్ బ్యాలెట్లు, మెయిల్ ఇన్ ఓట్లు కారణం అవుతాయి. ఇక ఎన్నికలు జరిగే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్రంప్‌ కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తాడు. దాంతో వెంటనే టీవీల్లో కనిపించి ‘నన్ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు. ఇదొక మంచి రోజు’ అంటారు" అని బెర్నీ తెలిపారు. అలాగే "ట్రంప్ గెలవని కొన్ని కీలక రాష్ట్రాల్లో మోసం జరిగిందని అంటాడు. వెంటనే కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతూ.. న్యాయస్థానం మెట్లు ఎక్కుతాడు. తరువాతి రోజు గానీ, ఆ తరువాతి రోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. బైడెన్ గెలిచినట్లు ప్రకటన వస్తుంది. దీనిపై కూడా ట్రంప్ రచ్చ చేస్తారని" ఈ వీడియోలో బెర్నీ చెప్పడం జరిగింది. కాగా, ఇప్పటివరకు బెర్నీ చెప్పింది పొల్లు పోకుండా జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం బైడెన్ అధ్యక్ష పీఠానికి కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ఇక ట్రంప్‌కు మరోసారి అధికారం దక్కడం దాదాపు అసాధ్యమనేది విశ్లేషకుల మాట. 

Updated Date - 2020-11-06T01:30:06+05:30 IST