
ఆంధ్రజ్యోతి(23-03-2022)
శనగపిండితో రుచికరమైన వంటలే కాదు చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. మొటిమలు, మచ్చల్లాంటివి పోయి.. మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. ఇంకెందుకాలస్యం.. శనగపిండితో స్నేహం చేయండి!
టేబుల్ స్పూన్‌లో శనగపిండి, ఇంకో టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు కలిపి మెత్తగా చూర్ణం చేయాలి. ఆ పదార్థాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. కలబందలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. శనగపిండి వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే శనగపిండిలో నిమ్మరసం కలిపి చర్మానికి పట్టిస్తే మచ్చలు అంతరించిపోతాయి.
కొంచెం శనగపిండి, మరికొంచెం ముల్తాన్ మట్టికి రోజ్ వాటర్ జోడించి గుజ్జుగా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగితే మలినాలతో పాటు జిడ్డు తొలగిపోతుంది.
శనగపిండి, రోజ్‌వాటర్, పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ఫ్రెష్‌నెస్ వస్తుంది. మెడ దగ్గర, మోచేతుల దగ్గర పట్టిస్తే నల్లదనం తగ్గుతుంది.
శనగపిండికి తేనె లేదా పసుపు జతచేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
శనగపిండి మంచి స్క్రబ్‌లాగా ఉపయోగపడుతుంది. ముఖంపై రుద్దితే మృతకణాలు తొలగిపోయి.. తాజాదనంగా అనిపిస్తుంది.