నిలకడలేని ధరతో నష్టపోతున్న తమలపాకు రైతు

ABN , First Publish Date - 2021-04-23T06:23:34+05:30 IST

మట్టిని నమ్ముకొన్న రైతన్న కష్టాలు వర్ణనాతీతం.. ఒక వైపు వర్షాభావం... మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

నిలకడలేని ధరతో  నష్టపోతున్న తమలపాకు రైతు
తమలపాకులను కోస్తున్న కూలీలు



దిగుబడి ఉన్నా ధరలేని వైనం..


మడకశిర, ఏప్రిల్‌ 22: మట్టిని నమ్ముకొన్న రైతన్న కష్టాలు వర్ణనాతీతం.. ఒక వైపు వర్షాభావం... మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఏ పంట సాగుచేసినా ఏదో ఒక రకంగా దెబ్బతిని నష్టపోతున్నామని నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలోని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. పండిన పంటలకు ధర, మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సివస్తోందన్నారు. నియోజకవర్గంలో రైతులు వక్కతోటల సాగులోనే తమలపాకు సాగును అం తర్‌ పంటగా చేపట్టారు. తమలపాకు సాగు ద్వారా ఆ పరిసరప్రాంతాల కూలీలకు కూడా ఉపాధి దొరికేది. రైతులకు ఆదాయంచేకూరేది. ఉన్న పళంగా తమల పాకుల ధరలు తగ్గడంతో తమకు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రొళ్ళ, అగళి, గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల్లో తమలపాకుల సాగు దాదాపు 1200 హెక్టార్లలో  ఉంది. గతంలో తమలపాకులకు మంచి ధరలు ఉండేవని ప్ర స్తుతం తగ్గడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.  తమలపాకులు కోసేందుకు, అంట్లు క ట్టేందుకు రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు కూలీ చెల్లిస్తూ భోజనం సమకూరుస్తున్నామని  రైతు లు అంటున్నారు. గతంలో వందతమలపాకు పెండీ ధర రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ఉండేదని, ప్రస్తుతం రూ.500 నుంచి రూ.3వేల వరకు ధర ఉండడంతో తమకు పూర్తిగా నష్టం వాటిల్లుతోందన్నారు. దీనికి తోడు ఆకు తోటకు తెగుళ్లు సోకడంతో మరింత నష్టం వాటిల్లుతోంది. ఆకుముడత, మచ్చరోగం, కరిజోళ, ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి. మందులు పిచికారి చేస్తే కొంత మేర దిగుబడి వస్తుందని, మందులు కొట్టకపోతే దిగుబడి తగ్గుతోంది. గిట్టుబాటు ధరలు కల్పించి తెగుళ్ల నివారణకు ఉచితంగా మందులు సరఫరా చేయాలి. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో నియోజకవర్గంలోని పలుప్రాంతాలలోని రైతులు తమల పాకులను హిందూపురం మార్కెట్‌, కర్ణాటక ప్రాంతాల మార్కెట్‌లకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.


ధర లేక నష్టపోతున్నాం : మహేంద్ర, రైతు

తమలపాకుకు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గి ధరలు లేకపోవడంతో నష్టం వాటిల్లుతోంది. మూడు ఎకరాల్లో వక్కతోటలో అంతర పంటగా తమలపాకు సాగుచేశాను. గతంలో ధరలు, దిగుబడి లేక నష్టపోయాం. ప్రస్తుతం ధర లేకపోవడం, తమలపాకుకు తెగుళ్లుసోకి దిగుబడి తగ్గి మరింత నష్టపోతున్నాం. ఎకరా వక్కతోటకు సంవత్సరానికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చులు వస్తాయి. కూలీ రేట్లు కూడా గతంలో కంటే రెట్టింపు అయ్యాయి. పెండీ ఆ కులు నాణ్యత బాగుంటే మంచి రేటు ఉంటుంది. లేకపోతే కొద్దిపాటి ధరకే విక్రయించాల్సి వస్తోంది. తెగుళ్ల నివారణకు ఉచితంగా మందులు, స్థానికంగా మార్కెట్‌  సౌక ర్యం కల్పించి గిట్టుబాటు ధర కల్పించాలి.


ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి 

ఉగ్ర నరసింహ, వక్క సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు

తమలపాకుకు దిగుబడి ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని తమలపాకు సాగుకు అనుసంధానం చేయాలి. దీంతో కూలీల ఖర్చులు కొద్దిమేర తగ్గినా రైతుకు ఉపశమనం కలుగుతుంది. సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే మంచి దిగుబడి వచ్చి ధరలు కూడా ఉంటాయి. మిగతా పది నెలల్లో తమలపాకుకు ధరలు, దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. పెండీ తమలపాకు ధర రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఉంది. ఈ ధరల వల్ల పెట్టిన ఖర్చులు కూడా గిట్టడం లేదు. దీనికి తోడు తెగుళ్లు కూడా సోకుతున్నాయి. తెగుళ్ల నివారణకు వేప పిండిని సబ్సిడీతో అందిస్తే తెగుళ్లను నివారించి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-04-23T06:23:34+05:30 IST