కశ్మీర్‌లో ‘మిత్ర’ ద్రోహం

ABN , First Publish Date - 2020-02-15T06:29:34+05:30 IST

ఇప్పుడు కశ్మీరీలకు మనం ఏమి చెయ్యాలి? కశ్మీరీలను మరింత గౌరవాదరాలతో చూడాలి. విలక్షణ, సమున్నత కశ్మీరీ సంస్కృతిని గౌరవించి కాపాడాలి. కశ్మీరీల మత విశ్వాసాలను సమాదరించాలి.

కశ్మీర్‌లో ‘మిత్ర’ ద్రోహం

ఇప్పుడు కశ్మీరీలకు మనం ఏమి చెయ్యాలి? కశ్మీరీలను మరింత గౌరవాదరాలతో చూడాలి. విలక్షణ, సమున్నత కశ్మీరీ సంస్కృతిని గౌరవించి కాపాడాలి. కశ్మీరీల మత విశ్వాసాలను సమాదరించాలి. భారత జాతీయ ఆర్థిక వ్యవస్థలో యువ కశ్మీరీల వృత్తిగత పురోగతికి అన్నివిధాల తోడ్పడాలి. ఇవన్నీ జరిగిన నాడు, స్వతంత్ర దేశంగా ఏర్పడడం లేదా పాకిస్థాన్‌లో విలీనమవడం కంటే భారత్‌లో అంతర్భాగంగా వుండేందుకు కశ్మీరీలు తప్పక మొగ్గుచూపుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.


జ్ఞానాసక్తికి వృత్తిపరమైన పరిమితులు వుండవు. ఢిల్లీ న్యాయవాది అనీల్ నారియా అటువంటి జ్ఞాన సంపన్నులలో ఒకరు. భారతదేశ చరిత్ర, రాజకీయాలపై సమగ్ర అవగాహన, నిష్పాక్షిక వివేచనతో ఆయన స్ఫూర్తిదాయకమైన విద్వత్‌ కృషి చేశారు. న్యాయవాద వృత్తిలో తలమునకలై వుండి కూడా విశ్రాంత వేళలలో ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు సత్యావిష్కరణకు నిండు తార్కాణాలు. ఆయన రాసిన పలు వ్యాసాలను, అవి మొట్టమొదట ప్రచురితమైనప్పుడే చదివి నా అవగాహనను పెంపొందించుకున్నాను, నా జ్ఞానపరిధిని మరింత విస్తృతం చేసుకున్నాను. ప్రచురితమైన పలు సంవత్సరాల అనంతరం కూడా నేను తరచూ వాటిని చదువుతుంటాను. భారత స్వాతంత్ర్యోద్యమం మీద; గాంధీ, భగత్‌సింగ్, ఇంకా సావర్కార్ మొదలైన చరిత్ర నిర్మాతల మీద అనీల్ నారియా అసాధారణ అంతర్‌దృష్టి, సాధికారతతో రాశారు. అయితే వర్తమాన  చర్చనీయాంశాలకు ఉపయుక్తమైన రెండు వ్యాసాల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర రాజకీయాల గురించి కొన్ని సంవత్సరాల క్రితం రాసిన వ్యాసాలవి. 


మొదటి వ్యాసం 2002 ఆగస్టులో ఢిల్లీ మ్యాగజైన్ ‘మెయిన్ స్ట్రీమ్’లో వెలువడింది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు అడ్డూఅదుపు లేకుండా సాగించిన హత్యాకాండను విపులంగా వివరించిన వ్యాసమది. 1989లో కశ్మీర్‌లో జిహాదీ తిరుగుబాటు ప్రారంభమయింది. స్వతంత్ర కశ్మీర్ ఏర్పాటే లక్ష్యం కావాలని కొందరు ఉద్యమించారు. అలా కాకుండా పాకిస్థాన్‌లో విలీనమవ్వడం మంచిదని మరికొందరు గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ రెండు ప్రత్యామ్నాయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, భారతరాజ్యాంగం పరిధిలో న్యూఢిల్లీతో ఒక ఒప్పందానికి రావడమే కశ్మీర్ ప్రజలకు శ్రేయస్కరమని ఇంకొందరు వాదించారు. అయితే స్వతంత్ర కశ్మీర్ ఏర్పాటు లేదా పాక్‌లో విలీనాన్ని డిమాండ్ చేస్తున్న వారు భారత్‌లోనే ఉండిపోవాలని అభిలషిస్తున్నవారిపై ఒక పథకం ప్రకారం దాడులు చేయడం ప్రారంభించారు. 


1990 దశకంలో ఉగ్రవాద అమానుషాలు ఉధృతమయ్యాయి. భారత్‌లో అంతర్భాగంగా ఉండిపోవాలని కోరుతున్నవారు ఉగ్రవాదుల దృష్టిలో శత్రువులుగా మారిపోయారు. పాకిస్థాన్ ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు పొందుతున్న ఉగ్రవాదులు భారత్ అనుకూల వర్గాల వారిపై దాడులకు పూనుకున్నారు. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కార్యకర్తలు ఉగ్రవాద హింసాకాండకు బలయ్యారు. షేక్ అబ్దుల్లా నేతృత్వంలో ఆవిర్భవించిన క్షణం నుంచీ నేషనల్ కాన్ఫరెన్స్ లౌకికవాద విలువలకు కట్టుబడివున్న పార్టీ. మతప్రోక్త పాకిస్థాన్ రాజ్యవ్యవస్థను ఈ పార్టీ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. 1990–-2002 మధ్య ఇస్లామిక్ ఉగ్రవాదుల హింసాకాండను ఎదుర్కొని బలయిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, కార్యకర్తల గురించి అనీల్ తన వ్యాసంలో వివరించారు. ఇలా హతులైన వారిలో శాసనసభ్యులే గాక గ్రామ స్థాయి, సమితి స్థాయి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు డజన్ల సంఖ్యలో ఉన్నారు. పార్టీ అగ్రనాయకుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాపై ఉగ్రవాదులు పలుమార్లు హత్యాయత్నం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుల, కార్యకర్తల హత్యాకాండను అంతర్జాతీయ మీడియా పూర్తిగా విస్మరించింది. భారతీయ మీడియా సైతం ఆ హత్యాకాండ గురించి ఏ మాత్రం పట్టించుకోక పోవడం మరింత శోచనీయం. 


ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అనీల్ నారియా యాభైమందికి పైగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుల, కార్యకర్తల హత్యా వివరాలను అక్షరబద్ధం చేశారు. నిజానికి ఆ హతుల జాబితా కేవలం సూచనాత్మకమైనదే గానీ, సమగ్రమైనది కాదు. ఇంకా పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఉగ్రవాద హింసాకాండకు తప్పక బలయివుంటారని ఆయన పేర్కొన్నారు. 

ఈ హత్యాకాండ వెనుకవున్న కటువైన రాజకీయ తర్కం గురించి అనీల్ నారియా ఇలా వివరించారు: ‘గత యాభై సంవత్సరాలుగా కశ్మీర్‌లో భారత్ లెక్కకు మించిన తప్పులు చేసింది. అయినప్పటికీ కశ్మీరీ ముస్లింలు భారత రాజ్యంగ పరిధిలో చర్చల ద్వారా సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి సుముఖంగా ఉన్నారు. ఇది జరగకూడదని ఉగ్రవాదులు నిశ్చయించుకున్నారు. అందుకే అటువంటి భారత్ అనుకూల అభిప్రాయంతో వున్న వారిని భౌతికంగా అంతమొందించేందుకు పూనుకున్నారు’. అనీల్ ఇంకా ఇలా రాశారు: ‘భారతదేశంలోని అత్యంత పురాతన రాజకీయ పార్టీలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి. ఇప్పుడు ఈ పార్టీ మనుగడకు ముప్పు ముంచుకొస్తోంది. ఎన్నికలలో ఓడించడం ద్వారా కాకుండా, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులను భౌతికంగా అంతమొందించడం ద్వారా ఆ పార్టీని కశ్మీర్ రాజకీయ జీవితం నుంచి తుడిచి పెట్టేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులు పూనుకున్నారు. వారు పాల్పడుతున్న హత్యాకాండ తీవ్రత సగటు భారతీయునికి పూర్తిగా తెలియని విషయం. నిజం చెప్పాలంటే ఈ మహోన్నత లౌకికవాద పార్టీని కాపాడే విషయం గురించి భారత ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ పార్టీ భవిష్యత్తు గురించి బాధపడిన రాజనీతి శాస్త్రవేత్తలు బహు కొద్ది మంది మాత్రమే. ఆ పార్టీ చరిత్రను రికార్డు చేసిన చరిత్రకారులు సైతం పెద్దగా లేరు. ఉగ్రవాదులు ఆ పార్టీ కార్యకర్తలను చంపడం ప్రారంభమయినప్పుడు ఆ అమానుష ఘటనల గురించి మీడియా పట్టించుకోనేలేదు. పట్టించుకున్నా అప్రాధాన్య వార్తలుగా మాత్రమే నివేదించాయి. ఉబుసుపోక కబుర్లుగా ఆ హత్యల వివరాలను అందించాయి. ఉగ్రవాద బీభత్సంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎంతగా నష్టపోతుందో విశాల భారతదేశానికి సమగ్రంగా తెలియజేయడంలో భారతీయ మీడియా ఉపేక్ష వహించింది’. 


అనీల్ నారియా రెండో వ్యాసం 2005లో చండీగఢ్ పత్రిక ‘ది ట్రిబ్యూన్’లో వచ్చింది. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తలు ఉగ్రవాద హింసాకాండకు ఎలా లక్ష్యమవుతున్నదీ ఈ వ్యాసంలో ఆయన సవివరంగా తెలిపారు. ఈ వ్యాసం వెలువడిన నాటికి మూడు సంవత్సరాల క్రితం జమ్మూ-కశ్మీర్‌లో పీడీపీ అధికారంలో వున్నది. కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని పీడీపీ ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన కారణంగా పీడీపీ కార్యకర్తలను శత్రువులుగా ఉగ్రవాదులు పరిగణించారు. హింసాకాండ ప్రజ్వరిల్లింది. ముప్పై మందికి పైగా పీడీపీ నేతలు, కార్యకర్తలను ఉగ్రవాదులు బలిగొన్నారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా పీడీపీ కార్యకర్తలు ఉగ్రవాదుల కిరాతకాలకు బలవుతూనే వున్నారు. అనీల్ ఇలా వ్యాఖ్యానించారు: 1989లో హిందూత్వ ఉద్యమం ఉధృతమయిన దరిమిలా భారతదేశమంతటా, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ పాలనలో ఉన్న గుజరాత్‌లో మైనారిటీ వర్గాలవారిని, ప్రత్యేకించి ముస్లింలను జాతి వ్యతిరేకులుగా విష ప్రచారం చేయడం ప్రారంభమయింది. ఇందుకు విరుద్ధంగా కశ్మీర్‌లో సంప్రదాయ ముస్లిం నాయకులను నిర్మూలించే క్రూరత్వానికి ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఆ సంప్రదాయ ముస్లిం నాయకలు భారత్‌కు అనుకూలంగా ఉన్నారనే నెపంతో ఉగ్రవాదులు వారి జీవితాలను చిదిమివేశారు.’ 


నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అగ్రనాయకులను నిరవధిక గృహ నిర్బంధానికి గురిచేసిన నేపథ్యంలో అనీల్ నారియా వ్యాసాలను మరోసారి చదవాల్సిన అవసరం ఎంతైనావున్నది. 2019 ఆగస్టు 5న అధికరణ 370 ని రద్దుచేసిన తరువాత, న్యూఢిల్లీ పాలకులు ఒక అనుచిత చర్యకు పాల్పడ్డారు. భారత్ పక్షం వహించిన కశ్మీరీ నాయకులను అన్యాయంగా జైలు పాలు చేయడమే ఆ అమానుషం. ఇదొక విషాదకర పరిణామం. అవినీతి, వంశపారంపర్యపాలనతో సహా ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు భారత్‌కు అనుకూలురు. భారత రాజ్యాంగ పరిధిలో భారత ప్రభుత్వంతో గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే అన్ని విధాల శ్రేయస్కరమని విశ్వసిస్తున్న కశ్మీరీ ముస్లింలకు ఆ నాయకులు ప్రతినిధులు. కశ్మీర్‌లో భారత్‌కు అనుకూలంగా ఉన్న వారు కశ్మీరీ ప్రజానీకంలో ఎన్నడూ అత్యధిక సంఖ్యలో లేకపోవచ్చునేమో కానీ ఆ మైనారిటీ వర్గం పలుకుబడి ఎన్నడూ నిరర్ధకమైనది కాదు. 1990 దశకంలో ఉగ్రవాదులు కశ్మీర్‌ను రక్తసిక్తం చేశారు. అయితే, 2002 ఎన్నికల అనంతరం హింసాకాండ తగ్గుముఖం పట్టింది. ఆ అందాల భూమికి పర్యాటకుల రాక మళ్ళీ ప్రారంభమయింది. కశ్మీర్ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు అదొక మంచి అవకాశమని ఆనాటి ప్రధానమంత్రి వాజపేయి భావించారు. కశ్మీరీలకు స్నేహ హస్తాన్ని చాచారు. ఆయన అనంతరం ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా భారత్ భావనను సామాన్య కశ్మీరీలకు మరింత ఆమోదయోగ్యంగా చేయవలసిన అవసరాన్ని గుర్తించారు. రాజ్యాంగ బహుత్వవాదంతోనూ, ఆర్థికాభివృద్ధి ఫలాలను అందించడం ద్వారా కశ్మీరీలను భారత్‌కు సంపూర్ణంగా సన్నిహితులను చేసేందుకు ఆయన సంకల్పించారు. 


ఇప్పుడు మనం కశ్మీరీలకు ఏమి చెయ్యాలి?

కశ్మీరీలను మరింత గౌరవాదరాలతో చూడాలి. వారి విలక్షణ, సమున్నత సంస్కృతిని గౌరవించి కాపాడాలి. వారి మత విశ్వాసాలను సమాదరించాలి. భారత జాతీయ ఆర్థిక వ్యవస్థలో యువ కశ్మీరీల వృత్తిగత పురోగతికి అన్నివిధాల తోడ్పడాలి. ఇవన్నీ జరిగిన నాడు, స్వతంత్ర దేశంగా ఏర్పడడం లేదా పాకిస్థాన్‌లో విలీమవడం కంటే భారత్‌లో అంతర్భాగంగా వుండేందుకు కశ్మీరీలు తప్పక మొగ్గుచూపుతారు. ఈ సంభావ్యతలో ఎలాంటి సందేహం లేదు. 

అయితే, 2019 ఆగస్టు 5న, ఆ తరువాత మోదీ ప్రభుత్వం కశ్మీర్‌లో చేపడుతున్న చర్యలు ఈ ఆశాభావాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. మళ్ళీ చాలా సంవత్సరాలకు గానీ ఆ ఆశలు మోసులెత్తే అవకాశం లేదు. విశాల భారతదేశంలో మరెవ్వరికీ లేని విధంగా తమకు మాత్రమే ఇంటర్నెట్, ఇతర అధునాతన కమ్యూనికేషన్స్ సదుపాయాలను పూర్తిగా నిలిపివేసినప్పుడు భారత్ జాతీయ ఆర్థిక వ్యవస్థలో తమ ఎదుగుదలకు అవకాశమున్నదని కశ్మీరీలు ఎలా విశ్వసిస్తారు? భారత ప్రభుత్వ నిర్ణయాలు, కార్యాచరణలు తమ పండ్లతోటల సాగును, పర్యాటక రంగాన్ని, హస్తకళల పరిశ్రమలను చావుదెబ్బ కొట్టినప్పుడు, భారత్ తమ సంక్షేమానికి పూచీ వహిస్తుందని కశ్మీరీలు ఎలా భావిస్తారు? కేంద్రంలోని అధికార పక్షం, ప్రభుత్వం, మంత్రులు అనుక్షణమూ ముస్లింలను ప్రమాదకారులుగా చిత్రిస్తున్నప్పుడు తమ సంస్కృతిని భారత్ గౌరవిస్తుందని ఎలా అనుకోగలుగుతారు? ఎన్నడూ హింసాకాండను ప్రేరేపించని, హింసాత్మక పద్ధతులను అనుసరించని, భారత రాజ్యాంగానికి పూర్తిగా నిబద్ధమైన తమ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురిని నిరవధిక గృహనిర్బంధంలో ఉంచిన భారత ప్రభుత్వాన్ని కశ్మీరీలు రాజకీయంగా ఎలా విశ్వసిస్తారు? 

1990వ దశకంలో పాకిస్థాన్ అండదండలతో ఉగ్రవాదులు కశ్మీర్ ప్రధాన స్రవంతి నాయకులను తమ లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఆ నాయకుల నిర్బంధాన్ని, అణచివేతను భారత ప్రభుత్వమే లక్ష్యంగా చేసుకున్నది! కశ్మీర్ లోయలో ఇస్లామిక్ ఉగ్రవాదం మరణ మృదంగం మోగిస్తున్నప్పుడు భారత్ లౌకిక వ్యవస్థ, సమ్మిళిత సంస్కృతిని సంరక్షించేందుకు జీవితాలను త్యాగం చేసినవారు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తలు మాత్రమేనని అనీల్ నారియా సప్రమాణంగా చరిత్రబద్ధం చేశారు. మరి ఇప్పుడు మన ప్రభుత్వమే ఆ రెండు పార్టీల నాయకులను సందేహాస్పద, అల్పమైన ఆరోపణలపై గృహనిర్బంధంలో ఉంచింది! ఇది మిత్ర వంచన కాదూ? కశ్మీర్‌లో మన పక్షాన నిలబడినవారిని ఇలా వేధించడం భారత్‌కు మేలు చేస్తుందా?




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2020-02-15T06:29:34+05:30 IST