మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , First Publish Date - 2022-07-01T06:17:17+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ శ్రీహర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- వైద్య సిబ్బందికి కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, 30 : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ శ్రీహర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వైద్యాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఆసుపత్రికి అనేక ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులతో నర్సులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, వారితో మంచిగా మాట్లాడి వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతీ రోజు రోగుల కుటుంబాలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతీ వారం సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆసుపత్రితో పాటు ఆవరణలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఏడు గురు గైనకాలజిస్టులు షెడ్యూల్‌ ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీసారు. ప్రతీ నెల కాన్పుల కోసం ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇతర ఆసుపత్రులకు రెఫర్‌ చేసే సమయంలో రోగుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌, డాక్టర్లు వరలక్ష్మి, శోభారాణి పాల్గొన్నారు. 


జూలై చివరి నాటికి పూర్తి చేయాలి

సఖి కేంద్రం (వన్‌స్టాప్‌ సెంటర్‌) భవన నిర్మాణ పనులను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ క్వార్టర్స్‌ వద్ద రూ.48 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సఖి కేంద్రం భవన నిర్మాణ పనులను గురువారం ఆయన తనిఖీ చేశారు. పనులు నాణ్యవంతంగా ఉండాలని, ఫ్లోరింగ్‌, కలరింగ్‌, ఫినిషింగ్‌ త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట శిశు సంక్షేమశాఖ అధికారి ముషాయిదాబేగం, డిప్యూటీ ఈఈ శ్రీనివాసులు, ఏఈ మోహన్‌రెడ్డి ఉన్నారు.


డాక్టర్‌ నర్మద సస్పెన్షన్‌

విధుల్లో నిర్లక్ష్యంగా వహించి నవజాత శిశువు మృతికి కారణమైన డాక్టర్‌ నర్మదను సస్పెండ్‌ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ధరూర్‌ మండలం జాంపల్లికి చెందిన దీపిక మొదటి కాన్పుకోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, డ్యూటీ డాక్టర్‌  నర్మద విధుల్లో అలసత్వం వహించడంతో నవజాత శిశువు మృతి చెందింది. దీంతో డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు సూపరెంటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బుధవారం ఽధర్నా నిర్వహించారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి, డాక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-07-01T06:17:17+05:30 IST