బెట్టింగ్‌.. గ్యాంబ్లింగ్‌

ABN , First Publish Date - 2021-10-05T04:47:55+05:30 IST

కొంచెం తెలివితేటలు.. మరికొంచెం లక్‌ ఉంటే చాలు రూ. లక్షలు సంపాదించొచ్చంటూ ఆన్‌లైన్‌లో విదేశీ బెట్టింగ్‌ సైట్లు యువతను బుట్టలో వేసుకుంటున్నాయి.

బెట్టింగ్‌.. గ్యాంబ్లింగ్‌

యథేచ్చగా ఆన్‌లైన్‌లో నిర్వహణ

బెట్టింగ్‌ జాబితాలో క్రీడలు, రాజకీయాలు

జేబులు గుల్లవుతున్నా వ్యసనంలా మారిన వైనం

ఆన్‌లైన్‌లో అందుబాటులో విదేశాల్లో నిషేధిత సైట్లు

విదేశీ వెబ్‌సైట్ల దోపిడీపై దృష్టి పెట్టని స్థానిక పోలీసులు

 


బెట్టింగ్‌ రూటు మారింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకున్న వారు విలవిలలాడుతున్నారు. క్రీడలే కాదు.. రాజకీయాలనూ బెట్టింగ్‌ జాబితాలో చేర్చేశారు. అదీ ఇదీ అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ బెట్టింగ్‌లు పెట్టి గ్యాంబ్లింగ్‌ చేస్తున్నారు. విదేశాల్లో నిషేధిత సైట్లు ఇక్కడ యథేచ్ఛగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. బెట్టింగ్‌ల బారిన పడి పలువురు రూ.లక్షల డబ్బును పోగొట్టుకుంటున్నారు. కొన్ని బెట్టింగ్‌ సైట్లయితే బెట్టింగ్‌ డబ్బు మొత్తం పోకుండా కొంత వెనక్కు ఇచ్చేస్తామంటూ ఆశచూపి మరీ బెట్టింగ్‌ ఉచ్చులోకి దించుతున్నాయి. ఒకసారి బెట్‌ కొడితే రూ.లక్షలు వస్తాయన్న ఆశతో జేబులు గుల్లవుతున్నా వదలకుండా అప్పులు చేసి మరీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు దిగుతున్నవారు ఎందరో ఉన్నారు. విదేశాల్లో నిషేధించినా ఇక్కడ లీగల్‌ అంటూ వెబ్‌సైట్‌లో పెట్టిమరీ గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకునేవారే లేరు. స్థానికంగా కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు పెట్టి ఆన్‌లైన్‌లో బెట్టింగులకు దిగుతున్న లోకల్‌ ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నారు కానీ, ఆన్‌లైన్‌లో అడ్డగోలుగా దోచుకుంటున్న విదేశీ వెబ్‌సైట్లపై మాత్రం దృష్టి పెట్టడంలేదు.


తెనాలి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కొంచెం తెలివితేటలు.. మరికొంచెం లక్‌ ఉంటే చాలు రూ. లక్షలు సంపాదించొచ్చంటూ ఆన్‌లైన్‌లో విదేశీ బెట్టింగ్‌ సైట్లు యువతను బుట్టలో వేసుకుంటున్నాయి. రష్యా, యూకే, యూఎస్‌ఏ వంటి దేశాల నిషేధిత జాబితా, మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న  సైట్లు మన ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్నాయి. లీగల్‌ అంటూ ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారంతో ఎక్కువ మంది బెట్టింగ్‌లకు దిగుతున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు ఎందరో ఆన్‌లైన్‌ బెట్టింగులతో ఇల్లు గుల్ల చేసుకున్నవారున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తున్నా, ఆ సైట్లు విదేశాలకు చెందినవి కావడంతో మన పోలీసులు పెద్దగా దృష్టి సారించటంలేదు. క్రీడల నుంచి రాజకీయాల వరకు బెట్టింగ్‌లకు తెరతీస్తున్నారు. ప్రధానంగా క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ వంటి క్రీడలపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. వీటితోపాటే కాసినో, రమ్మీ, టీవీ గేమ్‌లు, కార్‌ రేస్‌లు, బోట్‌ రేస్‌, కార్‌ రేస్‌లు వంటివి చాలానే ఉన్నాయి. యూఎఫ్‌సీ(అల్టిమేట్‌ ఫైటింగ్‌ చాంపియన్‌షిప్‌) ఫైట్‌ నైట్‌ వంటి వాటికి మంచి ఆదరణే ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై భారీ బెట్టింగ్‌లే సాగుతున్నాయి. చివరకు 2021ల జరిగిన ఐపీఎల్‌నూ వదల్లేదు. ఈ-స్పోర్ట్స్‌ గేమ్‌లకైతే లెక్కేలేదు. ఇవే కాదన్నట్టు ఆ సైట్‌లే సైబర్‌ ప్రపంచ కప్‌లను పెట్టేసి వాటిలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి ప్రధాన క్రీడలతోపాటు కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బౌలింగ్‌, హ్యాండ్‌బాల్‌, ఐస్‌ హాకీ, వంటివాటిని కూడా ఆడించేస్తున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రపంచ దేశాల రాజకీయాలనూ బెట్టింగ్‌కు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మన సైబర్‌ పోలీసులు మాత్రం వీటిపై దృష్టే పెట్టడంలేదు. 


విదేశాల్లో నిషేధం.. ఇక్కడేమో యథేచ్ఛగా

విదేశాల్లో నిషేధించిన బెట్టింగ్‌ సైట్లలో ప్రధానంగా 1 ఎక్స్‌ బెట్టింగ్‌ అనే సైట్‌ మన దగ్గర ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకొచ్చి, జనం నుంచి భారీ మొత్తంలో దోపిడీకి తెరతీస్తోంది. ఇదే కోవలో ఇంకా చాలాసైట్లే ఉన్నాయి. వివిధ దేశాలు ఈ సైట్‌ను నిషేధించాయి. రష్యా అయితే ఈ సంస్థపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. యూకే ప్రభుత్వం అయితే అంతర్జాతీయ వాంటెడ్‌ లిస్ట్‌లో చేర్చింది. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద బెట్టింగ్‌ కంపెనీ లిస్ట్‌లో చేర్చారు. అయినా మన జనం ఇవేమీ పట్టనట్టు సైట్‌లలో రిజిష్టర్‌ చేసుకుని మరీ బెట్టింగులకు దిగుతూనే ఉన్నారు. భారత ప్రభుత్వం అనుమతించిన సైట్‌గా, తమకు లీగల్‌ హక్కులున్నాయంటూ చూపటం విశేషం. 


లీగల్‌ వ్యాపారం అంటూ...

ఈ బెట్టింగ్‌ సైట్లకు లీగల్‌ అనుమతులున్నాయంటూ సైట్లలోనే రాతలు రాస్తున్నారు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలంటూ హాట్‌లైన్‌ నంబర్లను ఇచ్చేస్తున్నారు. లింక్‌ కోసం ఫోన్‌ నంబర్‌ను కూడా చూపుతున్నారు. అయితే మన దగ్గర లీగల్‌ బెట్టింగ్‌ సైట్లంటూ వేటిని చూపారో అవే విదేశాల్లో నిషేధంలో ఉన్నాయి. అయినా మన దగ్గర మాత్రం అంతా సక్రమమే అన్నట్టు బెట్టింగ్‌ దందా నడుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో ఏ అడ్డంకులు లేవని నిర్భయంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లకు దిగుతున్నారు. చివరకు మన రాష్ట్రం నిషేధించిన రమ్మీ, తీన్‌పట్టీ వంటివికూడా స్కిల్‌ గేమ్స్‌ జాబితాలో ఉన్నాయి. పైగా బెట్టింగ్‌ జరిపే మొత్తానికి జీఎస్టీ కూడా చెల్లిస్తున్నామంటున్నారు. ఇంత నిర్భయంగా విదేశీ నిషేధిత బెట్టింగ్‌ సైట్లు చెలరేగిపోతుంటే ప్రభుత్వం ఎప్పుడు దృష్టి పెడుతుందో చూడాలి. 

   

Updated Date - 2021-10-05T04:47:55+05:30 IST