మళ్లీ రావచ్చు జాగ్రత్త

ABN , First Publish Date - 2020-09-15T05:30:00+05:30 IST

కోవిడ్‌ సృష్టిస్తున్న కల్లోలానికి ఇప్పుడిప్పుడే ముగింపు లేదా? ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర మరణాల సంఖ్య తక్కువగా ఎందుకుంది?

మళ్లీ రావచ్చు జాగ్రత్త

కోవిడ్‌ సృష్టిస్తున్న కల్లోలానికి ఇప్పుడిప్పుడే ముగింపు లేదా? ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర మరణాల సంఖ్య తక్కువగా ఎందుకుంది? అసలు మన దేశంలో ఇంతకు ముందు కరోనా ఎప్పుడైనా వచ్చిందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో.. వీటికి సమాధానాలు తెలుసుకోవటానికి ఇటు శాస్త్రవేత్తలు.. అటు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కోవిడ్‌పై మన దేశంలోనూ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలు చేస్తున్న వైద్యుల్లో ప్రమఖులు డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి. ఒకవైపు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఛైర్మన్‌గా రోగులకు చికిత్స చేస్తూనే మరో వైపు కోవిడ్‌పై పరిశోధనలు చేస్తున్న నాగేశ్వరరెడ్డిని నవ్య పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. 


దీర్ఘకాల ప్రభావమిది..


కోవిడ్‌ నుంచి అనేక మంది కోలుకుంటున్నారు.. వారిపై దీర్ఘకాలంలో వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?


ఇప్పటి దాకా కోవిడ్‌ వస్తే ఏం చేయాలి? అనే విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన ముందు- కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి మళ్లీ కోవిడ్‌ వస్తుందా? లాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


కోవిడ్‌ తీవ్రంగా లేని వారు త్వరగానే కోలుకుంటారు. సాధారణ స్థితికి చేరుకుంటారు. కానీ ఈ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా వస్తే ఆ ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. ఇది తాత్కాలికమైనది కాదు. దీనినే వైద్య పరిభాషలో ‘లాంగ్‌ కోవిడ్‌’ అంటున్నారు. కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా పడినప్పుడు ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. ఆక్సిజన్‌ సరిగ్గా అందకపోతే శరీరంలోని భాగాలు సక్రమంగా పనిచేయవు. కొందరికి ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయాల్సి ఉంటుంది. లాంగ్‌ కోవిడ్‌ వల్ల కలిగే లక్షణాల్లో ఇదొకటి. ఇక దీని వల్ల కొన్ని రకాల ఆటో ఇమ్యూన్‌ జబ్బులు వస్తాయి. దీనిని ఇప్పుడిప్పుడే మనం గుర్తిస్తున్నాం. దీని గురించి కొద్దిగా వివరిస్తా.


సాధారణంగా మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ- బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైర్‌సలపై పోరాడుతుంది. కానీ కోవిడ్‌ వైరస్‌ ఈ రోగనిరోధక వ్యవస్థలోకి కూడా చొచ్చుకుపోతుంది. అక్కడ కొన్ని రకాల కణాలు తయారయ్యేలా ప్రేరేపిస్తుంది. అంటే మన శరీరంలో కణాలు ఒకదానితో మరొకటి పోరాడుతూ ఉంటాయి మాట! పిల్లల్లో కవాసకీ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌ వస్తుందని ఇప్పటికే గమనించారు. ఈ వ్యాధి ఉన్న వారిలో రక్తకణాలు గట్టిపడతాయి.


దీని వల్ల జ్వరం, కీళ్ల నొప్పులు, చిన్న వయస్సులోనే బీపీ మొదలైనవి వస్తాయి. ఈ లాంగ్‌ కోవిడ్‌ ప్రభావం మరో మూడు, నాలుగు నెలల్లో బయటపడుతుంది. అప్పుడు అనేక కేసులు బయటపడతాయి. కోవిడ్‌కు.. లాంగ్‌ కోవిడ్‌కు మధ్య చాలా తేడా ఉంది.  కోవిడ్‌లో లక్షణాలు కొందరిలోనే తీవ్రంగా ఉంటాయి. లాంగ్‌ కోవిడ్‌లో మాత్రం తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.


తీవ్రంగా వచ్చే లక్షణాలివే..

కోవిడ్‌ పేషెంట్లలో గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి?


మా అధ్యయనం ప్రకారం- కోవిడ్‌ సోకిన 20 శాతం మందిలో విరోచనాలు, వికారం, వాంతులు, పొట్టనొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలి. కోవిడ్‌ సోకిన రోగులకు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉంటే పర్వాలేదు. వాటికి చికిత్స చేయగలం.


గ్యాస్ట్రో సంబంధిత లక్షణాలు తక్కువ సమయంలో తీవ్రమయిపోతాయి. రోగి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. దీనికి ఒక కారణం ఉంది. కోవిడ్‌ వైరస్‌ ఉపిరితిత్తులపైన.. శ్వాసకోశ వ్యవస్థపైన దాడి చేయటంతో పాటుగా కాలేయం సహా గ్యాస్ట్రో వ్యవస్థను దెబ్బతీస్తుంది. మన శరీరంలో కాలేయం చాలా సున్నితమైన అవయవం కాబట్టి దానిపై వైరస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.


వ్యాక్సిన్‌ వచ్చేస్తుంది..

ప్రస్తుతం వ్యాక్సిన్లపైనే ప్రజలందరూ ఆశపెట్టుకున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ పరీక్షలు ఆపివేశారనగానే అనేక మంది నిరాశ చెందారు. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది?


అనేక మంది నాకు ఫోన్‌ చేసి- ‘వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది? ఆక్స్‌ఫర్డ్‌ ప్రయోగాలు విఫలయ్యాయట..’ అని అడుగుతున్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి చాలా సున్నితమైన అంశం. అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్లను పరీక్షిస్తారు.


ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాక్సిన్‌ను ఇస్తే- జ్వరం, తలనొప్పి, కండరాల నెప్పులు వంటి కొన్ని సాధారణమైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొందరిలో బీపీ పడిపోవటం.. గుండె కొట్టుకొనే తీరులో మార్పులు రావటం వంటి అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాక్సిన్‌ పరీక్షలను ఆపుచేస్తారు. అప్పటి దాకా వచ్చిన ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషించటానికి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పరీక్షలను మళ్లీ ప్రారంభిస్తారు.


ఇలా గుర్తించాలి..

ప్రస్తుతం వానలు పడుతున్నాయి. ఈ సమయంలో విరోచనాలు, వాంతులు వంటివి చాలా మందిలో సాధారణమే! అలాంటప్పుడు కోవిడ్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి?


కోవిడ్‌ తీవ్రంగా సోకిన వారందరికీ దగ్గు, ఆయాసం తప్పనిసరిగా ఉంటుంది. కొద్ది మందిలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు. వీటితో పాటుగా విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలుంటే అది కోవిడ్‌కి సంకేతమే!


కోవిడ్‌ ఇప్పుడు సామాజిక వ్యాప్తి చెందుతోంది. దీని నుంచి తప్పించుకోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

కోవిడ్‌ సోకిన వారిలో రోగనిరోధక కణాలు వృద్ధి చెందుతాయి. కానీ అవి రాకుండా చూసుకోవాలంటే- రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవాలి. ఇది కొన్ని మందులు వేసుకుంటే వచ్చేది కాదు. కానీ పౌష్టికాహారం తీసుకోవటంతో పాటుగా జింక్‌, విటమిన్‌ మాత్రలు వేసుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడ విటమిన్‌ డికి ఉన్న ప్రాముఖ్యతను కచ్చితంగా చెప్పాలి.


మా దగ్గరకు వచ్చిన కోవిడ్‌ రోగుల్లో ఎక్కువ మందికి విటమిన్‌ డి తక్కువగా ఉంటోంది. దీని ఆధారంగా చూస్తే- కోవిడ్‌ వ్యాప్తి చెందటంలో విటమిన్‌ డి పాత్ర ప్రముఖంగా ఉందని భావించవచ్చు. ఇక చాలా మంది విటమిన్‌ డి కేవలం ఎముకల బలానికి.. కాల్షియం వృద్ధి కావటానికి మాత్రమే ఉపకరిస్తుందనుకుంటారు. కానీ మన రోగనిరోధక శక్తిని పెంచటంలో విటమిన్‌ డి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మన వద్ద చాలా మందికి విటమిన్‌ డి తక్కువగా ఉంటుంది.

అందువల్ల అందరూ వచ్చే మూడు నెలలు వారానికి ఒక సారి విటమిన్‌ డి మాత్రలు వేసుకుంటే మంచిది. వీటితో పాటుగా ప్రతి రోజూ జింక్‌, విటమిన్‌- సి మాత్రలు కూడా వేసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.




40 ఏళ్ల క్రితమే కరోనా..

కోవిడ్‌ కొత్తగా వ్యాపిస్తున్న వ్యాధి కదా.. దీని గురించి మనకు ముందే తెలుసా?

దాదాపు 40 ఏళ్ల క్రితం వెల్లూరు చుట్టూపక్కల ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు విరోచనాలతో చనిపోవటం మొదలుపెట్టారు. ఆ సమయంలో డాక్టర్‌ మాథవన్‌ అనే వైద్యుడు ఆ గ్రామాల్లో తిరిగి పరిశోధనలు చేసి.. ఈ విరోచనాలకు కారణం- వారి పేగులకు సోకిన కరోనా వైరస్‌ అని తేల్చారు. దీనిని కొన్ని అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి కూడా.


అయితే అదృష్టం కొలది- ఆ సమయంలో ఇది ఎక్కువ ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదు. బహుశా ఇప్పుడున్నన్ని రవాణా సౌకర్యాలు అప్పుడు లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు- కోవిడ్‌ ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూసిస్తోంది. కానీ ఆ సమయంలో పేవులపై చూపించింది.


ఆ సమయంలో ఏం మందులిచ్చారు? ఎలాంటి ప్రొటోకాల్స్‌ పాటించారు?

ఇవన్నీ కూడా అంతర్జాతీయ పత్రికల్లో స్పష్టంగా ఉన్నాయి. ఆ సమయంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. పైగా పరిస్థితులు కూడా వేరు. అయినా అప్పుడు కూడా ఇప్పుడు వాడిన మందులే వాడారు.  ఫోలిక్‌ యాసిడ్‌, బి కాంప్లెక్స్‌, జింక్‌, విటమిన్‌ సి వంటివి ఇచ్చారు. ఇక్కడ ఒక విశేషమేమిటంటే- ఈ విషయం చాలా మందికి తెలియదు. అప్పుడు డాక్టర్‌ మాధవన్‌ చేసిన పరిశోధనాపత్రాలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి.



ఆ జన్యువుంది కాబట్టే..

జన్యుపరంగా కోవిడ్‌ను ఎలా చూడాలి? దీనిపై మీరు చేసిన అధ్యయనాలఫలితాలేమిటి?

ప్రతి వ్యక్తి జన్యువులు ఒకేలా ఉన్నా.. కొన్ని తేడాలుంటాయి. ఇవి వ్యాధులు రావటానికి లేదా రాకపోవటానికి కారణమవుతాయి. కోవిడ్‌ విషయానికి వస్తే- ఈ వైరస్‌ వల్ల కొందరిలోనే ఎందుకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయనే విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. జీనోవ్‌ వైడ్‌ ఎసెస్‌మెంట్‌ (జీవాస్‌) అనే అని పిలిచే ఈ తరహా అధ్యయనం వల్ల మనకు అనేక విషయాలు తెలుస్తాయి.


ఇక మేము చేసిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. వీటిని ఒక అంతర్జాతీయ సైన్స్‌ పత్రిక త్వరలోనే ప్రచురిస్తుంది. అందువల్ల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేను. సూక్ష్మంగా మాత్రం కొన్ని విషయాలు చెబుతాను. మా పరిశోధనల్లో- కోవిడ్‌ తీవ్రంగా సోకటానికి మూడు జన్యువులు కారణమవుతున్నాయి.


అంతే కాకుండా దక్షిణాసియాకు చెందిన ప్రజల్లో- అంటే భారతీయులు, చైనీయులు, జపనీయులులో దీని ప్రభావం తక్కువ ఉంది. దీనికి కారణం వీరిలో ఉండే ఒక జన్యువని మేము కనుగొన్నాం. అంటే మన జన్యువుల్లోనే కోవిడ్‌ రక్షణ ఉంది. వైరస్‌ మన శరీరంలో ప్రవేశించటానికి కొన్ని చర్యలు జరగాలి. ఈ చర్యలు జరగటానికి కారణమయిన జన్యువు భారతీయుల్లో మార్పు చెందింది. దీని వల్ల తీవ్రత బాగా తక్కువగా ఉంది. లాటిన్‌ అమెరికాకు చెందిన ప్రజల్లో ఈ జన్యువులో మార్పు లేకపోవటం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.



గతంలో మలేరియా ఎక్కువగా వ్యాప్తి చెందిన దేశాల్లో కోవిడ్‌ తక్కువ వ్యాపిస్తుందనే వాదన కూడా ఉంది కదా..

ఇది తప్పు. 

మలేరియా, టీబీ, టైఫాయిడ్‌ వంటివి పూర్తిగా భిన్నమైనవి. కోవిడ్‌ పూర్తి భిన్నమైనది. ఈ సాంక్రమిక వ్యాధులను కోవిడ్‌ను పోల్చకూడదు.





మందులివే..


అందరూ ఈ మందులు వాడవచ్చా?

వాడచ్చు. సాధారణంగా బికాంప్లెక్స్‌ మాత్రలు వేసుకుంటే అన్ని రకాల సూక్ష్మపోషకాలు అందుతాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఉదాహరణకు చాలా బీకాంప్లెక్స్‌ మాత్రల్లో జింక్‌ ఐదు మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి కనీసం 40 నుంచి 60 మిల్లీగ్రాముల జింక్‌ అవసరముంటుంది. అందువల్ల జింక్‌ మాత్రలు ప్రత్యేకంగా తీఐసుకోవాలి.


దీనితో పాటుగా విటమిన్‌ సి మాత్రలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం చెబుతా. ఈ మందులు వాడితే కోవిడ్‌ తగ్గుతుందనే విషయం మనకు ముందే తెలుసు.



మహిళలల్లో కోవిడ్‌ తక్కువ..


మీరు అనేక మంది కోవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్నారు. వ్యాధి సోకే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా ఉందా?

పురుషుల కన్నా మహిళల్లో కోవిడ్‌ తక్కువగా వ్యాపిస్తోంది. దీనికి కారణం హార్మోన్లు కావచ్చు. మా అధ్యయనాల్లో- టెస్టోస్టిరాయిన్‌ శాతం ఎక్కువున్న వారికి కోవిడ్‌ త్వరగా సోకుతోందని తేలింది. అంతే కాకుండా ఒకే కుటుంబంలో- మహిళలకు కోవిడ్‌ సోకటం లేదు. పురుషులకు సోకుతోంది.



Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST