నిర్లక్ష్యం తగదు!

ABN , First Publish Date - 2021-02-23T06:40:13+05:30 IST

జ్వరం, దగ్గు, అలసట లాంటివి కొవిడ్‌ ప్రధాన లక్షణాలు. అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సూచన మేరకు ఇంటి వైద్యంతో కొవిడ్‌ను అదుపు చేయగలుగుతున్నా, కొన్ని లక్షణాలను తీవ్రంగా పరిగణించాలని అంటున్నారు వైద్యులు...

నిర్లక్ష్యం తగదు!

జ్వరం, దగ్గు, అలసట లాంటివి కొవిడ్‌ ప్రధాన లక్షణాలు. అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సూచన మేరకు ఇంటి వైద్యంతో కొవిడ్‌ను అదుపు చేయగలుగుతున్నా, కొన్ని లక్షణాలను తీవ్రంగా పరిగణించాలని అంటున్నారు వైద్యులు. వాటిని నిర్లక్ష్యం చేసినా, సకాలంలో వైద్య చికిత్స అందించకపోయినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదకర లక్షణాలు ఏవంటే....


శ్వాసలో ఇబ్బంది: 

దైనందిన జీవితంలో ప్రతి రోజూ చేసే పనులే ఊపిరి తీసుకోలేనంత అలసటను కలిగిస్తున్నా, దుస్తులు ధరించడం, ఇల్లు శుభ్రం చేయడం, మెట్లు ఎక్కడం లాంటి పనులు చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. ఇతరత్రా కొవిడ్‌ లక్షణాలేవీ లేకపోయినా, మాట్లాడేటప్పుడు మధ్యలో ఊపిరి పీల్చుకోకుండా పూర్తి వాక్యం ముగించలేకపోతున్నా వైద్యులను ఆశ్రయించాలి.


తలతిరుగుడు, స్పృహ కోల్పోవడం: 

తల తిరుగుతున్నట్టు అనిపించినా, హఠాత్తుగా స్పృహ కోల్పోయినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి అంతర్గత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సంకేతాలు. సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం, అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌కు కూడా ఇవి సంకేతాలు. ఊపిరితిత్తులలో ఆక్సిజన్‌ లోపాన్ని తెలిపే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.. కాబట్టి ఈ లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. 

కొవిడ్‌ లక్షణాలు ఎంత స్వల్పమైనవైనా సొంత వైద్యంతో సరిపెట్టుకోకుండా కొవిడ్‌ పరీక్ష చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోవాలి. పాజిటివ్‌ ఫలితం వస్తే వైద్యులు సూచించిన విధంగా నడుచుకోవాలి. లక్షణాలను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడంలో అలసత్వం ప్రదర్శించకూడదు.

Updated Date - 2021-02-23T06:40:13+05:30 IST