కొవిడ్‌పై అప్రమత్తం

ABN , First Publish Date - 2020-11-27T05:57:33+05:30 IST

కొవిడ్‌ రెండో దశ మొదలైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు.

కొవిడ్‌పై అప్రమత్తం

  1. రెండో దశ మొదలైతే కట్టడి చర్యలపై 
  2. కలెక్టర్‌ వీరపాండియన్‌ సమీక్ష

కర్నూలు(హాస్పిటల్‌/అర్బన్‌), నవంబరు 26: కొవిడ్‌ రెండో దశ మొదలైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో రెండో దశ కట్టడి చర్యలపై జిల్లా వైద్యాధికారులు, నోడల్‌ అధికారులతో సమీక్షించారు. రోజుకు ఆరు వేల కరోనా టెస్టులు తప్పకుండా చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్లాస్మా థెరపీ కోసం చాలా ఖర్చుచేసి కర్నూలు మెడికల్‌ కళాశాలలో పరికరాలు ఏర్పాటు చేశామని, కానీ ప్లాస్మా సేకరణలో చాలా వెనుక బడ్డామని అన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌కు సూచించారు.


పాజిటివ్‌ 21.. ఒకరి మృతి

జిల్లాలో గురువారం 21 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. బాధితుల సంఖ్య 60,165కు చేరింది. ఇందులో 191 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 59,488 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతున్నవారిలో ఒకరు మృతి చెందారు. మరణాల సంఖ్య 486కి చేరింది.


ఘాట్లలో పాజిటివ్‌ కలకలం

తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు, సిబ్బందికి ఘాట్లలోని మెడికల్‌ క్యాంప్‌లలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ కిట్ల ద్వారా గురువారం 128 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. సంకల్‌బాగ్‌ ఘాట్‌లో ఓ భక్తుడికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలోని 23 ఘాట్లలో 3,052 మందికి ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌, ఓ భక్తుడికి, రాంభొట్ల దేవాలయం ఘాట్‌ వద్ద చిత్తూరు జిల్లా కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకూ ఘాట్లలోని నిర్వహించిన పరీక్షల్లో 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 14 మంది పోలీసులు, ఒక భక్తుడు ఉన్నారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌లో అత్యధికంగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-11-27T05:57:33+05:30 IST