లెక్కకు మించి..

ABN , First Publish Date - 2021-06-08T04:03:53+05:30 IST

జిల్లాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని చెప్పేందుకు అధికారులు సరైన లెక్కలు చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్యపై కూడా వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా అధికారుల నివేదికలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

లెక్కకు మించి..
జలుమూరు : బొడ్డపాడు గ్రామంలో కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది


- జిల్లాలో కొనసాగుతున్న కొవిడ్‌ విజృంభణ

- పరీక్షల సంఖ్య తగ్గించి.. ‘పాజిటివ్‌’ తక్కువగా చూపుతున్న అధికారులు 

- మరణాల సంఖ్యలోనూ వ్యత్యాసం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని చెప్పేందుకు అధికారులు సరైన లెక్కలు చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్యపై కూడా వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా అధికారుల నివేదికలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో వందలోపే పాజిటివ్‌ కేసులు నమోదుకాగా... ఈ ఏడాది ఆ సంఖ్యకు రెండు రెట్లు ఎక్కువగానే ఉంది. మరణాల సంఖ్య ప్రతిరోజు పదుల్లో ఉండగా, కేవలం పదిలోపే సంభవిస్తున్నట్టు లెక్కలు చూపుతున్నారు. జిల్లాలో రెండో దశ వైరస్‌ వ్యాప్తి విజృంభణ కొనసాగుతూనే ఉన్నా.. అధికారులు కావాలనే ‘పాజిటివ్‌’ నమోదు తక్కువగా చూపుతున్నారని   ఆరోపిస్తున్నారు. రెండో దశ వైరస్‌ వ్యాప్తి ప్రారంభంలో రోజుకు సుమారు 8వేలకుపైగా కరోనా పరీక్షలు చేయగా.. 1200 నుంచి 2 వేల లోపు పాజిటివ్‌ కేసులు బయటపడేవి. తాజాగా నమూనాల సేకరణ తగ్గించడంతో.. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతే తప్ప కరోనా విజృంభణ తగ్గడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో రోజుకు కనీసం 50 మందికి పరీక్షలు చేయాలి. కానీ చాలాచోట్ల అంతస్థాయిలో శ్వాబ్‌ నమూనాలు సేకరించడం లేదు. దీంతో కేసుల నిర్ధారణ తగ్గుతోంది. సోమవారం 2,872 మంది నుంచి శ్వాబ్‌ నమూనా సేకరించగా, కేవలం 166 కొత్త పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 

ఇదీ పరిస్థితి

- ఈ నెల 1న అధికారిక లెక్కల ప్రకారం.. 6,032 శాంపిల్స్‌ సేకరించగా, 693 మందికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. 

- 2న 5,413 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించగా 561 మందిలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. 

- 3న 4,840 మందికి పరీక్షలు చేయగా, 465 మందికి..

- 4న 4,777 మందికి పరీక్షలు చేయగా,  427 మందికి..

- 5న   3,771 మంది నుంచి నమూనాలు సేకరిస్తే, 383 మందికి, 

- 6న 3,967 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించగా, 381 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

.. ఇలా ప్రతి వెయ్యి శాంపిల్స్‌లో 50కి తక్కువ కాకుండా కేసులు బయట పడుతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెరిగితే.. పాజిటివ్‌ కేసులు కూడా ఆ రోజు కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి. శ్వాబ్‌ నమూనాల సేకరణ తగ్గితే.. పాజిటివ్‌లు కూడా తక్కువ చూపుతున్నట్టు వెల్లడవుతోంది. 


 మారుమూల గ్రామాల్లో పరీక్షలేవీ? 

మారుమూల గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రధానంగా సీతంపేట ఐటీడీఏ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించడం లేదని సమాచారం. ఇటీవల అధికారులు నిర్వహించిన పీవర్‌ సర్వే నివేదికలు ఇంకా జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో చేరలేదు. ఈ సర్వే కూడా మొక్కుబడి తంతుగానే సాగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. నిత్యం ప్రభుత్వం వెల్లడిస్తున్న కొవిడ్‌ బులిటెన్‌కు.. జిల్లాలో పరిస్థితులకు పూర్తి తేడా కనిపిస్తోంది. కరోనా పరీక్షల నిర్వహణ, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకల సామర్థ్యం, సరఫరా, ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నవారి సంఖ్య వంటివి పూర్తిగా వ్యత్యాసం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య నామమాత్రంగా ఉంది. దీంతో కేసుల తగ్గుదల కనిపిస్తోంది. గతంలో ఇంట్లో ఒకరికి  పాజిటివ్‌ నిర్ధారణ అయితే.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు విధిగా కరోనా పరీక్షలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామాల్లో లక్షణాలు కనిపిస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సూచించే మందులను కొనుగోలు చేసి  వాడుతున్నారు. దీంతో అనేకమంది టైపాయిడ్‌, మలేరియా మందులు వాడి కొవిడ్‌ నిర్ధారణ జరగక చనిపోతున్నారు. ఆ మరణాలు ప్రభుత్వ లెక్కల్లో చేరడం లేదు. సాధారణ మరణాల జాబితాలో చేరిపోతున్నాయి. పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, సోంపేట, పాతపట్నం, మెళియాపుట్టి ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి.  


 మరణాల సంఖ్యలో తేడా....

కరోనా బాధిత మృతుల సంఖ్యలోనూ భారీగా తేడా కనిపిస్తుంది. మరణ నివేదికల్లో  తప్పులు దొర్లుతున్నాయి. ప్రతిరోజు శ్రీకాకుళం, రిమ్స్‌, జెమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రులతో పాటు గుర్తింపు పొందిన మరో 11 ప్రైవేటు ఆసుపత్రులలో కరోనాతో పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. కానీ, కేవలం సింగిల్‌ డిజిట్‌ మాత్రమే ప్రభుత్వ నివేదికల్లో పేర్కొంటున్నారు. సోమవారం 9 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇటీవల పలాస-కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌తో శ్రీకాకుళం రిమ్స్‌లో మృతి చెందారు. ఆయన మృతికి కారణం చూపకుండా సాధారణ మరణంగా పేర్కొంటూ డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఇటువంటి బాధితులు అనేకమంది ఉన్నారు. రిమ్స్‌, జెమ్స్‌ తదితర కొవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలతో చేరి.. మృతిచెందితే.. కొంతమంది దీర్ఘకాలిక రోగాలతోనే ప్రాణాలు కోల్పోయినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. కేసులు సంఖ్య తగ్గుతున్నట్టు చూపడంతో జిల్లాకు ఆక్సిజన్‌ అవసరాలు అంతగా లేవనే సంకేతాలు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. అధికారుల వెల్లడించిన నివేదికలతో కాకుండా.. కరోనా విజృంభణను దృష్టి ఉంచుకుని జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 


కరోనాతో 9 మంది మృతి

 జిల్లాలో కరోనా బారిన పడి సోమవారం మరో 9 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 630కి చేరింది. కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రం కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 2,872 మందికి కరోనా పరీక్షలు చేయగా, 166 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. జిల్లాలో ఇప్పటివరకూ 12,91,447 మంది నుంచి శ్వాబ్‌ నమూనాలు సేకరించగా.. కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,12,355కు చేరింది. చాలామంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 5,390 ఉన్నాయి. సోమవారం కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి 897 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,174 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 408 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 808 మంది చికిత్స పొందుతున్నారు. 

 


Updated Date - 2021-06-08T04:03:53+05:30 IST