బెజవాడలో బస్‌ మెట్రో!

ABN , First Publish Date - 2020-07-14T15:37:05+05:30 IST

కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే విధంగా బస్‌ మెట్రో ప్రాజెక్టును..

బెజవాడలో బస్‌ మెట్రో!

ఆర్టీసీ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్

రూ.4200 కోట్లతో డీపీఆర్

సిద్ధం చేసిన యూఎంటీఎస్

మొత్తం 297 కిలోమీటర్లు..

ఎలివేటెడ్ 80 కిలోమీటర్లు

మోర్టు, నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్‌ల సహాయంతో అడుగులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బెజవాడలో ‘బస్‌ మెట్రో’కు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రాజెక్టును తయారు చేసింది. రూ.4200 కోట్ల వ్యయంతో  297 కిలోమీటర్ల నిడివి ఉండేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో 80 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నది ప్లాన్‌. డీపీఆర్‌ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. ఆర్థిక వనరుల కోసం నీతి ఆయోగ్‌, ప్రపంచ బ్యాంకు సహాయాన్ని కోరాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ డిజైన్‌ చేయించిన ఈ ప్రాజెక్టును తన బదిలీ సందర్బంగా సోమవారం విలేకరుల సమావేశంలో బయటపెట్టారు. నూతన ఎండీగా కృష్ణబాబు ఈప్రాజెక్టును ముందుకు తీసుకు వెళతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. 


కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే విధంగా బస్‌ మెట్రో ప్రాజెక్టును రూపొందించారు. అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (యూఎంటీసీ) సంస్థ డీపీఆర్‌కు రూపకల్పన చేసింది. గతంలో ఈ సంస్థ విజయవాడ మీడియం మెట్రో ప్రాజెక్టుకు కూడా పనిచేసింది. విజయవాడ  మీడియం మెట్రో ప్రాజెక్టుకు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) డీపీఆర్‌ రూపకల్పన చేసింది. అప్పట్లో డీఎంఆర్‌సీ ఇచ్చిన డీపీఆర్‌ సాంకేతికతను కూడా తీసుకుని కేవలం రూ.30 లక్షలతోనే యూఎంటీసీ డీపీఆర్‌ను రూపకల్పన చేసింది. నగరంలో మీడియం మెట్రో, లైట్‌ ప్రాజెక్టుల విషయంలో అనుమతులు రావటం లేనందున బస్‌ మెట్రోకు శ్రీకారం చుట్టాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి వచ్చీ రాగానే దృష్టిసారించారు. ఈ దిశగా ఆయన రహస్య ఆపరేషన్‌ ప్రారంభించారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు)ను ఆయన కలిశారు. నీతి అయోగ్‌ను కూడా  సంప్రదించారు. ఈ  రెండు శాఖల నుంచి బస్‌ మెట్రో ప్రతిపాదన పట్ల సానుకూల స్పందన రావటం, వినూత్న ప్రాజెక్టు కావటంతో తాము ఈ ప్రాజెక్టుకు సహకరిస్తామని ఇచ్చిన హామీపై అడుగులు వేసినట్టు మాదిరెడ్డి ప్రకటించారు. 


నిడివి 250 కిలోమీటర్లు.. ఎలివేటెడ్‌ 80 కిలో మీటర్లు 

బస్‌ మెట్రో ప్రాజెక్టు మొత్తం నిడివి 297 కిలోమీటర్లు. విజయవాడ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ ప్రాజెక్టు కనెక్ట్‌ అవుతుంది. ఇందులో ఫ్లై ఓవర్‌ మీద బస్సులు వెళ్లేలా 80 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు. మిగిలినది రోడ్డు మార్గంలో ఉంటుంది. ప్రతి కిలోమీటర్‌కు ఒక స్టాప్‌, ప్రతి 500 మీటర్లకు ఒక బస్‌ మెట్రో స్టేషన్‌ ఏర్పాటు జరుగుతుంది. వేగవంతమైన బస్‌ మెట్రో ప్రాజెక్టుకు ఆదరణ ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. బస్‌ మెట్రోలో ముందుగా డీజిల్‌ బస్సులు, ఆ తర్వాత ఎలక్ర్టికల్‌ బస్సులు, ఆ తర్వాత డ్రైవర్‌ లెస్‌ బస్సులను కూడా నడిపేందుకు శ్రీకారం చుడతారు. 


కిలోమీటర్‌కు రూ.40 కోట్లు

బస్‌ మెట్రో కోసం హైదరాబాద్‌లో మెట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టీ సంస్థతో ఆర్టీసీ చర్చలు జరిపింది. బస్‌ మెట్రో కోసం ఎలివేటెడ్‌ కారిడార్‌ వరకు కిలోమీటర్‌కు రూ.40 కోట్ల మేర ఖర్చు అవుతుంది. మొత్తంగా రూ.3200 కోట్లు ఖర్చు అవుతుంది. స్టేషన్లు, డిపోలు, ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.1000 కోట్ల ఖర్చు అవుతుంది.


ప్రైవేటు ఆస్థులతో పని లేదు.. 

మెట్రో ప్రాజెక్టుల మాదిరిగా స్టాపులు, స్టేషన్లకు భూసేకరణ జరిపే అవకాశం లేదని ఆర్టీసీ చెబుతోంది. బస్టాపులు, స్టేషన్లు నిర్మించాలంటే ఖచ్చితంగా భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఎండీ తన ప్రజంటేషన్‌లో అవసరం లేదని చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

  

ఇదీ స్వరూపం..

కంట్రోల్‌ రూమ్‌ నుంచి  పెనమలూరువరకు 12.6 కిలోమీటర్లు,  చిట్టినగర్‌ - కేఆర్‌ మార్కెట్‌ రోడ్డు 3.1 కిలోమీటర్లు, కంట్రోల్‌ రూమ్‌ - నిడమానూరు 11.2 కిలోమీటర్లు, నిడమానూరు - గన్నవరం 10.3 కిలోమీటర్లు, బెంజిసర్కిల్‌ - రామవరప్పాడు రింగ్‌ 3.5 కిలోమీటర్లు, ఇన్నర్‌ రింగ్‌ (గొల్లపూడి - పాయకాపురం) 7.8 కిలోమీటర్లు, నున్న రోడ్డు 8.3 కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం - కేఆర్‌ మార్కెట్‌ 10కిలోమీటర్లు, కంకిపాడు - పెనమలూరు 7.2 కిలోమీటర్లు, సీకే రెడ్డి రోడ్డు 2.5 కిలోమీటర్లు, కృష్ణలంక రోడ్డు 4.6 కిలోమీటర్లు, ఎనికేపాడు - పోరంకి 3.4 కిలోమీటర్లు, దుర్గాపురం - ఆటోనగర్‌ వయా మొగల్రాజపురం 5.2 కిలోమీటర్లు, మధురానగర్‌ రోడ్డు 3.1 కిలోమీటర్లు.

Updated Date - 2020-07-14T15:37:05+05:30 IST