భద్రాద్రి హుండీ ఆదాయం రూ.1.82కోట్లు

ABN , First Publish Date - 2022-07-07T06:20:33+05:30 IST

భద్రాద్రి హుండీ ఆదాయం రూ.1.82కోట్లు

భద్రాద్రి హుండీ ఆదాయం రూ.1.82కోట్లు
భద్రాద్రి దేవస్థానంలో హుండీ లెక్కింపు దృశ్యం

భద్రాచలం, జూలై 6: భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చింది. రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం ఆలయ హుండీల లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.1,82,33,186 నగదు, 130గ్రాముల బంగారం, ఒక కేజీ 900 గ్రాముల వెండి, 467 అమెరికా డాలర్లు, 10 యూఏఈ దీరామ్స్‌, ఇతర దేశాల కరెన్సీ వచ్చింది. ఇదిలాఉండగా దేవస్థానం హుండీలను చివరిసారిగా మే 2న లెక్కించామని, 65 రోజుల అనంతరం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు.  ఇదిలా ఉండగా బుధవారం స్వామివారిని ఖమ్మంమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం, తెలంగాణ వైద్యవిధానపరిషత కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ దర్శించుకున్నారు.  


13న దమ్మక్క సేవాయాత్ర 

ఆషాఢ పూర్ణిమ సందర్భంగా 13వ తేదీన భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క సేవా యాత్ర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5.30గంటలకు దమ్మక్క చిత్రపటంతో భద్రగిరి ప్రదక్షిణ, దమ్మక్క విగ్రహం వద్ద పూజలు, రామాలయంలో స్వామివారికి ప్రత్యేక కల్యాణం నిర్వహించనున్నారు. అలాగే అశ్వాపురం మండలంలోని కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిలో శ్రీరామాలయం వద్ద దేవస్థానం ప్రచారరథం ద్వారా స్వామివారి కల్యాణోత్సవం తొలిసారిగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. బుధవారం సీతారాముల ఉత్సవమూర్తులకు ప్రత్యేకఅభిషేకం, స్వామివారికి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 

Updated Date - 2022-07-07T06:20:33+05:30 IST