రేపటినుంచి రామయ్య దర్శన వేళల కుదింపు

ABN , First Publish Date - 2021-05-09T05:36:31+05:30 IST

రేపటినుంచి రామయ్య దర్శన వేళల కుదింపు

రేపటినుంచి రామయ్య దర్శన వేళల కుదింపు
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయం

ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు భక్తులకు అనుమతి

ఉద్యోగులకూ రోజు విడిచి రోజు విధులు

కరోనా నేపథ్యంలో దేవస్థానం ఈవో ఉత్తర్వులు 

సిబ్బందిలో 14కు చేరిన కొవిడ్‌ బాధితుల సంఖ్య

భద్రాచలం, మే 8 : కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను  దృష్టిలో పెట్టుకుని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు దేవస్థానం ఈవో బి.శివాజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి ఉదయం ఆరు నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని, అది కూడా ఉచిత, శీఘ్ర దర్శనాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా ఎలాంటి ఆర్జిత సేవలకు అనుమతి ఉండదని, పరోక్ష ఆర్జిత సేవలు (ఆన్‌లైన్‌ పేమెంట్స్‌) మాత్రం అనుమతి స్తామని ఈవో తెలిపారు. మధ్యాహ్నం నుంచి స్వామి వారికి నిర్వహించాల్సిన కైంకర్యాలను  ఆలయ అర్చకులు ఆంతరంగికంగా నిర్వహిస్తారన్నారు. ఇదిలా ఉండగా భద్రాద్రి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడుతుండటం, ఇప్పటికే 11మందికి పాజిటివ్‌ రాగా.. తాజాగా అకౌంట్స్‌ విభాగం, ఎలక్ట్రికల్‌, సీఆర్‌వో విభాగాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య 14కు చేరింది. దీంతో ఉద్యోగులు రోజు విడిచి రోజు విధులు నిర్వహించేలా మార్పులు చేశారు. సోమ, బుధ శుక్రవారాల్లో ఏఈవో-1 వి.శ్రవణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఒక బృందం, మంగళ, గురు, శనివారాలు ఏఈవో-2 భవానీరామకృష్ణారావు ఆధ్వర్యంలో మరో బృందం విధులు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి దేవస్థానం ఉద్యోగులు ఈ విధంగా తమ బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అత్యవసర పరిస్థితుల్లో దేవస్థానం ఈవో ఆదేశాల మేరకు సిబ్బంది అంతాహాజరు కావాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-09T05:36:31+05:30 IST