కల్పవృక్షం.. భగవద్గీత

ABN , First Publish Date - 2020-12-25T09:44:30+05:30 IST

సంసార సాగర తరణోపాయం.. బ్రహ్మవిద్యా యోగ శాస్త్ర ప్రమాణం.. భక్తి జ్ఞాన కర్మాది యోగాలకు ఆలవాలం.. ముముక్షువుల ముక్తికి నిలయం..

కల్పవృక్షం.. భగవద్గీత

సంసార సాగర తరణోపాయం.. బ్రహ్మవిద్యా యోగ శాస్త్ర ప్రమాణం.. భక్తి జ్ఞాన కర్మాది యోగాలకు ఆలవాలం.. ముముక్షువుల ముక్తికి నిలయం.. మానవ జీవిత సంపూర్ణ వికాస సాఫల్యం.. కులమత వర్గ వయో భేదం లేకుండా పఠించి సారాంశాన్ని గ్రహించి తరించడానికి తగిన గ్రంథం.. భగవద్గీత. అందుకే అది ప్రపంచంలో వివిధ భాషలలోనికి అనువదింపబడి ఆబాలగోపాలం చేత ఆరాధింపబడుతూ ఉంది. విశ్వశాంతికి నిలయమై ఉంది.


గీకారం త్యాగరూపం స్సాత్‌

‘త’కారమ్‌ తత్వ బోధకమ్‌

గీతావాక్యమిదం తత్వం

జ్ఞేయం సర్వముముక్షుభిః


గీతలో గీకారం త్యాగాన్ని, త కారం తత్వబోధను నిర్వచిస్తాయి. ఈ రెండింటిని కలిపితే గీత అనే పదమౌతుంది. ముముక్షువులు గీతా మాహాత్మ్యం తెలుసుకొని ముక్తినొందాలని ఈశ్లోకం తెలుపుతుంది. గీతా బోధతో అర్జునుడి సంకోచం తీర్చి, కర్తవ్యాన్ని ప్రోత్సహించి కార్మోన్ముఖుణ్ని చేయడమే కాక బ్రహ్మ విద్యా యోగ సాధనా భాగ్యాన్ని మానవాళికి అందించిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు. ఆ మహత్తర కార్యంతో పరమాత్ముడగు శ్రీకృష్ణుడు గీతాచార్యుడుగా యోగాచార్యుడుగా లోకపూజ్యుడయ్యాడు. 700 శ్లోకాలతో అలంకరింపబడిన ఆధ్యాత్మిక రత్నాకరం (సముద్రం)గీత. అందులోని శ్లోకాలనే మంత్రాలన్నీ తత్వాన్ని రంజింపచేసే రత్నాలు.


సత్యశోధనకు నిలువుటద్దంగా నిల్చిన గీతాశాస్త్రం.. మానవునిలోనే పరమాత్ముడున్నాడనే నిత్యసత్యాన్ని నిరూపిస్తూ ఉంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి దైవానుగ్రహం, గురువు సహకారం అత్యవసరాలు. నేను నాది అనే అజ్ఞానజనిత అహంకారం రాగద్వేష క్రోధాలకు కారణం. గీతాబోధ వల్ల అలవడే ఆత్మజ్ఞానంతో ఆ అహాన్ని అణచివేయాలి. ఇంకా ఎన్నో పరతత్వ ప్రయోజనాలు గీతా శాస్త్ర సారాంశమనే మకరందాన్ని ఆస్వాదించడం వల్ల అభ్యాసకునికి అవగతమౌతాయి.


గీతా శాస్త్ర మాహాత్మ్యం వర్ణనాతీతం. అది ఆత్మజ్ఞానులకే సొంతం. దివ్యమైన గీతయందు దీక్ష వహించి అభ్యాసమందు నిరతుడయినవాడు నిజంగా ముక్తుడౌతాడు. అట్టివాడు ప్రారబ్దం చేత బాధ చెందడు. గీతాపారాయణం చేసే స్థలం సమస్త పుణ్యతీర్థాలతో సమానమని చెప్పబడింది. నిశ్చలమైన మనస్సుతో ప్రతిదినం భగవద్గీతను పఠించేవాడు జ్ఞానసిద్ధినందగలడు. గీతార్థ విచారణతో జీవన్ముక్తి లభిస్తుంది. పరమాత్మను చేరుకోడానికి అనేకమార్గాలు చూపిస్తాయి గీతాలక్ష్య లక్షణాలు.


అందుకే అది కల్పవృక్షంతో పోల్చబడింది. దానికి కృష్ణస్వామి విత్తనం వేశాడని,  వేదవ్యాసుడు ప్రియంగా పెంచాడని.. అందులోని వివిధ తత్వ భావాలు శాఖలని..  విరాగత్వం, సహనశీలం చిగురాకులని.. కృష్ణుని సేవాభాగ్యం పుష్పాలని.. ఆ పువ్వుల సువాసన ఆత్మజ్ఞానులకు మోక్షాన్నిస్తుందని పెద్దలు చెబుతారు. అంత గొప్పదైన భగవద్గీత లోకానికి అందినరోజైన ‘గీతాజయంతి’నాడు భక్తులందరూ గీతాపారాయణ చేసి అత్యుత్తమమైన ఆత్మానందాన్ని పొందగలరని ఆశిద్దాం.



విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య

Updated Date - 2020-12-25T09:44:30+05:30 IST