పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్?

ABN , First Publish Date - 2022-01-04T22:50:58+05:30 IST

త్వరలో జరిగే పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్?

న్యూఢిల్లీ : త్వరలో జరిగే పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించబోతున్నట్లు ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. ఆయన ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 


జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, సంగ్రూర్ ఎంపీ కూడా అయిన భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆప్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే పోరాడాలని సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఆలస్యంకావడానికి కారణం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కోవిడ్-19 పాజిటివ్ నిర్థరణ కావడమే. 


ఇదిలావుండగా, గత నెలలో భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర ఆరోపణ చేశారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరితే భారీగా డబ్బు, కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత తనకు చెప్పారని ఆరోపించారు. 


అయితే  ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇటువంటి ఆశలు పెట్టిన బీజేపీ నేత ఎవరో బహిరంగంగా చెప్పాలని భగవంత్ మాన్‌ను డిమాండ్ చేసింది. 



Updated Date - 2022-01-04T22:50:58+05:30 IST