మరో వారం రోజుల్లో నిండనున్న జలాశయం

ABN , First Publish Date - 2021-12-06T06:28:34+05:30 IST

భైరవాన తిప్ప ప్రాజెక్టు(బీటీపీ) వర్షపు నీటితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీరు చేరనుంది.

మరో వారం రోజుల్లో నిండనున్న జలాశయం
జలాశయంలో చేరిన నీరు

భైరవానతిప్పలు

ప్రస్తుతం 1.4 టీఎంసీల నిల్వ 

షట్టర్లకు గ్రీసు పెట్టేందుకు నిధులు లేక విలవిల

అనుబంధ కాలువలకు గండ్లు 

పర్యవేక్షణకు సిబ్బంది కొరత

నిధుల కోసం అధికారుల నిరీక్షణ 

అత్యవసర పనులు చేస్తేనే ఆయకట్టుకు నీరు 

రాయదుర్గం, డిసెంబరు 5 : భైరవాన తిప్ప ప్రాజెక్టు(బీటీపీ) వర్షపు నీటితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీరు చేరనుంది.  కాగా షట్టర్లను ఆపరేట్‌ చేసేందుకు మూడేళ్లుగా గ్రీసు పెట్టలేదు. దీంతో డ్యామ్‌ నిండితే దిగువకు నీటి విడుదలకు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఉలుకుపలుకు లేకపోవడంతో అధికారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా జలాశయానికి ఉన్న కుడి, ఎడమ అనుబంధ కాలువలు కూడా పూర్తిగా పాడై పోయి, గండ్లు పడి నీటి పారుదలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేవు. ఆయకట్టుకు నీరు విడుదల చేయాలన్నా, గండ్లు పూడ్చివేయాలి. జలాశయంలో చేరిన నీటితో గట్ల పరిస్థితిపై పర్యవేక్షణ చేసేందుకు అవసరమైన సిబ్బంది కూడా లేరు. ఇప్పటికే జలాశయంలో 1655 అడుగుల మట్టానికిగాను 1652.3 అడుగుల మేర నీరు చేరాయి. దీని ప్రకారం 1.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజుకు 200 క్యూసెక్కుల దాకా ఇనఫ్లో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో జలాశయం నిండిపోనుంది. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. 


అనుబంధ కాలువలకు గండ్లు 

జలాశయం నుంచి అటు బ్రహ్మసముద్రం, ఇటు గుమ్మఘట్ట మండలాల్లో ఉండే ఆయకట్టుకు నీటి విడుదల చేసే అనుబంధ కాలువలకు రెండేళ్ల క్రితం గండ్లు పడ్డాయి. వాటిని ఇప్పటివరకు పూడ్చలేదు. కుడి, ఎడమ కాలువలకు పడిన గండ్లను పూడ్చివేస్తేనే నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ పనులు పూర్తి చేసిన అనంతరమే ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యమని వివరిస్తున్నారు. మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరానా ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. ఈఏడాది గుమ్మఘట్ట మండలంలో 2700 ఎకరాలకు నీరు అందించాలని భావిస్తున్నారు. గండ్లను పూడ్చి, గట్లను భద్రపరచుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుందని స్పష్టం చేస్తున్నారు. 


రూ. 4.11 కోట్లతో ప్రతిపాదనలు 

ప్రభుత్వం రూ. 4.11 కోట్లు మంజూరు చేస్తే పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ముఖ్యంగా మట్టికట్ట మరమ్మతులు, షట్టర్లకు గ్రీసింగ్‌, ఆయిలింగ్‌తో పాటు వర్షపు నీటి మళ్లింపునకు డ్రైనేజీలు, రివిట్‌మెంట్‌ల మరమ్మతులు, కంపచెట్ల తొలగింపులతో పాటు ప్రొఫైల్‌ వాల్‌ నిర్మాణం లాంటి వాటికి రూ. 4.11 కోట్లు అవసరముంటుందని ప్రతిపాదించారు. వీటితో పాటు అత్యవసరం కింద కరెంటు బిల్లుతో పాటు పైపింగ్‌ల మరమ్మతులు, అనుబంధ కాలువల గండ్లు శాశ్వత మరమ్మతులు చేసి ఆయకట్టుకు నీరందించేందుకు రూ. 24.94 లక్షలతో ప్రతిపాదనలు ఇచ్చారు. పర్యవేక్షణ చేసేందుకు అత్యవసరం కింద సిబ్బంది నియామకమే కాకుండా ఇతరత్రా అత్యవసరం కోసం రూ. 5.37 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించా రు. వీటిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 


సిబ్బంది ఒక్కరు కూడా లేరు 

జలాశయంలో నీరు చేరితే పర్యవేక్షణ చేసేందుకు అవసరమైన సిబ్బంది లేరు. సాధారణంగా ఇద్దరు ఎలకీ్ట్రషియన్లు, ఇద్దరు ఫిట్టర్లు, ఒక డ్రైవర్‌, ఎనిమిది మంది హెల్పర్లు, నలుగురు వాచమెనలు, ఐదుగురు వర్క్‌ ఇనస్పెక్టర్లు, 14 మంది లస్కర్లు ఉండాలి. కానీ వీరిలో ఒక్కరు కూడా లేరు. దీంతో పర్యవేక్షించేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


బలహీన గట్లు 

జలాశయానికి రెండు కిలోమీటర్ల పొడవులో ఉన్న గట్లు బలహీనంగా ఉన్నాయి. 2017లో జలాశయం వర్షపు నీటితో నిండినప్పుడు పైపింగ్‌ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో తాత్కాలిక పనులు నిర్వహించి చేతులు దులు పుకున్నారు. అనంతరం ఆ పనులను శాశ్వతంగా చేయించడంలో అధికారులు చొరవ చూపలేదు. ఒక్కసారిగా ఇప్పుడు జలాశయానికి నీరు రావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. పడిన పైపింగ్‌లను మరమ్మతులు చే యించడమే కాకుండా పెరిగిన కంపచెట్లను తొలగించడం లాంటి పనులను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. పైగా వర్షపునీరు కట్టపై నుంచి పొర్లేందుకు ఏ మాత్రం రూట్‌ కెనాల్స్‌ లేవు. జలాశయం చుట్టుపక్కల కట్ట దిగువన నీరు ఊరితే వాటిని బయటకు పంపించేందుకు అవసరమైన చిన్నపాటి డ్రైనేజీలు కూడా పూర్తిగా లేకపోవడంతో వాటన్నింటినీ మరమ్మతులు చేయించాల్సి ఉందని అధికారులు ప్రతిపాదించారు. 


నిధులు విడుదలైతేనే నీటి విడుదల 

ఆయకట్టుకు నీరు విడుదల చేయాలంటే కాలువలకు పడిన గండ్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి.  నిధులు విడుదలై పనులు పూర్తి స్థాయిలో జరిగితేనే నీరు విడుదల చేయగలం. ప్రభుత్వానికి నిధుల అవసరం గురించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాం. అత్యవసరం కింద అవసరమైన నిధులు గురించి కూడా ఉన్నతాధికారులకు తెలిపాం. రూ. 4.11 కోట్లతో పాటు రూ. 24.94 లక్షలుతో ప్రతిపాదనలు పంపాం. వీటితో పాటు షట్టర్లకు గ్రీసింగ్‌, ఆయిలింగ్‌ లాంటి వాటి కోసం రూ.5.37 లక్షలతో ప్రతిపాదించాం. వీటిని మంజూరు చేస్తేనే నీటి నిర్వహణ సాధ్యపడుతుందని ఉన్నతాధికారులకు వివరించాం. 

- నరసింహమూర్తి , ఇరిగేషన డీఈ





Updated Date - 2021-12-06T06:28:34+05:30 IST