భక్తజనసంద్రం.. యాదాద్రిక్షేత్రం

ABN , First Publish Date - 2022-05-29T05:57:30+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతంకావడంతో క్షేత్ర సందర్శనకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

భక్తజనసంద్రం.. యాదాద్రిక్షేత్రం
స్వామికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

స్వామికి  వైభవంగా సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట, మే 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతంకావడంతో క్షేత్ర సందర్శనకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తజనులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల వాహనాల్లో.. ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి చేరుకుని ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయం, సేవా మండపాల్లో ప్రసాదాల విక్రయశాల చెంత భక్తుల సంచారం కనిపించింది. ప్రధానాలయలోని స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తర పూజలు, అష్టభుజి ప్రాకార మండపలో వేదాశీర్వచనం సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హరిహరులను దర్శించుకున్న భక్తజనులు ఆర్జిత సేవోత్సవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని తీర్చుకున్నారు. వివిధ విభాగాల ద్వారా రూ.28,54,696 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. వేసవి కాలంకావడంతో ఎండవేడిమితో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల వార్తా కథనాలను దృష్టిలో పెట్టుకుని దేవస్థాన అధికారులు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్‌ పెయింట్‌ను వేయిస్తున్నారు. 


స్వామికి వైభవంగా నిత్య పూజలు

స్వయంభు లక్ష్మీనారసింహుడికి నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన కైంకర్యాలు రాత్రివేళ శయనోవాలతో ముగిశాయి. ప్రధానాలయంలో స్వయంభువులను.. కవచమూర్తులను అభిషేకించిన ఆచార్యులు తులసీదళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగాయి. కొండపైన అనుబంధ రామలింగేశ్వరుడికి, శివాలయ ముఖమండపంలో స్పటిక రామలింగేశ్వరస్వామికి నిత్య పూజాకైంకర్యాలు నిర్వహించారు.


అద్భుతం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం కృష్ణరాతి శిలలతో అత్యద్భుతంగా పునర్నిర్మించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ అన్నారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన ప్రధానాలయంలోని గర్భాలయంలోని స్వయంభువులను, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్నారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణపుష్పార్చన పూజల్లో పాల్గొనగా అస్టభుజి ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో ఆశీర్వచనం నిర్వహించారు. దేవస్థాన ఇన్‌చార్జి ఈవో రామకృష్ణారావు ఆయనకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన అధికారులతో ఆయన మాట్లాడుతూ పూర్తిగా కృష్ణ శిలలతో ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా జరిపారని, శిల్పకళాకృతులతో యాదగిరిక్షేత్రం ఆధ్యాత్మిక, ఆహ్లాదకర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దారని చెప్పారు.  

Updated Date - 2022-05-29T05:57:30+05:30 IST