భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

ABN , First Publish Date - 2022-06-27T06:55:22+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజనసంద్రమైంది. వేకువజామునుంచే భక్తజనులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం
యాదగిరిగుట్టపై తిరువీధుల్లో భక్తులు

కిక్కిరిసిన దర్శన క్యూలైన్లు, సందడిగా ఆలయ తిరువీధులు

ధర్మదర్శనానికి నాలుగు గంటలు.. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటలు

యాదగిరిగుట్ట, జూన్‌26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజనసంద్రమైంది. వేకువజామునుంచే భక్తజనులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లగుండా దేవదేవుడి దర్శనాలకు కోసం ఉభయ దర్శన క్యూలైన్లలో బారులుతీరారు. ధర్మదర్శనాలకు సుమారు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టింద ని భక్తులు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో పట్టణ ప్రధానవీధులు, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వాహనాలతో రద్దీవాతావరణం నెలకొంది. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు ప్రసాదాల క్యూలైన్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయ సేవామండపాలు భక్తులతో సందడిగా కనిపించాయి. ఇదిలా ఉండగా కొండపైన ప్రసాదాల విక్రయశాల ప్రాంతంలో ఫైబర్‌తో తయారు చేసిన తిరునామాలు, కమలం పువ్వులను కార్మికులు అమర్చుతున్నారు. వివిధ విభాగాల ద్వారా రూ.42,68,960 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది.

స్వామికి శాస్త్రోక్తంగా సంప్రదాయ పూజలు

ఏకశిఖరవాసుడికి నిత్య పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని స్వయంభువులకు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు వేదమంత్రాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. మండపంలో సువర్ణ పుష్పార్చన లు, అష్టభుజి ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు కొనసాగాయి. కొండపైన రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలో స్ఫటికమూర్తులకు నిత్య పూజలు, కొండకింద గండిచెరువు సమీపంలోని దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు కొనసాగాయి. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర పద్ధతిలో కొనసాగాయి.



Updated Date - 2022-06-27T06:55:22+05:30 IST