ఆసిఫాబాద్‌ జిల్లాలో భానుడి భగభగలు

ABN , First Publish Date - 2022-05-03T04:39:21+05:30 IST

మే ఆరంభం అయిందో లేదో ఎండలు మంట పుట్టిస్తు న్నాయి. రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పెరగడంతో ఎండ వేడి తాళలేక జనం విల విల్లాడుతున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో భానుడి భగభగలు

- జిల్లాలో 45.6డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

- వడగాల్పులతో జనం ఉక్కిరి బిక్కిరి

- ఉదయం 7గంటల నుంచే మొదలైన సూర్యప్రతాపం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మే ఆరంభం అయిందో లేదో ఎండలు మంట పుట్టిస్తు న్నాయి. రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పెరగడంతో ఎండ వేడి తాళలేక జనం విల విల్లాడుతున్నారు. రెండు సంవత్సరాలుగా మే ఆరంభంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కాగా, ఈ సారి మాత్రం ఆరంభంలోనే 45డిగ్రీలు దాటడంతో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆది, సోమవారాల్లో ఉదయం ఏడు నుంచే వేడి తీవ్రత పెరగ డంతో జనం ఉదయం 10గంటలకల్లా ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. మఽధ్యాహ్నం సమయం కల్లా రోడ్లపై కనీస సంచారం కూడా కన్పించడం లేదు. గాలిలో తేమ తగ్గి పోయి జనం ఉక్కపోత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పది నిమిషాలు బయట తిరిగితే శరీరం అతిగా డిహైడ్రేట్‌ అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు బయట తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుం దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉపాధిహామీ పనులకు వెళ్లుతున్న కూలీల హాజరు శాతం కూడా భారీగా తగ్గిందని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగుల హాజరు శాతం పలుచగా కన్పిస్తోంది. అటవీ గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. ఎండలకు తోడు వేడి గాలుల కారణంగా పశుపక్షాదులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసిన సాసర్‌ పిట్స్‌, నీటి కుంటలు, ఎండల తీవ్రతకు నింపిన గంటల వ్యవధిలోనే ఆవిరై పోతున్న పరిస్థితి ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి. రానున్న రెండ్రో జులు ఇదే వాతావరణ పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం షెడ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే హరిత హారం కోసం సిద్ధం చేస్తున్న నర్సరీల రక్షణకు చర్యలు ప్రారం భించారు. 

జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు

ఆసిఫాబాద్‌ జిల్లాలో రెండ్రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పెరుగుదల అధికంగా ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలిలు. కెరమెరి మండలంలో అత్యధికంగా 45.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కౌటాల 45.4 డిగ్రీలు, వాంకిడి 44.8, బెజ్జూరులో 44.8, పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లిలో 44.8, కాగజ్‌నగర్‌ జంబులో44.7, సిర్పూరు(టి) మండలకేంద్రంలోని వెంక ట్రావుపేటలో 44.5 డిగ్రీలు, కాగజ్‌నగర్‌లో 44.4డిగ్రీలు, దహెగాంలో 44.2, సిర్పూరు(టి) మండల కేంద్రంలో 44.2 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25డిగ్రీలపైనే నమోదయ్యాయి. అత్యల్ప గరిష్ట ఉష్ణోగ్రత సిర్పూరు(యూ) మండగలంలో 25.8 డిగ్రీలు నమోదైంది.

అప్రమత్తతే శ్రీరామ రక్ష

ఎండ వేడిమికి వడ దెబ్బ తగులకుండా నీరు అధికంగా తీసుకోవాలని సాధ్యమైనంత మేరకు చల్లటి ప్రదేశాల్లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత బయటికి వెళ్లే సమయంలో తలకు టోపీ, రుమాలు ధరించాలని పేర్కొంటున్నారు. నోరు ఎండి పోతుండటం, కళ్లు తిరిగినట్టు కన్పించటం, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని సూచించారు.

అటు ఎండ.. ఇటు వాన

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో సోమవారం పట్టపగలు ఒక్కసారిగా చిరు జల్లులతో వర్షం కురియగా, మరో వైపు ఎండ కాసింది. అకస్మాత్తుగా ఒక వైపు ఎండ మరో వైపు వర్షం పడడంతో అంతా ఒక్కసారిగా విస్మయం చెందారు. పగటి పూట 3.30 గంటల ప్రాంతంలో దాదాపు 43 డిగ్రీల ఎండ వేడిమిలో సైతం ఒక్కసారిగా కొన్ని నిమిషాలు వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్రమైన ఎండ వేడిలో వాన కురియడంపై చర్చించుకున్నారు.

Read more