భానుడి భగభగ

ABN , First Publish Date - 2021-03-08T05:21:05+05:30 IST

వేసవి ఇంకా పూర్తిగా రాకముందే ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. 40 డిగ్రీలకు చేరువైపోయాయి. ఉదయం ఎనిమిది గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నా నికి నిప్పులు కక్కుతున్నాడు. దీంతో వీధులు, రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. విజయనగరంతో పాటు అన్ని పట్టణాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడు తున్నారు.

భానుడి భగభగ
నిర్మానుష్యంగా విజయనగరంలోని ఓ రహదారి

 అమాంతం పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

 మధ్యాహ్నానికి నిర్మానుష్యంగా వీధులు, రహదారులు

 బొబ్బిలిలో 40 డిగ్రీలు నమోదు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ పార్వతీపురం

వేసవి ఇంకా పూర్తిగా రాకముందే ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. 40 డిగ్రీలకు చేరువైపోయాయి. ఉదయం ఎనిమిది గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నా నికి నిప్పులు కక్కుతున్నాడు. దీంతో వీధులు, రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. విజయనగరంతో పాటు అన్ని పట్టణాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడు తున్నారు. ప్రారంభంలోనే ఇలా ఉంటే నడి వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో నని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వేసవి తాపం ముందే రావడంపై నిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు. చలికాలం పోక ముందే వేసవి సమీపించింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తేమ ప్రభావం తగ్గడం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 చలి కొనసాగినా..

రెండు దశాబ్దాల తరువాత ఈ ఏడాది శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యాయి. ఫిబ్రవరి మూడో వారం వరకూ చలి వాతావరణం కొనసాగింది. దీంతో ఈ ఏడాది వేసవిలో పెద్దగా ఎండలు ఉండవని అంతా భావించారు. కానీ చలి తగ్గుతున్న సమయంలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. ముఖ్యం గా తూర్పు తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి నుంచి మే నెల వరకూ కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.22 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ ఇటీవల బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన

సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ తరువాత గత నవంబరులో పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం విద్యాబోధన సాగుతోంది. కానీ ముదురుతున్న ఎండలు చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏటా వేసవిని దృష్టిలో పెట్టుకొని మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు పెట్టేవారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తరగతులు నిర్వహించారు. కానీ ఈ ఏడాది ఒంటిపూట బడులపై స్పష్టత లేదు. విద్యాశాఖ కూడా ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వార్షిక పరీక్షలు మేలో జరగనున్నాయి. అప్పటికి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వేసవితాపాన్ని పిల్లలు తట్టుకోగలరా? అన్న ఆందోళన తల్లిదండ్రులను వెంటాడుతోంది.

పని ప్రదేశాల్లో వసతులేవి?

జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. కానీ    పని ప్రదేశాల్లో మాత్రం వసతులు కరువవుతున్నాయి. కనీసం తాగేందుకు నీరు, పని మధ్యలో సేద తీరేందుకు నీడ సదుపాయం లేదు. దీంతో వేతనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రానున్న మూడు నెలలు ఎండలు పెరుగుతాయనే వాతావ రణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరముంది. జిల్లాలోని 34 మండలాల్లో 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 2,915 గ్రామాల్లో 44,686 శ్రమశక్తి సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ గ్రూపులు) ఉండగా... 8.19 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరూ పనులు చేస్తున్నారు. వేసవి సమీపిస్తుండడం, వడగాలులు ప్రారంభంకా నున్న నేపథ్యంలో వసతులు కల్పించాల్సిన అవసరముంది.

వ్యాక్సిన్‌ వేసుకున్న వారికీ ఇబ్బందులు

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పులు ఇబ్బందిగా మారాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు ఒకటి రెండు రోజులు ఎండల్లో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కానీ అత్యవసర పనులు పడినవారు బయటకు రాకుండా ఉండలేకపోతున్నారు.



Updated Date - 2021-03-08T05:21:05+05:30 IST