కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలు ఇవే : భారత్ బయోటెక్

ABN , First Publish Date - 2021-03-04T00:21:40+05:30 IST

కోవిడ్-19 నిరోధం కోసం దేశీయంగా తయారు చేసిన కోవాగ్జిన్

కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలు ఇవే : భారత్ బయోటెక్

హైదరాబాద్ : కోవిడ్-19 నిరోధం కోసం దేశీయంగా తయారు చేసిన కోవాగ్జిన్ మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ బుధవారం విడుదల చేసింది. హోస్ట్ సెల్ వెలుపల వైరస్ పరిపూర్ణ, సంక్రమణ రూపాన్ని పూర్తిగా అచేతనం చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 81 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపింది. ఈ పరీక్షలు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో నిర్వహించినట్లు తెలిపింది. 


భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ, కోవిడ్-19పై కోవాగ్జిన్ అత్యధిక క్లినికల్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. మరోవైపు వేగంగా వస్తున్న ఈ వైరస్ వేరియెంట్లపై కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రోగ నిరోధక శక్తిని ప్రదర్శించిందన్నారు. 1వ, 2వ, 3వ విడతల్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 27,000 మంది పాల్గొన్నట్లు తెలిపారు. 


భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ, ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 25 స్టడీ సైట్స్‌లోని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లు, ఇతర భాగస్వాములకు ధన్యవాదాలు తెలిపారు. వీరందరూ సహకరించకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనవారంతా నిరంతరం నిబద్ధతతో కృషి చేశారని, వీరి సహకారం లేకపోతే ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం విజయవంతమయ్యేది కాదని తెలిపారు. 


మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 25,800 మంది పాల్గొన్నారని భారత్ బయోటెక్ తెలిపింది. 18 నుంచి 98 సంవత్సరాల మధ్య వయస్కులపై పరీక్షలు జరిగినట్లు తెలిపింది. 60 ఏళ్లకు పైబడినవారు 2,433 మంది, ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు 4,500 మంది ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పేర్కొంది. కోవాగ్జిన్ పట్ల దాదాపు 40కి పైగా దేశాలు ఆసక్తి చూపినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఫ్రెంచ్ రాయబారి హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. గత వారం బ్రెజిల్ 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 



Updated Date - 2021-03-04T00:21:40+05:30 IST