ఏడాదికి 70 కోట్ల డోసులు

ABN , First Publish Date - 2021-04-21T06:45:43+05:30 IST

కొవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ పెంచనుంది. హైదరాబాద్‌, బెంగళూరుల్లోని తయారీ యూనిట్లలో దశల వారీగా కొవాగ్జిన్‌ ఉత్పత్తిని ఏడాదికి 70 కోట్ల డోసులకు...

ఏడాదికి 70 కోట్ల డోసులు

  • కొవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచనున్న భారత్‌ బయోటెక్‌
  • విదేశాల్లో తయారీకి భాగస్వామ్యాలు
  • వచ్చే నెలలో 3 కోట్ల డోసుల ఉత్పత్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): కొవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ పెంచనుంది. హైదరాబాద్‌, బెంగళూరుల్లోని తయారీ యూనిట్లలో దశల వారీగా కొవాగ్జిన్‌ ఉత్పత్తిని ఏడాదికి 70 కోట్ల డోసులకు పెంచనున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఉత్పత్తి సామర్థ్యం ఈ స్థాయికి చేరితే.. ప్రపంచంలో ఇన్‌యాక్టివేటెడ్‌ వైరల్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఇది అత్యధికమవుతుంది. మరోవైపు ఇతర దేశాల్లో కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయడానికి భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకునే అంశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. బయోసేఫ్టీ ప్రమాణాలతో ఇన్‌యాక్టివేటెడ్‌ వైరల్‌ వ్యాక్సిన్ల తయారీలో గత అనుభవం ఉన్న వారితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడానికి కొవాగ్జిన్‌ డ్రగ్‌ సబ్‌స్టాన్స్‌ తయారీకి ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ (ఐఐఎల్‌)తో భారత్‌ బయో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదిలీ ప్రక్రియ జరుగుతోంది. ఇన్‌యాక్టివేటెడ్‌ వైరల్‌ వ్యాక్సిన్లను వాణిజ్యపరంగా తయారు చేయగల అనుభవం, సామర్థ్యం ఐఐఎల్‌కు ఉందని తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అనుగుణంగా ముడి పదార్ఢాలు, ఇతర వస్తువులను కంపెనీ సమకూర్చుకోనుంది. 


అంచెలంచెలుగా: వచ్చే నెలలో 3 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్‌ బయోటెక్‌  సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. మార్చిలో 1.5 కోట్ల డోసులు అందించాం. ఈ నెలలో డోసుల ఉత్పత్తి 2 కోట్ల డోసులకు చేరనుంది. వచ్చే నెలలో మరింత పెంచి 3 కోట్ల డోసులకు చేరతామని చెప్పారు. చివరకు నెలవారీ కొవాగ్జిన్‌ ఉత్పత్తి 7-7.5 కోట్ల డోసులకు చేరగలదని ఎల్లా వివరించారు. జులై-ఆగస్టు నాటికి కంపెనీ వార్షిక ఉత్పత్తి సామ ర్థ్యం 80 కోట్ల డోసుల వరకూ చేరడానికి వీలుందని చెప్పారు.  బెంగళూరులో రెండు కొత్త యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించనున్నాం. హైదరాబాద్‌లో ఒక యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించి.. ఇప్పుడు నాలుగు యూనిట్లలో ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకూ క్లినికల పరీక్షలు, ఉత్పత్తి కోసం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోలేదని చెప్పారు. 


దిగువ భాగం ఊపిరితిత్తులకే రక్షణ: వ్యాక్సినేషన్‌ గురిం చి కృష్ణ మాట్లాడుతూ.. ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే వ్యాక్సిన్ల వల్ల దిగువ భాగం ఊపిరితిత్తులకు మాత్రమే రక్షణ ఉంటుందని.. పైభాగానికి రక్షణ ఉండదన్నారు. అందువల్ల వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా కొవిడ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. అంత తీవ్రత ఉండదని వివరించారు.  


సొంత యాజువెంట్‌: వ్యాక్సిన్లలో బలమైన ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ కోసం యాజువెంట్‌ను వినియోగిస్తారు. కొవాగ్జిన్‌లో అల్జెల్‌-ఐఎండీజీని యాజువెంట్‌గా వాడుతున్నారు. ఐఎండీజీ సింథసిస్‌, తయారీని పూర్తిగా దేశీయం చేసినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దీన్ని వాణిజ్యపరంగా దేశీయంగా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా రూపొందించిన యాజువెంట్‌ను భారత్‌లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం ఇదే ప్రథమం. 

60 దేశాల్లో అనుమతి పొందే ప్రక్రియ: ప్రపంచంలో అనేక దేశాల్లో కొవిడ్‌కు కొవాగ్జిన్‌ను వినియోగించడానికి అత్యవసర అనుమతి లభించింది. మరో 60 దేశాల్లో అనుమతి పొందే ప్రక్రియ కొనసాగుతోంది. మెక్సికో, ఫిలిపీన్స్‌, ఇరాన్‌, వెనిజులా వంటి అనేక దేశాల్లో కొవాగ్జిన్‌కు అనుమతి లభించగా.. అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల్లో అనుమతి పొందే ప్రక్రియ జరుగుతోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఒక్కో డోసును 15-20 డాలర్లకు విక్రయిస్తోంది. 

Updated Date - 2021-04-21T06:45:43+05:30 IST