త్వరలో డబ్ల్యూహెచ్‌వో జాబితాలోకి కోవాగ్జిన్‌.. యూఎస్‌లోనూ అనుమతి కోసం ప్రయత్నాలు

ABN , First Publish Date - 2021-05-26T13:26:33+05:30 IST

ఈ ఏడాది జూలై - సెప్టెంబరు నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా (ఈయూఎల్‌)లో కోవాగ్జిన్‌ను చేర్చే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈయూఎల్‌లో కోవాగ్జిన్‌ను చేర్చాలని కోరుతూ డబ్ల్యూహెచ్‌ఓకు ఇప్పటికే దరఖాస్తు చేశామని పేర్కొంది.

త్వరలో డబ్ల్యూహెచ్‌వో జాబితాలోకి కోవాగ్జిన్‌.. యూఎస్‌లోనూ అనుమతి కోసం ప్రయత్నాలు

హైదరాబాద్‌: ఈ ఏడాది జూలై - సెప్టెంబరు నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా (ఈయూఎల్‌)లో కోవాగ్జిన్‌ను చేర్చే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈయూఎల్‌లో కోవాగ్జిన్‌ను చేర్చాలని కోరుతూ డబ్ల్యూహెచ్‌ఓకు ఇప్పటికే దరఖాస్తు చేశామని పేర్కొంది. అమెరికా, బ్రెజిల్‌, హంగేరీ సహా 60కి పైగా దేశాల్లో కోవాగ్జిన్‌ వినియోగానికి నియంత్రణ మండళ్ల అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.


కోవాగ్జిన్‌ను ఈయూఎల్‌లో చేర్చేందుకు అవసరమైన పత్రాల్లో  90 శాతం డబ్ల్యూహెచ్‌ఓకు సమర్పించామని, మిగతావి జూన్‌ నాటికి అందజేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 13 దేశాల్లో అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్‌కు అనుమతులు లభించినట్లు కంపెనీ వెల్లడించింది.  మరోవైపు.. అమెరికాలో అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌కు చెందిన యూఎస్‌ భాగస్వామ్య కంపెనీ ఓక్యుజెన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది.    


కంపెనీలో కొంతమంది సిబ్బంది కరోనా బారినపడి విధులకు హాజరు కాలేకపోయినప్పటికీ.. 30 రోజుల్లో 30 నగరాలకు కోవాగ్జిన్‌ను సరఫరా చేయగలిగామని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్రా ఎల్లా తెలిపారు. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా సహా అనేక నగరాలకు వ్యాక్సిన్లు సరఫరా అయ్యాయి.




Updated Date - 2021-05-26T13:26:33+05:30 IST