హైదరాబాద్‌లో భారత్‌ జోడో యాత్ర!

ABN , First Publish Date - 2022-10-01T08:59:30+05:30 IST

హైదరాబాద్‌ నగరంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు టీపీసీసీ రూట్‌ మ్యాప్‌ తయారు చేసింది.

హైదరాబాద్‌లో భారత్‌ జోడో యాత్ర!

  • జూపార్క్‌, చార్మినార్‌, గాంధీభవన్‌ మీదుగా రాహుల్‌ పాదయాత్ర
  • చిలుకూరు బాలాజీ టెంపుల్‌, మెదక్‌ చర్చి..
  • జహంగీర్‌ పీర్‌ దర్గా సందర్శించేలా ప్రణాళిక
  • పాలమూరు, హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ వర్సిటీల సందర్శన
  • మునుగోడు ఉప ఎన్నికపై శంషాబాద్‌లో సభ 
  • రాహుల్‌ పర్యటన రూట్‌ మ్యాప్‌పై టీపీసీసీ ఏకాభిప్రాయం
  • అనుమతి కోసం నేడు డీజీపీని కలవనున్న ప్రతినిధి బృందం

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు టీపీసీసీ రూట్‌ మ్యాప్‌ తయారు చేసింది. గతంలో రూపొందించినట్లుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా కాకుండా.. జూపార్కు, చార్మినార్‌, గాంధీభవన్‌, లక్డీకాపూల్‌, పఠాన్‌ చెరుల మీదుగా రాహుల్‌గాంధీ పాదయాత్ర కొనసాగేలా తాజాగా ప్లాన్‌ చేసింది. యాత్రలో భాగంగా అక్టోబరు 24న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రవేశించనుంది. ఏఐసీసీ రూపొందించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం తెలంగాణలో 355 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేపట్టేలా ప్లాన్‌ చేశారు. రూట్‌ మ్యాప్‌పై ఏకాభిప్రాయం కోసం టీపీసీసీ ముఖ్యనేతలు శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు మధుయాష్కీగౌడ్‌, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్‌లు పాల్గొన్నారు. 


 జూపార్కు, చార్మినార్‌, గాంధీభవన్‌, ఖైరతాబాద్‌, పటాన్‌చెరుల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించారు. మక్తల్‌, శంషాబాద్‌, జోగిపేటల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. శంషాబాద్‌ బహిరంగ సభను.. మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని నిర్వహించాలని, మునుగోడు నుంచే ప్రధానంగా ప్రజలను తరలించాలని అనుకున్నారు. చిలుకూరు బాలాజీ దేవస్థానం, జహంగీర్‌ పీర్‌ దర్గా, మెదక్‌ చర్చిల సందర్శన కార్యక్రమమూ నిర్వహించాలనుకున్నారు. పాలమూరు వర్సిటీ, హెచ్‌సీయూ, జేఎన్‌టీయూలనూ సందర్శించేలా ప్లాన్‌ రూపొందించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలతో సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఏమి చేస్తామన్నది వివరిస్తూ వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ను టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్‌, మహిళా డిక్లరేషన్‌, బీసీ డిక్లరేషన్‌, దళిత గిరిజన డిక్లరేషన్‌లు ప్రకటించనున్నారు. 


నేడు డీజీపీని కలవనున్న టీపీసీసీ

ఏకాభిప్రాయం సాధించిన ఈ ప్రతిపాదనపైన బోయినిపల్లిలోని గాంధీభవన్‌ ట్రస్టు స్థలంలో ఈ నెల 4న ఏఐసీసీ పెద్దలు దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్‌ల ఆధ్వర్యంలో టీపీసీసీ ముఖ్యనాయకుల సమావేశం జరగనుంది. పాదయాత్రకు అనుమతి కోసం శనివారం పీసీసీ ప్రతినిధి బృందం డీజీపీని కలవనుంది.

 

14 రోజులు రాహుల్‌ యాత్ర: రేవంత్‌

తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర అక్టోబరు 24న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 14 రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు. సాగరహారం, సకలజనుల సమ్మె టీఆర్‌ఎస్‌ పార్టీ చేయలేదని, వాటిని జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలూ కలిసి చేశాయని రేవంత్‌ అన్నారు. ఉద్యమంలో రేవంత్‌ ఎక్కడున్నాడని మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నాడని, ఉద్యమంలో తాను క్రియాశీలంగా ఉన్నప్పుడు ఆయన అమెరికాలో బాత్రూంలు కడుతుడుండేవాడని వాఖ్యానించారు. 


కేటీఆర్‌.. ట్విటర్‌ టిల్లు: మధుయాష్కీ

మిలియన్‌ మార్చి జరిగినప్పుడు ఎంపీగా తాను ఇక్కడే ఉన్నామని, ట్విటర్‌ టిల్లు.. కేటీఆర్‌ ఎక్కడున్నాడని మధుయాష్కీగౌడ్‌ ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారో అడగాలంటూ సూచించారు. 

Updated Date - 2022-10-01T08:59:30+05:30 IST