Bharat Jodo Yatra: పాదయాత్రతో మోదీకి తానే ప్రత్యామ్నాయమని రాహుల్ చాటగలరా?

ABN , First Publish Date - 2022-09-07T00:41:16+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ‘భారత్‌ జోడో’ యాత్ర (Bharat Jodo Yatra) కన్యాకుమారిలో ప్రారంభమైంది.

Bharat Jodo Yatra: పాదయాత్రతో మోదీకి తానే ప్రత్యామ్నాయమని రాహుల్ చాటగలరా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ‘భారత్‌ జోడో’ యాత్ర (Bharat Jodo Yatra) కన్యాకుమారిలో బుధవారం ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌ వరకు కొనసాగనున్న ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతుంది. మొత్తం 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. 


పాదయాత్రతో పునర్‌వైభవం సాధ్యమేనా? 


పార్టీ నుంచి అగ్రనాయకులంతా వరుసగా బయటకు వెళ్తున్న తరుణంలో రాహుల్ చేపట్టిన ఈ యాత్రపై కాంగ్రెస్ పార్టీలో భారీ అంచనాలున్నాయి. నిన్న గులాం నబీ ఆజాద్, మొన్న కపిల్ సిబాల్, హార్ధిక్ పటేల్, అంతకుముందు జితేంద్ర ప్రసాద, అంతకు ముందు జ్యోతిరాదిత్య సింధియా తదితర కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరి కొందరు బయటకు వెళ్లేందుకు సన్నద్ధమౌతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా భావించే రాజగోపాల్ రెడ్డి ఇటీవలే గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఇప్పటికే బీజేపీలో చేరారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు కీలక నాయకులు త్వరలో పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం చుట్టూనే తిరుగుతుందని, సమర్థులైన నాయకులకు పార్టీ బాధ్యతలప్పగించాలని జీ23గా ఏర్పడిన కాంగ్రెస్ అగ్రనేతలు సూచించారు. జీ23 నుంచి చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడారు. గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్తూ రాహుల్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన్ను సమర్థుడైన నాయకుడిగా తయారు చేసేందుకు తాము ఎంత ప్రయత్నించినా ఏనాడూ రాహుల్ చొరవచూపలేదని ఆజాద్ ఆరోపించారు. అంతేకాదు రాహుల్ తన సెక్యూరిటీ గార్డులతో పాటు తాను కోటరీగా భావించే వారి మాటలే వింటారని, సీనియర్ నేతల మాటలు చెవికెక్కించుకోరని కూడా ఆజాద్ ఆరోపించారు. అసలు సీనియర్లంటేనే రాహుల్‌కు గిట్టదని కూడా ఆజాద్ ఆరోపణలు చేశారు.     


కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఎట్టకేలకూ వచ్చింది కానీ రాహుల్ మాత్రం అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరు. స్వయంగా ఆయనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌‌ను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని సూచిస్తున్నారు. కేరళ కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) కూడా అధ్యక్ష పదవికి పోటీపడతారని ప్రచారం జరుగుతోంది. అగ్రనాయకులంతా పార్టీ వీడుతున్న సమయంలో ఎట్టకేలకూ అధ్యక్ష ఎన్నికల తేదీ ప్రకటించడం ఓ రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా ఇప్పటికే కీలక నేతలంతా పార్టీకి గుడ్‌బై చెప్పడం పూడ్చలేని నష్టమే.  


భారత్‌ను సమైక్యపరిచేందుకా? కాంగ్రెస్‌‌ను సమైక్యపరిచేందుకా? 


భారత్‌ను సమైక్యపరిచేందుకే రాహుల్ పాదయాత్ర అని చెబుతున్నా కాంగ్రెస్‌‌ను సమైక్యపరిచేందుకే ఇది ఎక్కువ దోహదపడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, తాము వారి కోసం పోరాడుతున్నామని చెప్పడానికి రాహుల్ పాదయాత్ర ఉపయోగపడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను సమైక్యపరచడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అభిప్రాయపడ్డారు.  


2014 నుంచి కాంగ్రెస్ పతనం షురూ!


కాంగ్రెస్ ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉంది. ఇటీవల మారిన రాజకీయ పరిణామాల మధ్య బీహార్‌లో సంకీర్ణ సర్కారులో కాంగ్రెస్ భాగమైంది. 2014లో జాతీయ రాజకీయాల్లోకి మోదీ ప్రవేశించినప్పటినుంచీ కాంగ్రెస్‌కు పతనం మొదలైంది. ఎంతగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అప్పటిదాకా పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బలా మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్ అమేథీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ దారుణంగా ఓడిపోయారు. అయితే బీజేపీకి బలం లేని కేరళలోని వాయనాడ్‌నుంచి మాత్రం రాహుల్ భారీ మెజార్టీతో గెలవగలిగారు. 


మోదీకి తానే ప్రత్యామ్నాయం అని చాటగలిగే ఛాన్స్! 


2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగడానికి రాహుల్‌కు ‘భారత్‌ జోడో’ యాత్ర కలిసొస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఆయన పార్టీని ఏమేరకు బలోపేతం చేయగలుగుతారో ఈ ఐదు నెలల యాత్ర ద్వారా తేలనుంది. అదే సమయంలో... 2024లో మూడోసారి అధికారంలోకి రాకుండా మోదీ సర్కారును రాహుల్ ఏ మేరకు నిలువరించగలరనేది కూడా ఈ యాత్ర కొంతమేరకు తేల్చనుంది. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, అలాగే మోదీకి తానే ప్రత్యామ్నాయమని చాటేందుకు భారత్‌ జోడో యాత్ర అవకాశం కల్పించనుంది. అయితే ఈ లక్ష్యాల్లో ఆయన ఎంతమేరకు విజయం సాధిస్తారనేది వేచి చూడాలి.  

Updated Date - 2022-09-07T00:41:16+05:30 IST