Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ పాదయాత్రలో కంటెయినర్ల విశేషాలు

ABN , First Publish Date - 2022-09-09T17:18:38+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ నెల 7న

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ పాదయాత్రలో కంటెయినర్ల విశేషాలు

చెన్నై : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ నెల 7న ప్రారంభించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విజయవంతంగా సాగుతోంది. ఆయనతోపాటు ఈ యాత్రలో పాల్గొంటున్నవారు సేదదీరేందుకు దాదాపు 60 కంటెయినర్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో సకల సదుపాయాలు ఉన్నాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. 


రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించుకుని బస చేసే చోట ఓ చిన్న పట్టణం వెలసినట్లు ఉంటుంది. సుమారు 60 లారీలపై ఏర్పాటు చేసిన కంటెయినర్లు ఒకే చోట ఆగుతాయి. వీటిలో ఆయనతోపాటు ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సేదదీరేందుకు తగిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. 


తమిళనాడులోని కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు ఐదు నెలలపాటు జరిగే భారత్ జోడో యాత్రలో రాహుల్‌తోపాటు సుమారు 120 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. ఓ కంటెయినర్‌ను చిన్న సమావేశ మందిరంగా తీర్చిదిద్దారు. 


పడకల సంఖ్యనుబట్టి వేర్వేరు రంగుల ప్రదేశాలలో ఈ కంటెయినర్లను నిలుపుతారు. ఉదాహరణకు పసుపు రంగు ప్రాంతంలో ఒక పడక (Bed), ఒక కోచ్, స్నానాల గది ఉన్న కంటెయినర్‌ను నిలుపుతారు. పసుపు రంగు కంటెయినర్ నెంబర్ 1లో రాహుల్ గాంధీ సేదదీరుతారు. రెండో కంటెయినర్‌లో ఆయన భద్రతా సిబ్బంది ఉంటారు. 




బ్లూ జోన్ కంటెయినర్లలో రెండేసి చొప్పున పడకలు ఉంటాయి. ఓ వాష్‌రూమ్ కూడా ఉంటుంది. ఎరుపు, నారింజ రంగు ప్రాంతంలో నిలిపే కంటెయినర్లలో నలుగురు చొప్పున బస చేయవచ్చు. అయితే వీటిలో స్నానాల గది ఉండదు. గులాబీ రంగు ప్రదేశంలో మహిళల కోసం కంటెయినర్లను నిలుపుతారు. వీటిలో నాలుగు పడకలు ఉంటాయి. రైలులో మాదిరిగా అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్ ఉంటాయి. వీటికి అటాచ్డ్ బాత్‌రూమ్స్ కూడా ఉంటాయి. ఈ పడకల వద్ద స్టోరేజ్ స్పేసెస్ కూడా ఉంటాయి. 


కామన్ టాయ్‌లెట్స్ ఉన్న కంటెయినర్లకు ఆంగ్ల అక్షరం ‘టి’ (T)తో మార్క్ చేశారు. మొత్తం మీద ఏడు టాయ్‌లెట్స్ ఉన్నాయి. వీటిలో ఐదింటిని పురుషుల కోసం, రెండింటిని మహిళల కోసం కేటాయించారు. ప్రతి క్యాంప్ సైట్‌లో కామన్ డైనింగ్ ఏరియా (భోజన శాల) ఉంటుంది. 


ప్రతి రోజూ ఉదయమే రాహుల్ తదితరులు పాదయాత్రకు బయల్దేరిన తర్వాత ఈ కంటెయినర్లను శుభ్రపరచడానికి సిబ్బంది ఉన్నారు. పడకలపై దుప్పట్లు, ఇతర వస్త్రాలను కూడా వీరు మార్చుతారు. శుభ్రపరుస్తారు. 



కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి కంటెయినర్ 3లో ఉంటారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బంది అలంకార్ సవాయ్, కేబీ బైజు నాలుగో కంటెయినర్లో ఉంటారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బ్లూ జోన్‌లో కంటెయినర్ నెం.15లో ఉంటారు. 


బస చేసే చోట ధూమపానం, మద్యపానం పూర్తిగా నిషిద్ధం. ఈ కంటెయినర్లలోపల ఆహార పదార్థాలను తినకూడదని కూడా ఓ నిబంధన ఉంది. ఈ యాత్రలో పాల్గొంటున్నవారు తమ బట్టలను ఉతికించుకుని, ఇస్త్రీ చేయించుకోవచ్చు. వాటిని లాండ్రీకి ఇచ్చిననాటి నుంచి  మూడో రోజున తిరిగి తీసుకోవచ్చు. 


వ్యక్తిగత, విలువైన వస్తువులను ఎవరైనా కోల్పోతే, ఈ యాత్ర నిర్వాహకులు కానీ, కాంగ్రెస్ టీమ్ కానీ బాధ్యతవహించబోవని ఓ నిబంధనలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-09-09T17:18:38+05:30 IST