భారత వికాస సమితి!

ABN , First Publish Date - 2022-10-02T07:55:19+05:30 IST

నూతన జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ సన్నద్ధమయ్యారు.

భారత వికాస సమితి!

కేసీఆర్‌ జాతీయ పార్టీకి పరిశీలనలో ఈ పేరు 

నేడు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో కేసీఆర్‌ భేటీ

పేరు ఖరారు, కార్యాచరణపైనా ముఖ్యమంత్రి చర్చలు

తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ సభలు

మునుగోడు ఉప ఎన్నికలపైనా చర్చించే అవకాశం

మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో కేసీఆర్‌ సమావేశం

ఇతర పేర్లతోపాటు తెరపైకి భారత వికాస సమితి..!

తెలంగాణతోపాటు ఢిల్లీలోనూ బహిరంగసభలు

యూపీ, మహారాష్ట్రల్లోనూ నిర్వహించే యోచన


హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నూతన జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ సన్నద్ధమయ్యారు. నూతన పార్టీ ప్రారంభం, దాని ఆవశ్యకత గురించే కాకుండా.. పార్టీ ప్రకటన తర్వాత అమలుచేయాల్సిన కార్యాచరణపైనా చర్చించనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆయన ఆదివారం రాష్ట్ర మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. అంతేకాకుండా పార్టీ పేరు విషయంలోనూ కొంత అభిప్రాయ సేకరణ జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. భారత వికాస సమితి అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మరో రెండు పేర్లమీదా ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్‌ మనసులో ఒక పేరును ప్రాథమికంగా నిర్ణయించినా.. అభిప్రాయ సేకరణ జరుగుతూనే ఉంది. నూతన జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులతో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్‌... దానికి సంబంధించిన ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. 


పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు తదితరాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌ ఇప్పటివరకు అత్యంత గోప్యంగా ఉంచారు. కేవలం ముగ్గురు నలుగురు నాయకులకు మాత్రమే చెప్పారు. అయితే ఆయన తొలిసారి ఈ నిర్ణయాన్ని పార్టీలోని కీలక నేతలందరికీ ఆదివారం జరిగే సమావేశంలో చెప్పనున్నారు. వారినుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరోవైపు జాతీయ పార్టీ ప్రకటన అనంతరం తొలి బహిరంగ సభను ఎక్కడ ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న అంశాన్ని కేసీఆర్‌ చర్చించే అవకాశాలున్నాయి. ‘‘నేను ఏ కీలక పని ప్రారంభించినా కరీంనగర్‌ నుంచే.. అక్కడి నుంచి ప్రారంభించిన ప్రతి పనీ విజయవంతమైంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ ప్రకటన జలదృశ్యంలో చేసినా.. తొలి బహిరంగ సభ కరీంనగర్‌లో నిర్వహించాం’’ అని ఆయన పలుమార్లు పార్టీ నేతలతో చెప్పిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా తొలి బహిరంగ సభను కరీంనగర్‌లోనే నిర్వహించాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నారు.


 అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రంలోను ఒక బహిరంగసభ నిర్వహించాలని, మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో మరో బహిరంగసభను ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నారు. కేవలం వివిధ రాష్ట్రాల్లోని నేతలను కలిసేందుకు వెళ్లడమే కాకుండా.. వీలైన చోట్ల బహిరంగసభలు నిర్వహించనున్నారు. రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో.. తెలంగాణలో అమలుచేస్తున్న రైతు బంధు, దళిత బంధు, పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్‌ తదితర సంక్షేమ పథకాలను ఘనంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఈ బహిరంగ సభలకు.. కలిసొచ్చే పార్టీలకు చెందిన నేతలను, ఇప్పటికే తనను కలిసిన కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు.


మునుగోడు ఉప ఎన్నికలపైనా దృష్టి

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలపైనా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగే సమావేశంలో కేసీఆర్‌ చర్చించనున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికలు అత్యంత కీలకమైనందున మునుగోడులో ఎవరెవర్ని ఎలా మోహరించాలన్నదానిపైనా అంతర్గతంగా చర్చిస్తారు. ఈ ఉప ఎన్నికలు నవంబరులో జరగొచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత విస్తృతంగా నియోజకవర్గంలోని ప్రజల్లోకి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తారు. మునుగోడు నియోజకవర్గంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, వాటితో లబ్దిపొందుతున్న ప్రజల వద్దకు వెళ్లి ఓటు కోసం విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల రైతు బంధు లబ్దిదారులందరినీ ఒకేరోజు కలిసి తమకు మద్దతివ్వాలని అడిగింది. అదే మాదిరిగా ఇతర పథకాల లబ్దిదారులందరి వద్దకు వెళ్లడంపైనా టీఆర్‌ఎస్‌ దృష్టిపెట్టనుంది.

Updated Date - 2022-10-02T07:55:19+05:30 IST