Bharat Jodo Yatra: నేడు నగరానికి చేరుకోనున్న రాహుల్‌

ABN , First Publish Date - 2022-09-06T13:42:50+05:30 IST

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోతున్న ‘భారత్‌ జోడో

Bharat Jodo Yatra: నేడు నగరానికి చేరుకోనున్న రాహుల్‌

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 5: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోతున్న ‘భారత్‌ జోడో యాత్ర’ బుధవారం ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ దాదాపు 3,500 కి.మీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌ చేపడుతున్న అతిపెద్ద ప్రజా కార్యక్రమం ఇదే కావడం విశేషం. 2024లో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, దేశప్రజలను ఆకట్టుకొనేలా కాంగ్రెస్‌ ఈ యాత్ర చేపడుతోంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు రాహుల్‌ గాంధీ మంగళవారం రాత్రి విమానంలో చెన్నై రానున్నారు. రాత్రి నగరంలోని ఓ స్టార్‌ హోటల్‌లో ఆయన బసచేస్తారు. 7వ తేది ఉదయం 6.30 గంటలకు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ స్మారక మందిరానికి రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పార్టీ శ్రేణులతో వెళ్లి రాజీవ్‌ స్మారక స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం నగరం నుంచి త్రివేండ్రంకు విమానంలో వెళ్లే రాహుల్‌.. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా కన్నియాకుమారి చేరుకుంటారు.


పాదయాత్రకు 60 కారవాన్లు...

కన్నియాకుమారిలో గాంధీ స్మారక మండపంలో నివాళులర్పించిన అనంతరం ఈ నెల 7వ తేది సాయంత్రం 4 గంటలకు రాహుల్‌ గాంధీ ప్రారంభించే భారత్‌ జోడో యాత్రలో హైటెక్‌ వసతులతో కూడిన 60 క్యారవాన్‌లను వినియోగించనున్నారు. రాహుల్‌తో పాటు పాదయాత్రలో పాల్గొనే బృందాలు రాత్రి వేళల్లో ఈ కారవాన్లలో బసచేస్తాయి.


రాహుల్‌ పాదయాత్రకు భారీగా తరలిరండి : అళగిరి 

కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 150 రోజులు దేశ సమైక్యత ప్రయాణాన్ని చేపట్టనున్న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని రాష్ట్రప్రజలు దీవించాలని, ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తమిళనాడు(Tamil Nadu) కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri) పిలుపునిచ్చారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గ్రామాలు,  పట్టణాలు, మహానగరాల మీదుగా కొనసాగే జోడో భారత్‌ యాత్ర దేశంలో పెద్ద మార్పు తీసుకొస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో సిరిమంతులే ఆర్ధికంగా బలపడుతున్నారని, పేదలు  మరింత నిరుపేదలుగా మారుతున్నారని, ఆకాశాన్నంటేలా ధరలు పెరిగాయని, అన్నదాతలు, కష్టజీవులు అప్పుల్లో మునిగి తల్లడిల్లిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో 23 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువ భాగంలో ఉన్నారని, దేశంలో నెలకొన్న ఈ దుస్ధితిని తరిమికొట్టే బాధ్యత ప్రజలదేనని అళగిరి పేర్కొన్నారు.



Updated Date - 2022-09-06T13:42:50+05:30 IST