భరతుని ప్రేమ.. త్యాగం

ABN , First Publish Date - 2020-07-11T08:10:38+05:30 IST

శ్రీరాముని ముఖ్య భక్తులలో ఒకడు.. భరతుడు. శ్రీరామునికి కూడా భరతునిపై ఎంతో ప్రేమ. అందుకే దశరథునిలాగా భరతుని ప్రేమతో

భరతుని ప్రేమ.. త్యాగం

శ్రీరాముని ముఖ్య భక్తులలో ఒకడు.. భరతుడు. శ్రీరామునికి కూడా భరతునిపై ఎంతో ప్రేమ. అందుకే  దశరథునిలాగా భరతుని ప్రేమతో లాలించేవాడు. అందుకే రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు శోకసంద్రంలో మునిగిపోయాడు. 


అత్యంత సుఖసంవృద్ధః సుకుమార స్సుఖోచితః!

కథం స్వపరరాత్రేషు సరయూమవగాహతే!!


అత్యంత సుకుమారమైన స్వభావం కలవాడు.. మెత్తని పాన్పులపై నిద్రిస్తూ, పన్నీటి స్నానాలతో రాజ్యభోగాలను అనుభవించేవాడు.. ఆ భోగాలకు దూరమై రామనామ స్మరణలో మునిగిపోయాడు. అన్న దూరమైనందుకు కుంగిపోయి.. నియమిత ఆహారాన్నే స్వీకరిస్తూ, కటికనేలపై నిద్రిస్తూ, చన్నీటి స్నానాలను ఆచరిస్తూ, అన్నలాగానే జటలను ధరించి రామ పాదుకా సేవకుడై భక్తితో అంతఃపురంలోనే తపస్సులా జీవితాన్ని గడిపాడు. రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం తానే అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అనే సందేహంతో కుమిలిపోయేవాడు. సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం వచ్చినా.. ధర్మానికి కట్టుబడి వద్దనుకున్నాడు. ఇదే విషయాన్ని వనవాసంలో ఉన్నప్పుడు రాముడికి లక్ష్మణుడు చెప్పాడు. ‘‘అన్నా! భరతుడు మనస్సులో ఎప్పడూ నిన్నే తలుస్తూ, చేష్టలలో నిన్నే అనుసరిస్తూ, నీకు దక్కని భోగానుభవం తనకూ అవసరం లేదని భావించే త్యాగధనుడు.


ఇంతటి సాధుశీలియైున భరతుడు క్రూరస్వభావం కలిగిన కైకేయికి కుమారుడిగా ఎలా పుట్టాడో కదా?’’ అని వాపోయాడు. భరతుని చరితాన్ని, తన మనసును ఆకర్షించే స్వభావాన్ని లక్ష్మణుడు సవిస్తరంగా పలికింనందుకు శ్రీరాముడు సంతోషించాడు. అయితే, కైకేయిని నిందించడాన్ని మాత్రం అంగీకరించలేదు. ‘‘లక్ష్మణా! నీవు ఎప్పడైనా ప్రియమైన భరతుని వృత్తాంతాన్ని మాత్రమే వివరిస్తూ నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండు. అంతేకాని తల్లి కైకేయిని మాత్రం నిందించే ప్రయత్నం చేయవద్దు’’ అని స్పష్టం చేశాడు. అంతేకాదు..


నతే అంబా మధ్యమా తాత! గర్హితవ్యా కథంచన!

తామేవేక్ష్వాకు నాథస్య భరతస్య కథాంకురు!!


‘‘తండ్రిగారు మరణించాక మన వంశమర్యాదను భరతుడే నిలబెడుతున్నాడు. భరతుడు వచ్చి రాజ్యాన్ని పాలించమని, వనవాస దీక్షను విరమించమని కోరినప్పడు నేను అంగీకరించకుండా వెనక్కు పంపించాను. అతనికి నామీద ఉన్న ప్రేమను గుర్తుచేసుకుంటుంటే.. ఈ వనవాస కాలం పూర్తికాకముందే భరతుణ్ని చూసి రావాలని మనసు ఆశపడుతున్నది. మహాత్ముడైన భరతుణ్ణి కలిసి ఆనందిస్తానో కదా’’ అని శ్రీరాముడు అన్నాడు. శ్రీరామునిచే మహాత్ముడిగా సంబోధించబడిన భరతుని కీర్తి చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచేయుంటుంది. భరతుని స్వభావం, అన్నగారి పట్ల ప్రేమ, రాముడు దూరమైనప్పుడు గడిపిన త్యాగజీవనం.. అన్ని కాలాల వారికి ఆదర్శప్రాయంగా నిలిచేవే.


సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Updated Date - 2020-07-11T08:10:38+05:30 IST