చిచ్చు రేపిన చిలుక పలుకులు

ABN , First Publish Date - 2022-06-11T07:27:24+05:30 IST

ఫ్రాన్సిస్ బరౌడ్ ఇంగ్లాండ్‌లోని లివర్ పూల్ నివాసి. వృత్తిరీత్యా చిత్రకారుడు. మార్క్ అనే సోదరుడు అతనికి ఉన్నాడు. మార్క్ మరణించాడు.

చిచ్చు రేపిన చిలుక పలుకులు

ఫ్రాన్సిస్ బరౌడ్ ఇంగ్లాండ్‌లోని లివర్ పూల్ నివాసి. వృత్తిరీత్యా చిత్రకారుడు. మార్క్ అనే సోదరుడు అతనికి ఉన్నాడు. మార్క్ మరణించాడు. చనిపోయిన అన్న నుంచి ఫ్రాన్సిస్‌కు ఒక సిలిండర్ ఫోనోగ్రాఫ్ ప్లేయర్, మార్క్ మాటలు, పాటల రికార్డింగ్‌లు, మార్క్‌కు ప్రాణప్రదమైన ‘నిప్పెర్’ అనే ఫాక్స్ టెరియర్ (బొర్రెలలోని నక్కలను బయటకి లాగే పొట్టి బొచ్చు గల ఒక జాతి పెంపుడు కుక్క) వారసత్వ ఆస్తిగా సంక్రమించింది ఫ్రాన్సిస్ రికార్డులను ప్లే చేశాడు. వెన్వెంటనే నిప్పెర్ ఫోనోగ్రాఫ్ వద్దకు వచ్చి, దాన్ని చూస్తూ మార్క్ మరణించాడు కదా? మరి తాను వింటున్న ఆయన పాటల ఝరి ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? అని సాలోచనలో పడినట్టుగా కన్పించింది. చూడ ముచ్చటగా ఉన్న ఈ దృశ్యాన్ని ఫ్రాన్సిస్ కాన్వాస్‌పై చిత్రించాడు ఆ బొమ్మకు అతను పెట్టిన పేరు: ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’. గ్రామోఫోన్ కంపెనీ ఆ పెయింటింగ్‌ను 1899లో 100 పౌండ్లకు కొనుగోలు చేసింది. మార్క్ పెయింటింగ్ ఆ కంపెనీకి లోగో అయింది. ఎనిమిది సంవత్సరాల అనంతరం ఆ కంపెనీ తన పేరును హెచ్ఎమ్‌విగా మార్చి వేసింది. నిప్పెర్ యశస్సు అజరామరమయింది.


భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ (తాత్కాలికంగా తొలగించారు), నవీన్ కుమార్ (పార్టీ నుంచి బహిష్కరించారు)లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని పత్రికలలో చదివినప్పుడు నాకు నిప్పర్ గాథ జ్ఞాపకమొచ్చింది. జూన్ 5న బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి నుపుర్‌కు ఒక లేఖ వచ్చింది. అదిలా ప్రారంభమయింది: ‘వివిధ అంశాలపై పార్టీ వైఖరికి విరుద్ధమైన అభిప్రాయాలను మీరు వ్యక్తం చేశారు’. అవునా?! భారతదేశ పౌరులు అయిన ముస్లింలు, క్రైస్తవులకు సంబంధించిన వ్యవహారాలపై బీజేపీ వైఖరి ఏమిటి? నేను అమితాశ్చర్యంలో మునిగిపోయాను.


నుపుర్ శర్మ, నవీన్ కుమార్‌లు బీజేపీ విధేయ కార్యకర్తలు. వారు తమ నాయకుల ఉపన్యాసాలను చాలా శ్రద్ధగా వింటారు. మీలో చాలా మంది వలే నుపుర్, నవీన్‌లు పరిశీలిస్తారు, చదువుతారు, వింటారు. ఉదాహరణకు 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ఉపన్యాసం నొకదాన్ని విన్నారు. మోదీ ఏమన్నారో తెలుసా? ‘ఐదు కోట్ల మంది గుజరాతీల ఆత్మగౌరవం, ధైర్యాన్ని మనం పెంపొందించగలిగితే అలీల, మాలీల, జమాలీల కుట్రలు మనకు ఎటువంటి హానీ చేయలేవు’. అలీలు, మాలీలు, జమాలీలు ఎవరు, ‘మనం’ అంటే ఎవరు, ‘మన’లకు హాని చేసే కుట్రలు వారు ఎందుకు చేస్తారు? అని నుపుర్, నవీన్‌లు చకితులయ్యే ఉంటారు.


2017లో ఉత్తరప్రదేశ్ శాసనసభా ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక స్మరణీయ ఉపన్యాసంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్’ అంటే తన అభిప్రాయమేమిటో ఇలా సంగ్రహించి చెప్పారు: ‘మీరు ఒక గ్రామంలో ఒక కబ్రిస్తాన్ (శ్మశానం)ను సృష్టిస్తే, ఒక దహన వాటికనూ సృష్టించాలి. ఈ విషయంలో ఎటువంటి వివక్షకు తావుండకూడదు’. నూపుర్, నవీన్ మనస్సులపై ఈ మాటలు ప్రగాఢమైన ముద్ర వేసివుంటాయి. 2019 ఏప్రిల్ 11న అమిత్ షా మాటలనూ వారు విన్నారు. అయనిలా అన్నారు: ‘దేశ వ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సి)ని అమలుపరిచి తీరుతాం. బౌద్ధులు, హిందువులు, సిక్కులు మినహా ప్రతీ ఒక్క చొరబాటుదారుడినీ దేశం నుంచి పంపించివేస్తాం... చొరబాటుదారులు అందరినీ ఏరివేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది... చట్టవిరుద్ధ వలసదారులు చెదపురుగులు లాంటి వారు. పేదలకు అందవలసిన ఆహారధాన్యాలను వారు దక్కించుకుంటున్నారు. మన ఉద్యోగాలనూ వారే తీసుకుంటున్నారు’. అవి సరైన వ్యక్తి, సరైన సమయంలో, సరైన ప్రదేశంలో అన్న మాటలని నుపుర్, నవీన్‌లు విశ్వసించి వుంటారు.


‘చిక్కులు సృష్టిస్తున్న వ్యక్తులను వారి వస్త్రధారణను బట్టి గుర్తించవచ్చని’ 2019 డిసెంబర్ 15న జార్ఖండ్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నుపుర్, నవీన్‌లు బహుశా, ప్రధాని మోదీ ఉపన్యాసాన్ని వినే వుంటారు. ప్రజలను వారి వస్త్రధారణను బట్టి గుర్తించాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇలా అన్నారు: ‘ఈ పోరాటం ఇప్పుడు 80 వర్సెస్ 20’. నుపుర్, నవీన్‌లు ఈ మాటలు వినే వుంటారు. అవి వారి మనస్సుల్లో నిలిచిపోయి వుంటాయి. ‘20 శాతం’ ప్రజలు ‘80 శాతం’ ప్రజల శత్రువులని వారికి అర్థమయి వుంటుంది.


ముస్లింలపై మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ‘గురూజీ’గా గౌరవిస్తారు) అభిప్రాయమే ఆ మతస్తుల పట్ల బీజేపీ వైఖరి అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. భారతదేశంలోనూ, భారత పార్లమెంటు, భారతదేశ రాష్ట్రాల శాసనసభల్లో ముస్లింలు ఉండడం బీజేపీ వారికి ఇష్టం లేదు. పార్లమెంటు ఉభయ సభలలోని 375 మంది బీజేపీ ఎంపీలలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఈ నెలాఖరుకు ఉండబోరు. 403 మంది సభ్యులు గల ఉత్తరప్రదేశ్ శాసనసభ, 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ పోటీకి నిలబెట్ట లేదు. బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న 11 రాష్ట్రాలలో ఒకే ఒక్క ముస్లిం మంత్రి ఉన్నాడు. 2012 జూన్‌లో భారత ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురైషీ పదవీ విరమణ చేసిన తరువాత మన జాతీయ ఎన్నికల సంఘంలో ఒక్క ముస్లిం అధికారిని కూడా ఎన్నికల కమిషనర్‌గా నియమించనేలేదు. ఈ జాబితా చాలా పొడుగైనది సుమా! నుపుర్ శర్మ, నవీన్ కుమార్‌లు తమ వ్యాఖ్యలలో, వివిధ అంశాలపై బీజేపీ వైఖరిని విశ్వసనీయంగా ప్రతిబింబించారని నేను అభిప్రాయపడుతున్నాను. వారు తమ అధినేతల మాటలు విన్నారు. తమ సొంత శైలిలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆధునిక భారతదేశ గ్రామో ఫోన్ కంపెనీ.


కేంద్రం అనుసరిస్తున్న మైనారిటీ మత వర్గాల వ్యతిరేక విధానాలు, ఆ వర్గాల పట్ల భీతి, విద్వేష వైఖరి పర్యవసానాల గురించి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని కాంగ్రెస్‌తో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. రోమియో వ్యతిరేక దళాలు, లవ్ జిహాద్ ఉద్యమం, పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌరుల పట్టిక, అధికరణ 370 రద్దు, శాసనసభలలో మతాంతరీకరణ వ్యతిరేక బిల్లులు, హిజాబ్, హలాల్, ఆజాన్ మొదలైన అల్ప సమస్యలపై రాద్ధాంతాలు, ఉమ్మడి పౌర స్మృతి, ఇంకా ఇస్లాం భీతిని ప్రతిబింబిస్తున్న అనేక అంశాలపై ప్రతిపక్షాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ప్రతిపక్షాల మాట విననే లేదు. విన్నా ఉపేక్షించింది. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధుల వ్యాఖ్యలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మరి 15 ఇతర దేశాలు తీవ్రంగా ఖండించడంతో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తనను తాను రక్షించుకోవడానికి పెనగులాడుతోంది. పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను విదేశాంగ మంత్రికి బదులుగా విదేశాంగ శాఖ కార్యదర్శికి అప్పగించారు.


బీజేపీ అధికార ప్రతినిధుల వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాటా మాట్లాడ లేదు. ఇది విచారకరమైన సత్యం. ఈ సంక్షోభాన్నీ అధిగమించగలనని, జీవితం యథావిధిగా సాగిపోగలదని ఆయన భావిస్తున్నారు. నిజమేమిటంటే 20 కోట్ల మందికి పైగా ముస్లింలను మినహాయిస్తే భారతదేశంలో రాజకీయ జీవితం ప్రశాంతంగా భవిష్యత్‌లోకి పురోగమించదు. ముస్లింల పట్ల వివక్షా వైఖరిని ఇప్పటికైనా విడనాడాలని ఈ సారి ముందుగా హెచ్చరించింది ప్రతిపక్షాలు కాక, ప్రపంచదేశాలని విస్మరించవద్దు మోదీ గారూ!


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, 

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-06-11T07:27:24+05:30 IST