ఖమ్మం జిల్లాలో భారీ దోపిడీ

ABN , First Publish Date - 2021-02-27T05:28:02+05:30 IST

ఖమ్మం జిల్లా వైరాలోని ద్వారకానగర్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది.

ఖమ్మం జిల్లాలో భారీ దోపిడీ
ఆసుపత్రిలో ఉన్న డుంగారావుతో మాట్లాడుతున్న ఏసీపీ, సీఐ

సుమారు రూ.78లక్షల సొత్తు చోరీ

వ్యక్తిని చితకబాది అపహరణ

ఖమ్మం జిల్లా వైరాలో ఘటన 

వైరా, ఫిబ్రవరి 26: ఖమ్మం జిల్లా వైరాలోని ద్వారకానగర్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. రాజస్థాన్‌ నుంచి వచ్చి వైరాలో స్థిరపడిన డుంగారావు అనే వ్యక్తిని నల్లమాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతుకులు చితకబాది భారీగా 38లక్షల నగదు, రూ.40లక్షల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుడు డుంగారావు చెబుతున్న వివరాల ప్రకారం సుమారు రూ.78లక్షల సొత్తు అపహరణకు గురైనట్టు తెలుస్తోంది. పదేళ్ల క్రితం రాజస్తాన్‌ నుంచి వైరా ప్రాంతానికి వచ్చిన డుంగారావు, అతడి కుమారులు వైరాలోని జాతీయ ప్రధాన రహదారిలో ద్వారకానగర్‌ బోర్డుకు సమీపంలో మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎలక్ర్టికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. షాపునకు దగ్గర్లోనే మరో ఇంట్లో వారు నివాసం ఉంటూ.. ఆ ఇంట్లోనే సామగ్రిని నిల్వచేస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఏడున్నరగంటల సమయంలో నల్లమాస్క్‌లు ధరించిన ఇద్దరు అగంతుకులు డుంగారావు ఉన్న ఇంటి వద్దకు వచ్చి ఎలక్ర్టికల్‌ సామాన్లు కావాలని, తమకు కావల్సిన సామాన్లు చూసుకుంటామని నమ్మబలికి లోపలికి ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న డుంగారావును చితకబాది.. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి కిందపడేసి ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని బంద్‌చేసి ఇంటికొచ్చిన కుమారుడికి లోపల బంధించి ఉన్న తండ్రి డుంగారావు కన్పించాడు. వెంటనే తాళ్లు తొలగించి స్థానికుల సహాయంతో డుంగారావును ఆసుపత్రికి తరలించారు. అయితే రాజస్థాన్‌లో ఉన్న తమ భూములను విక్రయించగా వచ్చిన సొమ్మును వైరా తీసుకువచ్చి తాముంటున్న ఇంట్లో భద్రపరిచామని డుంగారావు, ఆయన కుమారులు చెబుతున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వైరా ఏసీపీ కె.సత్యనారాయణ, సీఐ జె.వసంతకుమార్‌, ఎస్‌ఐ వి.సురేష్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డుంగారావు వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అయితే సొత్తును దోచుకెళ్లిన దొంగలు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడారని డుంగారావు పోలీసులకు చెప్పారు. 


Updated Date - 2021-02-27T05:28:02+05:30 IST