రామ్‌గోపాల్‌వర్మ పిలిచి నీ జడ్జిమెంటే కరెక్ట్‌ అని చెప్పారు

Published: Sat, 08 Feb 2020 03:07:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రామ్‌గోపాల్‌వర్మ పిలిచి నీ జడ్జిమెంటే కరెక్ట్‌ అని చెప్పారు

భాస్కరభట్ల రవికుమార్‌.. మాస్‌ పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌.. క్లాస్‌ ప్రేక్షకులకు అభిమాన గేయ రచయిత. ఆయనకు పాటలు రాయడమంటే చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసేంత పిచ్చి. ఆయన రాసిన ఎన్నో పాటలు కుర్రకారును ఊపేస్తుంటాయి. లిరిసిస్ట్‌గా తన పదహారేళ్ల ప్రస్థానంలో వెయ్యికి పైగా పాటలు రాసిన భాస్కరభట్ల.. తన అనుభూతులను, అనుభవాలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో 11-12-2016న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కే’లో పంచుకున్నారు.


ఆర్కే: ఎలా ఉన్నారు? 

భాస్కరభట్ల: బాగున్నాను.

 

ఆర్కే: పెద్ద నోట్లు రద్దు చేశారు కదా. మీపై కూడా ఆ ప్రభావం పడిందా?

భాస్కరభట్ల: లేదండి(నవ్వులు)

 

ఆర్కే: మొహమాటమా?

భాస్కరభట్ల: మొహమాటం ఏం లేదు. నిజానికి ఏ రైటర్‌ దగ్గరా పెద్ద నోట్లు ఉండవు. నాకు మొదటి నుంచి చెక్కుల రూపంలోనే ఇస్తూ వచ్చారు.

 

ఆర్కే: పెద్ద నోట్ల రద్దు మీద పాటలు రాశారా?

భాస్కరభట్ల: దేశానికి బాగా డబ్బు చేసింది. మోదీ నిర్ణయం అందరికీ ‘క్యూ’రియాసిటీనే. ఇలా కొన్ని రాశాను. కెమెరామెన్‌గంగతో రాంబాబులో ఇలాంటి పాట రాశాను. నీ ఇంటి చూరు విరిగి మీద పడకముందే.. అనే పాట రాశాను.

 

ఆర్కే: కృష్ణానగరే మామా... పాట మీకే బాగా పేరుతెచ్చింది కదా. ఆ పాట అనుభవంతో రాశారా?

భాస్కరభట్ల: సినిమా కష్టాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను అద్దె ఇంట్లో ఉన్న సమయంలో ఓనర్స్‌ సింగపూర్‌ నుంచి వచ్చేస్తున్నాం. ఖాళీ చేయడం అని చెప్పారు. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా దొరకలేదు. టులెట్‌ బోర్డు చూసి ఫోన్‌ చేస్తే సినిమా పాటలు రాసే వాళ్లకి ఇవ్వం అనే వాళ్లు. ఆ సమయంలోనే కృష్ణానగరే మామా... పాట రాస్తున్నాను. చివరలైన్లలో ‘మీరంతా సరదాగా మా సినిమాలే చూస్తారు’ ‘అయినా మేమంటే మీకు చిన్నచూపే లేండి’ అని రెండు లైన్లు రాశాను. ఆ తరువాతే సొంతిల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నా.

 

ఆర్కే: మరి కొనుక్కున్నారా?

భాస్కరభట్ల: కొనుక్కున్నాను. మోతీనగర్‌లో.

 

ఆర్కే: జనరల్‌గా పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు?

భాస్కరభట్ల: నాలుగైదు గంటల్లో రాయగలను. మూడు నెలల సమయం తీసుకున్న పాటలు ఉన్నాయి.

 

ఆర్కే: ఏ పాట అది?

భాస్కరభట్ల: నాన్నకు ప్రేమతో.. సినిమాలో నా మనసు నీతో అనే పాట. సుకుమార్‌తో వర్క్‌ చేయడం ఫస్ట్‌ టైం. రోజూ రాస్తూనే ఉన్నాను. వాళ్లకు ఇంకేదే కావాలి. ఎంత టైం పట్టినా సరే రాయాలని పట్టుదలతో రాశా. ఎక్కువ వెర్షన్స్‌ రాశా.

 

ఆర్కే: మీకు నచ్చి వాళ్లకు నచ్చని పాటలుంటాయా?

భాస్కరభట్ల: ఉంటాయి. వాళ్లకు నచ్చి మనకు నచ్చనివి ఉంటాయి. వాళ్లు ఎక్స్‌పెక్ట్‌ చేయనివి మన జడ్డిమెంట్‌ మీద వర్కవుట్‌ అయినవి ఉంటాయి.


ఆర్కే: ఏ పాటో ఒక్కటి చెప్పండి?

భాస్కరభట్ల : సారొస్తారొస్తారా... పాట పూరీజగన్నాథ్‌కు నచ్చింది. మిగతా వాళ్లందరికీ నచ్చింది. రామ్‌గోపాల్‌వర్మకు నచ్చలేదు. తరువాత పాట హిట్‌ అయ్యాక రామూగారు పిలిచి నీ జడ్జిమెంటే కరెక్ట్‌ అని చెప్పారు.


ఆర్కే: సినిమాల్లో ఏ కష్టాలు అనుభవించారు?

భాస్కరభట్ల: నేను ఏడేళ్ల పాటు సినిమా జర్నలిస్ట్‌గా పనిచేశాను. అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్‌ చేశాను. సినిమా జర్నలిస్ట్‌ కాబట్టి అవకాశాలు తొందరగా వచ్చుంటాయని చాలా మంది అనుకుంటారు. నిజానికి మిగతా వాళ్లకంటే ఎక్కువ కష్టపడ్డాను. నన్ను రచయితగా కాకుండా జర్నలిస్ట్‌గానే చూసేవారు. ఒక నిర్మాత ఫోన్‌ చేసి పాట రాసే అవకాశం ఇస్తానని రమ్మన్నారు. వెళితే అవకాశం ఇస్తాను కానీ, మన సినిమా న్యూస్‌ కలర్‌లో బాగా వచ్చేలా చూడండి అన్నారు. నేను న్యూస్‌ రాసి ఇచ్చాను. అది ఎక్కడ పెట్టాలో నిర్ణయించేది నేను కాదు కదా. ప్రయారిటీని బట్టి డెస్క్‌లో పెడతారు. వాళ్లు బ్లాక్‌అండ్‌వైట్‌లో పెట్టారు. మరుసటి రోజు నిర్మాతకు ఫోన్‌ చేస్తే నువ్వు బ్లాక్‌అండ్‌వైట్‌లో పెట్టావు కదా నీకు పాట ఇయ్యను అన్నారు. ఇక జర్నలిజం నన్ను షాడోలా వెంటాడుతుందని అర్థమయి రిజైన్‌ చేసాను. నాకు పాటలెంత పిచ్చి అంటే జర్నలిస్ట్‌ ఉద్యోగం వదిలేసే అంత.

ఆర్కే: మొదటి పాట ఎప్పుడు రాశారు?

భాస్కరభట్ల: 2000 సంవత్సరంలో. బాలకృష్ణ గారి ‘గొప్పింటల్లుడు’ సినిమాకు రాశా. పద్మాలయాలో పూరీ జగన్నాథ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుంటే వెళ్లా. ఇలా ఉద్యోగం మానేసానని చెప్పా. వెంటనే మంచి పని చేశావు అన్నాడు. అలా అన్న మొదటి వ్యక్తి పూరీనే. నా ప్రతిసినిమాలో నీకో పాటిస్తాను. నీకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు. చక్రి కూడా అలాగే చెప్పాడు. దాదాపు 70 సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. పూరీ జగన్నాథ్‌ గారికి 24 సినిమాలకు రాశాను.

 

ఆర్కే: మొత్తం సినిమా పాటలన్నీ మీరే రాసినవి ఉన్నాయా?

భాస్కరభట్ల: బిజినెస్‌మెన్‌ సినిమాకి మొత్తం నేనే రాశా. గోలీమార్‌, హార్ట్‌ఎటాక్‌, ఇజం సినిమాలకు రాశా.

 

ఆర్కే: సినిమా రంగంలో సక్సెస్‌ కావాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలంటారు కదా?

భాస్కరభట్ల: అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. నేను రచయితగా ప్రయత్నాలు మొదలుపెట్టినపుడు అప్పటివరకు ఉన్న రచయితల్లో ఉన్న మైనస్‌లను గమనించా. పాట ఎక్కువ రోజులు తీసుకోవడం, అందుబాటులో ఉండకపోవడం వంటివన్నీ గమనించా. ఆ లోపాలు నాలో లేకుండా జాగ్రత్తపడ్డా. అందుకే నేను ఫోన్‌లో అందుబాటులో ఉంటాను. మెసేజ్‌కు కూడా రెస్పాండ్‌ అవుతుంటాను.

 

ఆర్కే: రాయకుండా వదిలేసిన పాటలున్నాయా?

భాస్కరభట్ల : బిజీగా ఉండి, సమయం లేక వదిలేసుకున్నవి ఉన్నాయి కానీ రాయలేక వదిలేసినవి లేవు. నా దగ్గరకు వచ్చే వాళ్లు శంకరాభరణం లాంటి సినిమా పాటలు రాయమని రారు కదా. నేను ఏవీ రాయగలనో వాళ్లకు బాగా తెలుసు.


ఆర్కే: మగాళ్లు ఉత్త మాయగాళ్లే..పాట రాశారు కదా.మీరు కూడా నమ్ముతారా?

భాస్కరభట్ల : నమ్ముతాను. నాతోసహా అందరూ మాయగాళ్లే. పాట రాశాక బాగా రియలైజ్‌ అయ్యాను.


ఆర్కే: స్త్రీ పక్షపాతా?

భాస్కరభట్ల: అవును. నాకిద్దరు ఆడపిల్లలు. వాళ్లను మగపిల్లల్లానే చూసుకుంటాను. స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తాను. చిన్నప్పుడు అమ్మాయి పుట్టిందని రైల్వే ట్రాక్‌లపై పడేసిన సంఘటనలు చూశాను. అలాంటివి నాపైన ప్రభావం చూపించాయి.


ఆర్కే: మీ నాన్న ఏం చేసేవారు? 

భాస్కరభట్ల : అర్చకత్వం. మా నాన్నగారికి సహాయం చేసే వాణ్ణి. అయితే నాపైన శ్రీశ్రీ ప్రభావం ఎక్కువ ఉంది. అప్పుడే రాశాను. ‘నోరు లేని హుండీకి నోట్లతో సత్కారం’ ‘నోరుతో అడిగే యాచకుడికి ఛీ అంటూ చీత్కారం’ అని రాశా. అప్పటి నుంచే ఆ రెబలిజం ఉండేది. నేను నక్సలైట్‌ అయిపోతానేమోనని అనుకునే వాణ్ణి.

 

ఆర్కే: శ్రీశ్రీలా దేవున్ని కూడా నమ్మరా?

భాస్కరభట్ల: న్యూట్రల్‌గా ఉంటాను. అదే పనిగా పూజలు చేయను. ద్వేషించను. నా సక్సెస్‌, ఫెయిల్యూర్‌కు నేనే బాధ్యున్ని అని నమ్ముతాను.

 

ఆర్కే: ఇంట్లో శ్రీశ్రీ ఫోటో పెద్దది ఉంటుందట కదా?

భాస్కరభట్ల: అవును. ఇప్పటికీ రోజూ మహాప్రస్థానం చదువుతాను. పోయెట్రీ రాస్తుంటాను. వాటిలో శ్రీశ్రీ ప్రభావం కనిపిస్తుంది. సినిమా పాటలు రాయడం నా వృత్తి. పోయెట్రీ నా ప్రవృత్తి. రోజూ కవితలు చదువుతాను. మ్యూజిక్‌ వింటాను.

 

ఆర్కే: ఏమేం కవితలు రాశారు?

భాస్కరభట్ల : నేను రాసిన కవితలన్నింటినీ ‘పాదముద్రలు’ పేరుతో పుస్తకరూపంలో తీసుకురాబోతున్నా. దాంట్లో రకరకాల కవితలుంటాయి. ప్రేమ కవితలు కూడా ఉంటాయి.

 

ఆర్కే: మీది ప్రేమ వివాహమేనా?

భాస్కరభట్ల: అవును. జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నన్ను నన్నుగా చూసి ఇష్టపడింది కాబట్టి నేను బాగా ఇష్టపడ్డాను. ఒక ఫంక్షన్‌లో చూసి ఇష్టపడ్డాను.


ఆర్కే: లవ్‌ఎట్‌ఫస్ట్‌ సైటా?

భాస్కరభట్ల: అవును.

 

ఆర్కే: భాస్కరభట్ల అనగానే ఐటం సాంగ్స్‌ అనే ముద్ర ఎందుకు పడింది?

భాస్కరభట్ల: ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. పెద్ద హిట్‌. అప్పటి నుంచి అన్నీ ఐటం సాగ్స్‌. దాదాపు ముప్ఫై, ముఫ్పై ఐదు రాసుంటాను. ఇక విసుగొచ్చి రాయను అని చెప్పాను. ఇప్పుడు మెలొడిసాంగ్స్‌ రాస్తున్నాను. 


ఆర్కే: దాదాపు వెయ్యి పాటలు రాసారు కదా. అందులో మీకు నచ్చనివి ఉన్నాయా?

భాస్కరభట్ల: ఉన్నాయి. నచ్చడం, నచ్చకపోవడం ఏమీ ఉండదు. అవసరం రాయిస్తుంది. మనకు కొంచెం సౌకర్యంగా ఉన్నప్పుడు ఏది రాయాలి, ఏది రాయకూడదో నిర్ణయించుకోవచ్చు. ఒక్కటే ఉన్నప్పుడు రాయాల్సిందే. ముందు బతకాలి. ఆ తరువాత బాగా బతకడం గురించి ఆలోచించొచ్చు.

ఆర్కే: మీరు రాసిన పాటలు రవితేజకు ఎక్కువగా సూటవుతాయి ఎందుకు?

భాస్కరభట్ల: ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా రాస్తాను. రవితేజగారి ఇరవై రెండు సినిమాలకు రాశాను. దాదాపు టీజింగ్‌ సాంగ్స్‌ అన్నీ నేనే రాశాను.

 

ఆర్కే: తరచుగా పూరీ జగన్నాథ్‌తో కలిసి బ్యాంకాక్‌కు వెళుతుంటారు కదా? ఏం చేస్తుంటారక్కడ? ఇక్కడ రాని మూడ్‌ అక్కడెలా వస్తుంది?

భాస్కరభట్ల: అక్కడ 8కల్లా బీచ్‌కు వెళ్లిపోతాం. 9గంటల వరకు పాట ఎలా ఉండాలో పూరీతో కలిసి డిస్కస్‌ చేస్తా. ఆ తరువాత పట్టాయాలో బిగ్‌సి అని షాపింగ్‌మాల్‌ ఉంటుంది. అక్కడకెళ్లి పోతాను. పూరీజగన్నాథ్‌ దగ్గరకు అసిస్టెంట్‌ల అందరూ వస్తారు. సీన్స్‌ రాసుకోవడం, డైలాగ్స్‌ రాయడం, డిస్కషన్స్‌ చేస్తారు. మధ్యాహ్నం లంచ్‌ టైంకు మళ్లీ నేను పూరీ జగన్నాథ్‌ దగ్గరకు వెళ్లిపోతాను. లంచ్‌ తరువాత మళ్లీ వెళ్లిపోతాను. సాయంత్రం మళ్లీ కలుస్తాం. రాసిన పాటను వినిపిస్తాను. మళ్లీ రెండు రోజూ అంతే.

 

ఆర్కే: జ్యోతిలక్ష్మి సినిమాలో తిరుగుబాటు పాటేదో రాసారు కదా. ఏంటది?

భాస్కరభట్ల: చేతికి గాజులు తొడిగి చేతకానోళ్లం అయిపోయామా... అనే పాట రాసాను.

 

ఆర్కే: ఎప్పుడైనా పాడటానికి ప్రయత్నించారా?

భాస్కరభట్ల: అవకాశం రాలేదు.


ఆర్కే: సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్టులకు గొప్పగా గౌరవం ఇవ్వాలనే అభిప్రాయం ఉండదు. అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ వల్ల మీరు ఇబ్బంది పడిన సంఘటనలున్నాయా?

భాస్కరభట్ల: చాలా ఫేస్‌ చేశాను. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. సినిమా జర్నలిస్టుగా చేశాను కాబట్టి, సినిమాలంటే ఆసక్తి మొదలై, రైటర్‌ అయ్యాయని అనుకుంటారు. కానీ నా విషయంలో దీనికి పూర్తి కాంట్రాస్ట్‌. సినిమాలంటే ఇంట్రస్ట్‌ కాబట్టి, సినిమా పాటలు రాయలంటే పిచ్చి కాబట్టి, సినిమా జర్నలిస్టుగా పనిచేశాను. ఇక్కడికొచ్చాక కొత్తగా మొలకెత్తిన ఆశ కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే అక్షరాలు రాసే పని తప్పితే వేరే ఉద్యోగం చేయకూడదని నిర్ణయం తీసున్నాను. నేను కంట్రిబ్యూటర్‌గా చేరడానికి కూడా అదే కారణం. నాకు రాయడం ఇష్టం. రాస్తూ రాస్తూ పోవడం ఇష్టం. రాసే పని ఏమిటంటే జర్నలిజం. అందుకనే రాశాను చాలాకాలం. కవిత్వం రాసుకుంటే డబ్బులివ్వరు కాబట్టి సినిమా పాటలు రాశాను. ఆ పిచ్చితోనే ఈ ప్రొఫెషన్‌ ఎంచుకున్నాను. గవర్నమెంట్‌ జాబ్‌ అసలు వద్దని ఫిక్స్‌ అయ్యాను.

 

ఆర్కే: ప్రభుత్వ ఉద్యోగం అంటే వ్యతిరేకత ఉందా?

భాస్కరభట్ల: కంఫర్ట్‌ ఈజ్‌ ది ఎనిమీ ఆఫ్‌ సక్సెస్‌. రిటైర్‌ అయ్యాక ఎంతొస్తుంది. పెన్షన్‌ ఎంత వస్తుంది. ఈ ఆలోచనలే వద్దు. నిరంతరం బుర్ర పనిచేయాలంటే ప్రైవేట్‌ జాబ్‌లోనే ఉండాలి. మెదడు కొసకు నిప్పంటుకున్నట్లు ఉండాలి.


ఆర్కే: పౌరోహిత్యం వదలేసి అక్షరాలను అమ్ముకుంటానంటే మీ తండ్రిగారు ఏమీ తిట్టలేదా?

భాస్కరభట్ల: తిట్టారు. హైదరాబాద్‌ ఎందుకు ఇప్పుడు అన్నారు. మన ఆలోచనా ధోరణి ఎమిటి అనేది, ఎదుగుతాం అనేది మనకు తెలిసిపోతుంది. కానీ నేను బ్రహ్మదేవుడు వచ్చినా ఆగను. నామీద నాకు నమ్మకం వస్తే ఇక ఎవ్వరు చెప్పినా వినను. జాబ్‌ మానేసేటప్పుడు కూడా కూర్చొబెట్టి వంద మంది అభిప్రాయాలు... అభిప్రాయం అడుగుతా కానీ నిర్ణయం నేనే తీసుకుంటా. ఫిక్స్‌ అవడానికే టైం పడుతుంది. లైఫ్‌లో అనుకున్నది సాధించడానికి ఎంతదూరం అయినా వెళ్తాను.


ఆర్కే: మీకు కోపం ఎక్కువగా వస్తుందట ఎందుకని?

భాస్కరభట్ల: నాకు కోపం బాగా ఎక్కువ. సినిమాల్లోకి వచ్చాక తగ్గింది. హైదరాబాద్‌కు వచ్చాక తగ్గింది. అంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి. అనుకున్న టైంకి జరగాలి. ఇవ్వన్నీ ఎందుకో మరి తెలియదు. చిన్నప్పటి నుంచి ఉండేది. బాగా షార్ట్‌ టెంపర్‌ ఉండేది. ఇలా ఉండే విపరీతాలు జరుగుతాయేమో అని నా అంతట నేనే ఆలోచించి తగ్గించుకున్నాను.


ఆర్కే: ఈ కోపం వల్ల ఏమైనా చెడుకానీ నష్టపోవడం కానీ జరిగిందా? 

భాస్కరభట్ల: అంత స్థాయిలో లేదు. హైదరాబాద్‌ వచ్చాక ఆలోచించడం మొదలుపెట్టాను. బతుకు ఏంటో అర్థమవుతోంది. ఇక్కడ ఎంతలో ఉండాలి, ఎక్కువగా నమ్మకపోవడం... కోపం ఒక్కటే కాదు. అతిగా నమ్మడం, ఎక్కువ ఫ్రెండ్షిప్‌లు అన్నీ వేస్ట్‌ అనిపించింది. అందుకని కోపం ఆటోమేటిక్‌గా తగ్గిపోయింది.


ఆర్కే: సోషల్‌ మీడియాలో కూడా చిన్నచిన్న కవితలు పెడుతుంటారు కదా?

భాస్కరభట్ల: ఎమోషన్‌లో ఏదో రాస్తుంటా. అలాంటిదే ‘ఇంత బతుకూ బతికాక అర్థమైంది ఏంటంటే మనల్ని ఎవడూ హ్యాపీగా బతకనివ్వడని’.


ఆర్కే: ఎవరు బతకనివ్వలేదు మిమ్మల్ని?

భాస్కరభట్ల: రకరకాల సందర్భాల్లో.. రకరకాల మనుషులు. (నవ్వులు). ఇండస్ట్రీలో రచయితల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పలేం. నువ్వు బాగా రాయడం, నీ గురించి ఆలోచించడం పోయి... పక్కవాడు ఏం రాస్తున్నాడు... వాడి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి... ఆ సినిమాలు ఏంటి... అని మేనేజర్లకు ఎంక్వైరీలు పెట్టుకొని... ఆ పాట వాడికి వెళ్లిందా... నాకు వచ్చేలా చూడు అని కమీషన్లు ఇవ్వడం... ఈ ధోరణి గత నాలుగైదేళ్లుగా బాగా పెరిగిపోయింది. దీనివల్ల రచయితకు దక్కాల్సిన గౌరవం మనంతట మనమే తీసుకుంటున్నాం అనిపిస్తోంది. నేను ఆ కేటగిరీలోకి వెళ్లను. అలాంటి అనారోగ్యకరమైన పోటీని స్వాగతించను.


ఆర్కే: సినిమా సక్సెస్‌లో పాట పాత్ర ఎంత శాతం ఉంటుంది?

భాస్కరభట్ల: చాలా ఎక్కువ ఉంటుంది. రిలీజ్‌కు ముందు మ్యూజిక్‌, అందులోనూ మంచి లిరిక్స్‌ చాలా ఇంపార్టెంట్‌.


ఆర్కే: ఇప్పుడు ఆడియో ఫంక్షన్లు చాలా ఘనంగా చేస్తున్నారు. కానీ ఎక్కడా రైటర్లు కనిపించడం లేదేం?

భాస్కరభట్ల: అది వాళ్ల వాళ్ల సంస్కారాన్ని బట్టి ఉంటుంది. చాలాసార్లు బాధేస్తుంది. నా బర్త్‌డే, మ్యారేజ్‌ డేకి డ్రెస్‌ కుట్టించుకోవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ ఆడియో ఫంక్షన్‌కి కొత్త షర్ట్‌ కొనుక్కొని ఉత్సాహంగా వెళ్తే, స్టేజీ మీదకు పిలిచేవారు కాదు. ఆ చొక్కా చింపేసి అక్కడే పడేసి వచ్చేయాలనేంత కోపం వచ్చేది. ఒక పాటకు ఎన్ని వెర్షన్లు కావాలంటే అన్ని రాసి, రాత్రి పగలు కూర్చొని, పెళ్లాం పిల్లలను వదిలేసి, షూటింగ్‌కు సెట్‌ వేసేస్తున్నాం అంటే హడావుడిగా రాసి, అవసరమైతే చెన్నై వెళ్లి పాడించి, సింగర్‌ సరిగ్గా పాడకపోతే దగ్గర కూర్చొని పాడించి చేసిన రైటర్‌ గుర్తుకు రాకపోతే చాలా బాధగా ఉంటుంది. లిరిక్‌ రైటర్‌ పేరు అనౌన్స్‌ చేస్తే నోటికి ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే నాలుక మీద ఏదన్నా మొలుస్తుందా అనేది నాకు అర్థం కాదు. పోస్టర్ల మీద కూడా పేర్లు ఉండవు. సిడి వరకే పరిమితం. అందుకే ఫంక్షన్లకు వెళ్లడమే మానేశాను.


ఆర్కే: ఈ విషయాన్ని మిమ్మల్ని సొంత మనిషిలా చూసుకొనే పూరీ లాంటి వాళ్లకు చెప్పకపోయారా?

భాస్కరభట్ల:నాకు పూరీ డైరెక్టర్‌ కంటే ఎక్కువ. అది నా సమస్య అనుకుంటాడేమో అని భయం.


ఆర్కే: మంచి పేరు తెచ్చిన పాటలు రాసినప్పుడు హీరోలు ఎవరైనా ఫోన్‌ చేస్తుంటారా?

భాస్కరభట్ల: తక్కువ మంది. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌తోనే మాకు అటాచ్‌మెంట్‌ ఎక్కువ. సెట్‌లోకి వెళ్లే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. పాట రాసిన రైటర్‌ గురించి ఆలోచించేవాళ్లు తక్కువ.


ఆర్కే: రెమ్యునరేషన్‌ అంతతమాత్రం అంటున్నారు. గౌరవం కూడా తక్కువే అయితే ఇక ఈ వృత్తి ఎంచుకోవడం ఎందుకు?

భాస్కరభట్ల: ఇది డబ్బులకు, గౌరవానికి సంబంధించింది కాదు. ఇదో పిచ్చి అంతే. సినిమా పాట రాసి కోట్ల సంపాదించాలని ఎవరూ హైదరాబాద్‌కు రాడు. పాట రాయడం ఒక ప్యాషన్‌. ఆత్మానందం, ఆత్మసంతృప్తి కోసం వస్తాం కాబట్టి ఇవన్నీ పట్టించకోం. బయటివాళ్లు ఫీల్‌ అయినంత కూడా నేను ఫీలవను.


ఆర్కే: తొలిపాటకు ఎంత రెమ్యునరేషన్‌ అందుకున్నారు?

భాస్కరభట్ల: ఎనిమిది వేలు. గొప్పింటల్లుడు సినిమాకు ఇచ్చారు.


ఆర్కే: మీ పిల్లలు ఏం చదువుతున్నారు?

భాస్కరభట్ల: పెద్ద పాప టెన్త్‌. చిన్నది ఫోర్త్‌.


ఆర్కే: ఒక కవిగా మీ బలం?

భాస్కరభట్ల: ఆలోచనా విధానం. భాష కంటే కూడా భావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. నేను ఎంత సింపుల్‌గా ఉంటానో, నా పాట కూడా అంతే సింపుల్‌గా ఉండాలనుకుంటాను.


ఆర్కే: మీ యాంబిషన్‌?

భాస్కరభట్ల: సినీ కవిగా కాకుండా మామూలు కవిగా నిలడిపోయేలా మంచి పొయెట్రీ బుక్స్‌ రాయాలి.

 

నా దగ్గరకు చాలామంది రైటర్లు వస్తుంటారు. ‘‘నువ్వేం చదువుకున్నావు. ఫలానా పుస్తకాలు చదువు. సీతారామశాస్రి గారి పాటలు, వేటూరిగారి పాటలు విను. అవి విన్న తర్వాత ఒక సంవత్సరం కసరత్తు చేసి అప్పుడు పాటలు రాయడం మొదలుపెట్టు’ అని వారికి చెబుతుంటాను.

 

నాకు కోపం ఎంత వస్తుందో, ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఏదీ మనసులో దాచుకోలేను. తప్పు చేసినా ఐదు నిమిషాల్లో రియలైజ్‌ అయిపోతాను. అవతలి వాళ్లదే తప్పు అయినా సరే.. నేనే సారీ చెబుతాను.

 

జో అచ్యుతానంద సినిమాలో నేను రాసిన ‘ఒక లాలన, ఒక దీవెన’ పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పాట బాగుందని రిటైర్‌ అయినవాళ్లు, పోలీస్‌ ఆఫీసర్లు, అడ్వకేట్స్‌.. చాలామంది ఫేస్‌బుక్‌లో నాకు మెసేజ్‌ పెట్టారు. పదహారేళ్ల నుంచి పాటలు రాస్తున్నాను. ఏ పాటకూ అందుకోనన్ని ప్రశంసలు ఈ పాటకు వచ్చాయి.

 

ఐటెం సాంగ్స్‌ మీద ఒక ఐటెం సాంగ్‌ను టెంపర్‌ సినిమాలో రాశాను. అదే సినిమాలో దేవుడిపై రాసిన ‘హే భగవాన్‌’ పాట నాకు మంచి పేరు తెచ్చింది

 

టీ, కాఫీ బాగా తాగుతాను. బాగా చదువుతాను. మంచి భోజన ప్రియుడిని, టైమ్‌కు భోజనం చేస్తాను. ఫ్యామిలీతో గడపడం ఇష్టం. మ్యూజిక్‌ వింటూ ఒంటరిగా లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లడం ఇష్టం. ఇవి తప్ప వేరే అలవాట్లు లేవు.

 

నాకు తీరని కోరికలు అంటూ ఏమీ లేవు. హ్యాపీ లైఫ్‌. ఇది కూడా నేను ఊహించని జీవితం.


నేను పాట రాయలేని పక్షంలో చెక్కయితే చెక్కు, డబ్బులయితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. పాట పూర్తయ్యే వరకు చెక్కు కూడా బ్యాంకులో వేయను. నిర్మాత ఇచ్చిన క్యాష్‌ను అలా కవర్‌లోనే పెట్టి పిన్‌ కొట్టేసి పెడతాను.


ఒక ఐటం సాంగ్‌ ఆడవాళ్లు కూడా పాడుకునేలా రాస్తే ఎలా ఉంటుందనే ఐడియాను పూరీజగన్నాథ్‌ ఇచ్చారు. ఆ ఐడియాలో నుంచే పుట్టింది ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాట.


డిగ్రీ చదువుతుండగానే న్యూస్‌ కంట్రిబ్యూటర్‌గా పనిచేశాను. చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి అది కూడా కారణం.


పద్మావతి... పద్మావతి... గుర్తొస్తున్నావే... ఈ పాట ట్యూన్‌కట్టింది కూడా నేనే. దాదాపు 30 ట్యూన్‌లు చేసుంటాను. చిన్న చిన్న మార్పులతో అన్నీ ఓకే అయినవే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.