ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుస్తాం.. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పొన్నం, సీఎల్పీ నేత భట్టి

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలోకి మార్చి, టీఆర్‌ఎస్‌ పతనానికి ఖమ్మం ఎన్నికల్లో నాంది పలుకుతామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పొన్నం ప్రభాకర్‌, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుస్తాం.. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పొన్నం, సీఎల్పీ నేత భట్టి
మాట్లాడుతున్న సీఎల్‌పీ నాయకులు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌

రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి

ప్రజాస్వామ్యయుతంగా అధికారులు పనిచేయాలి

మంత్రే బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు 

ఖమ్మంలో విలేకరుల సమావేశం 

ఖమ్మంసంక్షేమవిభాగం,ఏప్రిల్‌ 22:  ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలోకి మార్చి, టీఆర్‌ఎస్‌ పతనానికి ఖమ్మం ఎన్నికల్లో నాంది పలుకుతామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పొన్నం ప్రభాకర్‌, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలవలేక పోలీసులను అడ్డుపెట్టుకొని.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బెదిరింపుల విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని, వ్యక్తిగతరాగ ద్వేషాలకు వెళ్లబోమని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రే ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని ధ్వజమెత్తారు. సామాన్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేలా రాజ్యాంగం హక్కు కల్పించిందని, కానీ ఖమ్మంలో ఆ హక్కులను అధికార పార్టీ వారు కాలరాస్తున్నారన్నారు. ఇక పోలీసులు ఖమ్మంలో టీఆర్‌ఎస్‌కు ప్రైవేట్‌ సైన్యంలా పనిచేస్తున్నారని, అధికారులు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ పతనం ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ ఆలస్యమైతే ఓడిపోతామనే భయంతోనే కరోనా వ్యాప్తితో జనం అతలాకుతలం అవుతుంటే, హడావుడిగా ఎన్నికలు పెట్టారన్నారు. ఎన్నికల సభలో పాల్గొన్న సీఎంకు కరోనా పాజిటీవ్‌ వస్తే ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందారని, అదే సభకు వచ్చిన ప్రజలకు కరోనా పరీక్షలు చేసి వైద్యసేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన నేతలు.. వైద్యశాఖ మంత్రి చెప్పేది ఒక రకంగా వైద్యశాఖ అధికారులు చెప్పేది మరోరకంగా ఉంటోందని మండిపడ్డారు. ఖమ్మంలో మెజారిటీ డివిజన్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకోబోతోందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్‌కు ఈ సారి గుణపాఠం తప్పదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు ఎండీ జావీద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్‌ వడ్డెబోయిన నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST