అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయికి..

ABN , First Publish Date - 2022-07-07T17:01:35+05:30 IST

ఆరో తరగతి చదువుతున్నప్పుడు హాకీ అంటే ఇష్టం ఏర్పడింది. ఇప్పుడది నాలో విడదీయలేని భాగం అయిపోయింది’’ అంటోంది మడుగుల భవాని

అకుంఠిత దీక్షతో  జాతీయ స్థాయికి..

అబ్బాయిలతో కలిసి ఆడడం ఏమిటనే ప్రశ్నలు...అభ్యాసానికి కావలసినవి సమకూర్చుకోలేని కుటుంబ పరిస్థితులు...ఆట మీద ఇష్టంతో ఇలాంటివి ఎన్నో భరించింది మడుగుల భవాని...పట్టుదలతో శ్రమించి... జాతీయ మహిళా జూనియర్‌ జట్టులో స్థానం సాధించింది...సీనియర్‌ జట్టులో స్థానం, ఒలింపిక్స్‌లో ఆడడం తన లక్ష్యాలని చెబుతోంది.


ఆరో తరగతి చదువుతున్నప్పుడు హాకీ అంటే ఇష్టం ఏర్పడింది. ఇప్పుడది నాలో విడదీయలేని భాగం అయిపోయింది’’ అంటోంది మడుగుల భవాని. హాకీ అభ్యాసాన్ని సరదాగా ప్రారంభించిన ఆమె ఇప్పుడు భారత జూనియర్‌ ఉమెన్‌ హాకీ జట్టు సభ్యురాలు. ఈ స్థాయికి చేరడం వెనుక ఆమె పడిన శ్రమ ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన భవానీ (20) తండ్రి బాబూరావు చిరుద్యోగి. తల్లి వరలక్ష్మి ఒక ఆలయం దగ్గర కొబ్బరికాయలు అమ్ముతారు. వారి ఇంటికి సమీపంలో ఉన్న మైదానంలో... ఎంతోమంది హాకీ ఆడుతూ ఉండేవారు. వారిలో భవానీ అన్న సాయి ప్రకాశ్‌ ఒకరు. ‘‘అన్న చెయ్యి పట్టుకొని, హాకీ స్టిక్‌తో మైదానంలోకి వెళ్ళి, ఆడడానికి ప్రయత్నం చేసేదాన్ని. తరువాత ఆటలో మెళకువలు నేర్చుకున్నాను. నేను గోల్స్‌ చేస్తూంటే... అందరూ ఈలలు వేస్తూ ఉత్సాహపరిచేవారు. ఎప్పటికైనా భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలనే సంకల్పం అప్పుడే నా మనసులో ఏర్పడింది’’ అని నాటి రోజులను గుర్తుచేసుకుంది భవాని.


అంత దూరం ఎందుకన్నారు...

భారత జట్టులో స్థానం అంత సులభం కాదని ఆమెకు తెలుసు. ‘మగపిల్లలతో ఈ ఆటలేమిటి?’ అని బయట అందరూ అనేవారు. మరోవైపు ఆటకు అవసరమైన స్టిక్‌, కాళ్ళకు బూట్లు, సరైన క్రీడా దుస్తులు సమకూర్చుకోలేని పరిస్థితి ఆమె కుటుంబానిది. ఎలమంచిలి కొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో భవాని ఆరో తరగతి చదువుతున్నప్పుడు... వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో దాతల నుంచి హాకీ స్టిక్‌ అందుకుంది. అప్పటి నుంచి మరింత సాధన చేసి... 2014లో కరీంనగర్‌ స్పోర్ట్స్‌ స్కూలుకు ఎంపికయింది. అయితే అక్కడ హాకీ లేదు. ఈలోగా అనంతపురంలోని రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌డీటీ) స్పోర్ట్సు అకాడమీ గురించి ఆమెకు తెలిసింది. ఆ అకాడమీలో ప్రవేశం లభిస్తే కెరీర్‌లో ముందుకు వెళ్లడానికి అవకాశాలు బాగుంటాయని తెలిసి సెలక్షన్స్‌కు హాజరయింది. 2015లో... ఎనిమిదో తరగతిలో... అనంతపురం అకాడమీకి ఎంపికయింది. ఆట కోసం అంత దూరం ఎందుకని ఆమె తల్లితండ్రులు మొదట నిరాకరించారు. చివరకు ఆమె శ్రద్ధను గమనించాక, అన్న నచ్చజెప్పడంతో అంగీకరించారు.


ప్రతిభకు పేదరికం అడ్డు కాదు...

ఆ తరువాత భవాని వెనుతిరిగి చూడలేదు. అకాడమీలో చదువుకుంటూనే... హాకీలో నైపుణ్యం పెంచుకుంది. సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పోటీల్లో పాల్గొని, రాష్ట్ర జట్టుకు ఆడడం ప్రారంభించింది. జట్టులోని కీలకమైన ఫార్వార్డ్‌ స్థానంలో అత్యంత వేగంగా కదులుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. 2017లో పదో తరగతి పూర్తిచేసి... అదే సంవత్సరం ఢిల్లీలోని నేషనల్‌ అకాడమీలో శిక్షణకు ఎంపికయింది. అనంతరం ఐదు దేశాల టోర్నీలో పాల్గొనే జాతీయ మహిళల జూనియర్‌ జట్టుకు ఫార్వార్డ్‌ క్రీడాకారిణిగా అవకాశం దక్కించుకుంది.


ఈ ఏడాది జూన్‌ 19వ తేదీ నుంచి 26 వరకూ ఐర్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ‘‘సీనియర్‌ జట్టులో స్థానం సంపాదించి, భారత జెర్సీతో ఒలింపిక్స్‌లో ఆడడమే నా లక్ష్యం. ప్రతిభకు పేదరికం అడ్డుకాదనేది నా విషయంలో నిజమైంది. లక్ష్య సాధనకు కఠోర శ్రమ ఎంతైనా అవసరం. నా తల్లితండ్రులతో పాటు, స్థానిక హాకీ అసోసియేషన్‌, హాకీ ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ కోచ్‌లు అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేను’’ అంటోంది భవాని.

 సింహాచలం, ఎలమంచిలి, అనకాపల్లి జిల్లా.

Updated Date - 2022-07-07T17:01:35+05:30 IST