మిలియన్ డాలర్ల చేరువలో నితిన్ ‘భీష్మ’

ABN , First Publish Date - 2020-02-25T18:53:26+05:30 IST

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో విడుదలైన భీష్మ చిత్రం సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో

మిలియన్ డాలర్ల చేరువలో నితిన్ ‘భీష్మ’

ఇంటర్నెట్ డెస్క్: నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో విడుదలైన భీష్మ చిత్రం సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్లను షేర్‌ను రాబట్టి విజయవంతంగా దూసుకుపోతోంది. భీష్మకు సూపర్‌హిట్ టాక్ రావడం, పోటీగా మరో చిత్రం లేకపోవడంతో.. నిర్మాతలకు కాసుల పంట పండనుంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ భీష్మ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్ల రూపంలో భారీ ఓపెనింగ్స్ రాకపోయినప్పటికి.. హిట్ టాక్ రావడంతో ప్రవాసులు సినిమా చూసేందుకు క్యూ కట్టారు. మరో రెండు రోజుల్లో భీష్మ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి. ఓవర్సీస్‌లో భీష్మ చిత్రం వీకెండ్‌లోనే లాభాల్లోకి వచ్చేసింది. అల..వైకుంఠపురములో చిత్ర రైట్స్‌ను కొన్న బ్లూస్కై సినిమాస్ ఈ చిత్ర రైట్స్‌ను కూడా కొనుగోలుచేసింది. ఒకేసారి వరుసగా రెండు చిత్రాలు మంచి లాభాలను అందించడంతో బ్లూస్కై సినిమాస్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.  


భీష్మ ఓవర్సీస్ కలెక్షన్లను పరిశీలిస్తే..  ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రానికి అమెరికాలో 94 వేల 244 డాలర్లు(67 లక్షల 72 వేలు) వచ్చాయి. శుక్రవారం లక్షా 51 వేల 697 డాలర్ల(కోటి 8 లక్షల 99 వేలు)ను కొల్లగొట్టింది. శనివారం 2 లక్షల 84 వేల 850 డాలర్ల(రూ. 2 కోట్ల 4 లక్షల 69 వేలు)ను సాధించింది. ఆదివారం లక్షా 28 వేల డాలర్ల(రూ. 91 లక్షల 98 వేలు)ను కొల్లగొట్టింది. రోజురోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ వెళ్తూ.. ఇప్పటివరకు మొత్తంగా 6 లక్షల 58 వేల డాలర్లు(రూ. 4 కోట్ల 72 లక్షల 83 వేలు) సాధించి మిలియన్ మార్క్‌కు చేరువలో ఉంది. బుధవారం నాటికి భీష్మ మిలియన్ డాలర్‌ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోనూ భీష్మకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 82,273 డాలర్ల(రూ. 39 లక్షల 09 వేలు)ను కొల్లగొట్టింది. ఒక్క ఆదివారం రోజే 27,125 ఆస్ట్రేలియన్ డాలర్ల(రూ. 12 లక్షల 89 వేలు)ను సాధించింది. 


ఇదిలా ఉండగా.. నితిన్ నటించిన అ.ఆ చిత్రం ప్రీమియర్ల రూపంలో 2 లక్షల 84 వేల 455(రూ. 2 కోట్ల 4 లక్షలు) డాలర్లు సాధించగా.. చల్ మోహన్ రంగా చిత్రానికి లక్షా 39 వేల 845(రూ. కోటి 48 వేలు) డాలర్లు వచ్చాయి. నితిన్ కెరీర్‌లో ఓవర్సీస్‌లో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా భీష్మ నిలిచింది. నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వలో వచ్చిన అ.ఆ చిత్రం అమెరికాలో 2.45 మిలయన్ డాలర్ల(రూ. 17 కోట్ల 60 లక్షల 50 వేలు)ను సాధించి.. అమెరికాలో టాప్ 15 చిత్రాల్లో స్థానాన్ని సంపాదించింది. అ..ఆ తప్పితే నితిన్‌కు ఓవర్సీస్‌లో మరో మిలియన్ క్లబ్ చిత్రం లేదు. భీష్మ కలెక్షన్లను చూస్తోంటే.. సులభంగా మిలియన్ క్లబ్‌లో చేరేలా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లను దాటుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Updated Date - 2020-02-25T18:53:26+05:30 IST