ఫిట్‌లెస్‌.. బీమా

ABN , First Publish Date - 2021-12-01T06:08:39+05:30 IST

నాలుగు, మూడు, ద్విచక్ర వాహనాలకు జిల్లాలో పలుచోట్ల నకిలీ బీమా బాండ్లు జారీ చేస్తున్నారు.

ఫిట్‌లెస్‌.. బీమా

 వాహనాలకు నకిలీ బీమా బాండ్లు

రూ.200 తీసుకుని ఇచ్చేస్తున్న ఏజెంట్లు

తనిఖీల్లో గుర్తించని ఎంవీఐ, పోలీసులు

 ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందికరమే


 గుంటూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నాలుగు, మూడు, ద్విచక్ర వాహనాలకు జిల్లాలో పలుచోట్ల నకిలీ బీమా బాండ్లు జారీ చేస్తున్నారు. ఏదైనా వాహనానికి థర్డ్‌ పార్టీ క్లెయిమ్‌ సహా బీమా చెల్లించాలంటే రూ.వేలల్లో ఉం డటంతో చాలామంది రూ.200 చెల్లించి ఈ నకిలీ బీమా బాండ్లు కొనుగోలు చేస్తున్నారు. మూడు, నాలుగు చక్రాల వాహనాల ఫిట్‌నెస్‌ సమయంలో వాటిని నివేదిం చి ఎంచక్కా క్లియరెన్స్‌ పొందుతున్నారు. అలానే వాహన తనిఖీల సమయంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, పో లీసులకు నకిలీ బాండ్లు చూపించి పెనాల్టీల నుంచి తప్పిం చుకుంటున్నారు. పోలీసులు, ఎంవీఐలు ఎం తసేపటికీ పాత పెనాల్టీలు ఏమైనా పెండింగ్‌ ఉన్నాయా అని చూస్తు న్నారే కాని ఆ కాగితాలు అసలువా.. నకిలీవా అని చూడ టంలేదు. కనీసం దానిపై ఉండే బార్‌కోడ్‌ని కూడా స్కానిం గ్‌ చేయడం లేదు. దీంతో విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా నకిలీ బీమా బాండ్లు చలామణి అవుతున్నాయి.


ఆన్‌లైన్‌తో అక్రమాలు

వాహనం కొనుగోలు చేసిన సంవత్సరం నుంచి లెక్కించి బీమా ప్రీమియం నిర్ణయిస్తారు. పెద్ద వాహనాలకు అయితే ఏడాదికి రూ.10 వేల వరకు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫుల్‌, థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్‌లు ఉం టాయి. వీటిల్లో తప్పక థర్డ్‌పార్టీ ఇన్ప్యూరెన్స్‌ ఉండాలి. ఏదై నా ప్రమాదం జరిగిన సమయంలో థర్డ్‌పార్టీ  బీమానే క్లె యిమ్‌ అవుతుంది. ఫుల్‌ ఇన్స్యూరెన్స్‌ ఉంటే బండికి ఏదైనా నష్టం జరిగినా, దొంగతనానికి గురైనా క్లెయిమ్‌ పెట్టుకోవ డానికి అవకాశం ఉంటుంది. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలకు అయితే ఏటా బండి విలువ ఆధారంగా బీమా ప్రీమియం ను ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు నిర్ణయిస్తాయి. గతంలో వాహ నం ఫొటో తీసుకుని ఇన్స్యూరెన్స్‌ కార్యాలయాల్లో బాండ్లు జారీ చేసేవారు. అలాంటిది వాటి మధ్యన పోటీ రావడంతో ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ప్రీమియం కట్టించుకుని బాండ్‌ జారీ చేస్తున్నారు. ఇదే అదనుగా కొంతమంది ఏజెంట్లు, నెట్‌ సెంటర్ల నిర్వాహకులు నకిలీ ఇన్స్యూరెన్స్‌ బాండ్లు జారీ చేస్తున్నారు. ఇందుకోసం రూ.200 తీసుకొంటున్నారు.


ఏదైనా ప్రమాదం జరిగితే నష్టమే..

నకిలీ బీమా బాండ్లతో వాహనాలు నడుపుతున్న వారు రేపటి రోజున ఏదైనా ప్రమాదానికి కారకులైతే గాయపడిన వారికి థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ క్లెయిమ్‌ జరగదు. అలానే వారి స్వంత వాహనానికి కూడా ఎలాంటి క్లెయిమ్‌ రాదు. పైగా చట్టరీత్యా ఇలా బీమా కంపెనీల లెటర్‌హెడ్‌లతో నకి లీ బాండ్లు కలిగి ఉండటం నేరం అవుతుంది. పోలీసు లు, ఎంవీఐలు కాస్తంత నిఘా పెంచితే ఇలాంటి నకిలీ బాండ్లు నిత్యం కోకొల్లుల్లుగా వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. 

Updated Date - 2021-12-01T06:08:39+05:30 IST