సీఎం యోగీపై పోటీకి భీంఆర్మీ చీఫ్ పోటీ

ABN , First Publish Date - 2022-01-21T00:21:39+05:30 IST

దేళ్లలో సగం సమయం జైలులోనే గడిపిన ఏకైక రాజకీయ నాయకుడిని నేనే. బీజేపీ ప్రభుత్వం వల్ల నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిని మరోసారి అసెంబ్లీకి వెళ్లనివ్వను. అందుకే నేను ఈ ఎన్నికల్లో యోగికి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నాను..

సీఎం యోగీపై పోటీకి భీంఆర్మీ చీఫ్ పోటీ

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి పోటీకి దిగుతోన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీకి దిగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఆజాద్ మొట్టమొదటి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ పోటీకి సిద్ధమైన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయనున్నట్లు ఆజాద్ గురువారం ప్రకటించారు. వాస్తవానికి గోరఖ్‌పూర్ నియోజకవర్గం యోగికి, బీజేపీకి బలమైన ప్రాంతం. ఈ నియోజకవర్గం నుంచి యోగి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇదే గోరఖ్‌పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.


భీం ఆర్మీతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఆజాద్ కొద్ది రోజుల క్రితమే ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరాం)తో రాజకీయ ప్రవేశం చేశారు. అనంతరం 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వారణాసిలో పోటీ చేస్తానని ఆజాద్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆజాద్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు ప్రయత్నించినప్పటికీ విఫలం కావడంతో ఒంటరిగా పోటీకి దిగనున్నట్లు ఆజాద్ ప్రకటించారు.


ఇక యోగిపై పోటీని పోయిన ఏడాది నవంబర్‌లోనే ఆజాద్ ప్రకటించారు. అయితే అప్పటికి యోగి అసెంబ్లీ బరిలోకి దిగుతారా లేదా అనేది క్లారిటీ లేదు. తాజాగా గోరఖ్‌పూర్‌లోని సాదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యోగి పోటీకి దిగుతున్నారని బీజేపీ ప్రకటించిన అనంతరమే తాను కూడా అదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆజాద్ ప్రకటించడం గమనార్హం. ఇక ఆజాద్‌ను గతంలో యోగి ప్రభుత్వం జైలుకు పంపించిన విషయం తెలిసిందే. మొదటిసారి జైలుకు వెళ్లినప్పటి నుంచే బీజేపీని ఓడిచేందుకు పని చేస్తానని ఆజాద్ చెప్పుకొస్తున్నారు.


ఈ విషయమై ఆజాద్ మాట్లాడుతూ ‘‘ఐదేళ్లలో సగం సమయం జైలులోనే గడిపిన ఏకైక రాజకీయ నాయకుడిని నేనే. బీజేపీ ప్రభుత్వం వల్ల నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిని మరోసారి అసెంబ్లీకి వెళ్లనివ్వను. అందుకే నేను ఈ ఎన్నికల్లో యోగికి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నాను’’ అని అన్నారు. గోరఖ్‌పూర్‌లోని సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1989 నుంచి బీజేపీనే గెలుస్తోంది. 2017లో సైతం ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాధా మోహన్ దాస్ అగర్వాల్ 60,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Updated Date - 2022-01-21T00:21:39+05:30 IST