భీమా కోరేగాం సాక్ష్యాల సృష్టికర్తలు బైటపడ్డారు!

ABN , First Publish Date - 2022-06-18T05:56:19+05:30 IST

పదహారు మంది ప్రజాపక్ష మేధావులను, కార్యకర్తలను (అందులో ఒకరు విచారణ కూడ జరగకుండానే మరణశిక్షకు గురయ్యారు!) నాలుగు సంవత్సరాలుగా..

భీమా కోరేగాం సాక్ష్యాల సృష్టికర్తలు బైటపడ్డారు!

పదహారు మంది ప్రజాపక్ష మేధావులను, కార్యకర్తలను (అందులో ఒకరు విచారణ కూడ జరగకుండానే మరణశిక్షకు గురయ్యారు!) నాలుగు సంవత్సరాలుగా నిర్బంధించిన, వేధిస్తున్న ‘కుఖ్యాత’ భీమా కోరేగాం కేసులో మరొక కీలక వాస్తవం వెల్లడయింది. ఈ కేసు నిందితుల కంప్యూటర్లలోకి దొంగతనంగా జొరబడి, ఆ కంప్యూటర్లలో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన కుట్రదారులెవరో కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ సెంటినెల్ వన్ పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు.


భీమా కోరేగాం కేసులో 2018 జూన్ 6న మొదటిసారి అరెస్టులు, ఆగస్ట్ 28న రెండోసారి అరెస్టులు జరిగినప్పుడు పోలీసులు పత్రికా సమావేశాలు పెట్టి నిందితుల ఎలక్ట్రానిక్ పరికరాలలో దొరికిన సాక్ష్యాధారాలు అని కొన్ని ఉత్తరాలు, పత్రాలు పత్రికలకు అందజేశారు, కొన్నిటి నుంచి భాగాలు చదివి వినిపించారు. ఆ పత్రాలలో ప్రధానమంత్రి హత్యకు కుట్రతో సహా ఎన్నో నేరారోపణలకు ఆధారాలున్నాయని పోలీసులు అన్నారు.


న్యాయస్థానం అధీనంలో ఉన్న ఆ ఎలక్ట్రానిక్ పరికరాల క్లోన్ కాపీల ప్రతులను చట్టప్రకారం నిందితులకు ఇవ్వడానికి దాదాపు రెండు సంవత్సరాలు తాత్సారం జరిగింది. చివరికి నిందితులకు అందిన ఆ ప్రతులను పరిశోధించిన మసాచుసెట్స్‌కు చెందిన డిజిటాల్ ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనాల్ కన్సల్టింగ్ 2021 ఫిబ్రవరిలో విడుదల చేసిన తొలి నివేదికలో నిందితుల ఎలక్ట్రానిక్ పరికరాలలోకి మాల్‌వేర్, స్పైవేర్ ద్వారా దొంగతనంగా చొరబడిన ఆగంతుకులు ఆ పత్రాలను ప్రవేశపెట్టారని వెల్లడించింది. ఆ పత్రాలు నిందితులకు కనబడని రహస్య అరలలో ఉండిపోయాయని, ఆ అరలను నిందితులు ఒక్కసారైనా తెరిచిన దాఖలా లేదని, చివరికి నిందితుల కంప్యూటర్లలోని మైక్రోసాఫ్ట్ వర్డ్‌ వర్షన్‌కూ, ఆ పత్రాల వర్షన్‌కూ తేడా ఉందని, ఆ పత్రాల వర్షన్‌ను నిందితులు ఎప్పుడూ వాడిన దాఖలా లేదని ప్రకటించింది.


ఆ తర్వాత అదే అంశాన్ని వేరు వేరు సాంకేతిక విధానాలు ఉపయోగించి, వేరు వేరు రకాల పరిశోధనల్లో కెనడాకు చెందిన సిటిజెన్ లాబ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, సెంటినెల్ వన్ కూడ నిర్ధారించాయి. సెంటినెల్ వన్ ఫిబ్రవరి 2022లో విడుదల చేసిన నివేదికలో మోడిఫైడ్ ఎలిఫెంట్ అని పేరు పెట్టిన ఈ చొరబాటు కార్యక్రమంలో ఇజ్రాయెల్ ఎన్ఎస్ఒ కంపెనీకి చెందిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడి భీమా కోరేగాం నిందితుల మీద మాత్రమే కాక, దేశంలో కనీసం మూడు వందల మంది రాజకీయ నాయకుల మీద, జర్నలిస్టుల మీద, అధికారుల మీద, న్యాయమూర్తుల మీద కూడ నిఘా పెట్టారని వెల్లడించింది.


ఈ నిర్ధారణలన్నిటికీ తలమానికంగా ఇప్పుడు సెంటినెల్ వన్ పరిశోధకులు జువాన్ ఆండ్రెస్ గెరెరో–సాడె, టామ్ హెగెల్‌లు మరొక సంచలనాత్మకమైన వాస్తవం వెల్లడించారు. ఏడాదిగా జరిగిన పరిశోధనలన్నీ ఈ చొరబాటు ఏ సర్వర్ నుంచి, ఏ ఐపి అడ్రస్ నుంచి జరిగిందో మాత్రమే నిర్ధారించగా ప్రస్తుత పరిశోధన కచ్చితంగా ఈ చొరబాటు ఏ కంప్యూటర్ నుంచి, ఏ ఫోన్ నుంచి, ఏ వ్యక్తి చేశారో నిర్ధారించింది. గత పరిశోధనలు చొరబాటుదార్లెవరో చెప్పలేకపోయినా ‘‘చొరబాట్ల లక్ష్యాలకూ భారత ప్రభుత్వ లక్ష్యాలకూ ఏకీభావం ఉన్నట్టు అనిపిస్తున్నది’’ అని మాత్రమే వ్యాఖ్యానించగా, భీమా కోరేగాం కేసు దర్యాప్తు చేసిన, కొందరు నిందితులను అరెస్టు చేసిన, పూణే కోర్టులో ఈ కేసు జరిగినప్పుడు (జనవరి 2018–ఫిబ్రవరి 2021) దర్యాప్తు అధికారిగా ఉండిన పోలీసు అధికారి సొంత ఫోన్‌తో ఈ చొరబాటుకు సంబంధం ఉందని ప్రస్తుత పరిశోధన సూటిగా, స్పష్టంగా, కచ్చితంగా నిర్ధారించింది.


‘‘ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన వ్యక్తులకూ, ఆ నిందితుల కంప్యూటర్లలో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన వ్యక్తులకూ నిరూపించదగిన సంబంధం ఉంది’’ అన్నారు జువాన్ ఆండ్రిస్ గెరెరో–సాడె. ఈ ప్రత్యేక రంగంలో అత్యంత ప్రామాణికమైన, అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞాన సదస్సు బ్లాక్ హాట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఆగస్ట్‌లో జరగనుందనీ, అక్కడ తానూ, సహ పరిశోధకుడు టామ్ హెగెల్ కలిసి తమ పరిశోధనా ఫలితాలు ప్రకటిస్తామనీ ఆయన అన్నారు. ‘‘ఇది అనైతికం అనే మాటను కూడ దాటిపోయింది. ఇది దుర్మార్గం అనే మాటను కూడ మించినది. కనుక, ఈ కేసులో బాధితులకు సహాయం చేయడానికి మేము ఎంత సమాచారం వీలయితే అంత సమాచారం బహిరంగంగా పంచుకోదలిచాం’’ అన్నారాయన.


ఈ కొత్త పరిశోధన ప్రకారం, మోడిఫైడ్ ఎలిఫెంట్ రోనా విల్సన్, వరవరరావు, హనీబాబులను లక్ష్యంగా పెట్టుకుని, వారికి సంబంధించిన మూడు ఇమెయిల్ అకౌంట్లలో 2018, 2019లలో చొరబడింది. వారి ఇమెయిల్ అకౌంట్లకు మామూలుగా ఉండే రికవరీ అడ్రస్, ఫోన్ నంబర్లకు అదనంగా మరొక అడ్రస్‌ను, ఫోన్ నంబర్‌ను చేర్చింది. ముగ్గురి అకౌంట్లకూ ఇలా కొత్తగా చేర్చిన ‘రికవరీ ఇమెయిల్’ ఒకటేననీ, అది పూణేలోని ఒక పోలీసు అధికారి పూర్తి పేరుతో ఉందనీ, ఆ అధికారే భీమా కోరేగాం కేసు దర్యాప్తులో ఉన్నాడనీ ప్రస్తుతం పరిశోధకులు గుర్తించారు.


ఇలా చొరబడిన మూడు అకౌంట్లు మరొక రకంగా కూడ పూణే పోలీసుల సంబంధాన్ని రుజువు చేశాయి. ఈ మూడు అకౌంట్లలో చొరబడినవారు ఒకే ఐపి అడ్రస్ నుంచి ఆ పని చేశారు. రోనా విల్సన్ ఇమెయిల్ అకౌంట్‌కు 2018 ఏప్రిల్‌లో ఒక ఫిషింగ్ (చొరబడే) ఇమెయిల్ పంపి దాన్ని లొంగదీసుకున్నారు. ఆ ఇమెయిల్ సాయంతో ఆయన రికవరీ అడ్రస్‌ను, నంబర్‌ను చేర్చారు. ఇక ఆ మెయిల్ నుంచి మిగిలిన భీమా కోరేగాం నిందితులందరికీ రెండు నెలల పాటు మెయిల్స్ పంపుతూ అందరి ఇమెయిల్ అకౌంట్లనూ లొంగదీసుకున్నారు.


‘‘ఇలా చొరబడిన వారెవరో మేం సాధారణంగా బైటపెట్టం. కాని ఇక్కడ ఎంత పెంట జరిగిందో చూస్తే నాకు చెప్పక తప్పదనిపిస్తోంది. ఈ చొరబాటుదారులు తీవ్రవాదుల వెంట పడడం లేదు. వీళ్లు మానవహక్కుల పరిరక్షకుల మీద, జర్నలిస్టుల మీద ఎక్కుపెట్టారు. అది సరైనది కాదు’’ అని ఆ ఇమెయిల్ ప్రొవైడర్‌కు సంబంధించిన సాంకేతిక నిపుణులు అన్నారు.

టొరంటో యూనివర్సిటీలోని సిటిజెన్ లాబ్‌లో సెక్యూరిటీ అంశాల పరిశోధకుడు జాన్ స్కాట్ రైల్టన్ మరొక పద్ధతిలో పూణే పోలీసుల సంబంధాన్ని నిగ్గు తేల్చారు. ఆయన భారతదేశంలోని మొబైల్ ఫోన్ల, ఇమెయిళ్ల సమాచారపు ఓపెన్ సోర్స్ డాటాబేస్‌లో పరిశోధన జరిపి, ఆ ఫోన్ నంబర్ పుణె అట్ ఐసి డాట్ ఐఎన్‌తో అంతమయ్యే ఇమెయిల్ అడ్రస్‌దని తేల్చారు. ఆ అడ్రస్ కచ్చితంగా పూణే పోలీసులదే.


మరొక వైపు సెక్యూరిటీ పరిశోధకుడు జీషాన్ అజీజ్ ఇప్పటికే లీకైన ట్రూకాలర్ డాటా బేస్‌లో అన్వేషించి ఆ రికవరీ అడ్రస్, ఫోన్ నంబర్ ఒక పూణే పోలీసు అధికారివని నిర్ధారించారు. అలాగే ఆ నంబర్ ఆ అధికారిదే అని ఐఐఎంజాబ్స్ డాట్ కాం అనే లీకైన డాటాబేస్‌లో కూడ తేలింది. పూణే సిటీ పోలీస్ వెబ్‌సైట్‌తో సహా ఎన్నో డైరెక్టరీలలో ఆ నంబర్ ఆ అధికారిదేనని తేలింది. ఆ నంబర్ వాట్సప్ ప్రొఫైల్ ఫొటో, భీమా కోరేగాం పత్రికా సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారి ఫొటోతో సరిపోయింది. వరవరరావును అరెస్టు చేసినప్పుడు పత్రికల్లో వచ్చిన ఫొటోలో కూడ ఆ అధికారి ఫొటో ఉంది.


అసలు దర్యాప్తులలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా చొరబాటుకు గురై ఉంటే, ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల విశ్వసనీయత ఏమిటనే విశాలమైన ప్రశ్నకు ఈ పరిశోధనలు దారి తీస్తాయని గెరెరో–సాడె అన్నారు. ఆ లోతైన, విశాలమైన ప్రశ్నల సంగతి ఎలా ఉన్నా, ఈ తప్పుడు సాక్ష్యాధారాలతో నాలుగు సంవత్సరాలుగా నిర్బంధంలో మగ్గిపోతున్న బాధితులకు న్యాయం అందించడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. 


ఎన్. వేణుగోపాల్

(మూడు దశాబ్దాలుగా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వెలువడుతున్న 

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ మాసపత్రిక ‘వైర్డ్’లో ఆండీ గ్రీన్ బెర్గ్ 

రాసిన సవివరమైన వ్యాసం ఆధారంగా)

Updated Date - 2022-06-18T05:56:19+05:30 IST