భోగ భాగ్యాల భోగి నేడే

ABN , First Publish Date - 2021-01-13T05:21:21+05:30 IST

సంక్రాంతి పండుగలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగ భోగి. భోగభాగ్యాల ను అందించే భోగి పండుగ సంక్రాంతిలో మొదటిరోజుగా జరుపుకొంటారు.

భోగ భాగ్యాల భోగి నేడే

నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 12: సంక్రాంతి పండుగలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగ భోగి. భోగభాగ్యాల ను అందించే భోగి పండుగ సంక్రాంతిలో మొదటిరోజుగా జరుపుకొంటారు. ఈ రోజున చిన్నారులు మొదలుకొని పెద్ద వయసు వారు పండుగలో భాగస్వాములై వేడుకను ని ర్వహిస్తారు. ఉదయం పూట దేవతారాధనలు నిర్వహించి.. సాయంత్రం పూట కూడళ్ల వద్ద భోగి మంటలు ఏర్పాటు చేసుకొని.. గత సంవత్సర చేదు అనుభవాలు తొలగిపోవాలని కోరుకుంటారు. పలు ప్రాంతాల్లో చిన్నారులకు ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, కీర్తిప్రతిష్టలతో వెలుగొందాలని ఆకాంక్షిస్తూ భోగి పండ్లు పోస్తారు. గ్రామాల్లో ఈ పం డుగను అట్టహాసంగా జరుపుకొంటారు. పాత వస్తువులను ఒక దగ్గరగా చేర్చి భోగి మంటలతో పండుగను నిర్వహిస్తారు. భోగి పండుగ రోజున ముత్తైదువలు సంక్రాంతి నోములకు సిద్ధమై నోమును నోచుకుంటారు. 

సకల భోగాలను అందించే భోగి

మకర సంక్రమణ పర్వదినానికి ముందు రోజు నిర్వహించే సకల  భోగాల పండుగ భోగి. భోగి పండుగ నాడు నిజమైన ఆనందాన్ని అందుకునేటువంటి రోజుగా భావిస్తా రు. ప్రతీ మనిషికి భోగం యోగం వల్లనే లభ్యమవుతుందని గోదాదేవి ధనుర్మాస వ్రత ంలో ఆచరించి చూపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ భోగి పండుగను జరుపుకొంటారు. భోగి పండుగ రోజున ఉదయం పూటనే అభ్యంగన స్నానాలు ఆచరించి కొత్త బట్టలను దేవుని వద్ద ఉంచి పూజలు జరుపుతారు. ఈ రోజున చేసే పూజ సంవత్సరం పొడవునా భాగ్యాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు. 

శ్రీవైష్ణవ ఆలయాల్లో కల్యాణోత్సవాలు

భోగి పర్వదినాన శ్రీవైష్ణవ ఆలయాల్లో కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గోదా దేవి అందించిన 30 రోజుల తిరుప్పావై పాశురాల్లో చివరి రోజయిన భోగిపండుగ నాడు పాశురంను పఠించి గోదా రంగనాథుల కల్యాణోత్సవాలను వైభవంగా జరుపుతారు. గోదా రంగనాథుని కల్యాణోత్సవంతో సంక్రాంతి పర్వదినం ప్రారంభమవుతుందని భావిస్తారు. 

నగరంలోని ఈ ఆలయాల్లో గోదారంగనాథుని కల్యాణోత్సవం 

సుభాష్‌నగర్‌ రామాలయంలో ఉదయం 10 గంటలకు.

జెండా బాలాజీమందిర్‌లో ఉదయం 11 గంటలకు.

హమాల్‌వాడి గోదాదేవి ఆలయంలో ఉదయం 11 గంటలకు.

ఆర్యనగర్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉదయం 11 గంటలకు.

నర్సింగ్‌పల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉదయం 10 గంటలకు.

చక్రంగుడి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో రాత్రి 7 గంటలకు.

Updated Date - 2021-01-13T05:21:21+05:30 IST