పొలాల సంరక్షణకు ‘భూ సుపోషణ్’

ABN , First Publish Date - 2021-04-13T06:40:03+05:30 IST

తెలుగు సంవత్సరాది ఉగాదికి, మన వ్యవసాయానికి ఎంతో సంబంధం ఉంది. చైత్రమాసం ఆరంభమయ్యే ఈ పర్వదినాన ఆ ఏడాదిలో...

పొలాల సంరక్షణకు ‘భూ సుపోషణ్’

తెలుగు సంవత్సరాది ఉగాదికి, మన వ్యవసాయానికి ఎంతో సంబంధం ఉంది. చైత్రమాసం ఆరంభమయ్యే ఈ పర్వదినాన ఆ ఏడాదిలో వ్యవసాయం తీరుతెన్నులు ఎలా ఉంటాయో తెలిపే పంచాంగ శ్రవణం విని ఎంతోమంది రైతులు పొలం పనులకు శ్రీకారం చుడతారు. పశువులను అలంకరించి ఏరువాక సాగిస్తారు. ప్లవ నామ సంవత్సరం ఆరంభమవుతున్న నేడు దేశవ్యాప్తంగా ‘భూ సుపోషణ్‌’ అనే ఒక గొప్ప ఉద్యమం ప్రారంభమవబోతోంది. ఆధునిక రసాయన సాగు పద్ధతులతో జీవం కోల్పోయిన మన భూములను సక్రమరీతుల్లో పోషించుకుని పరిరక్షించుకోవడానికి లక్షలాది రైతులు సంకల్పం తీసుకోబోతున్నారు. 


సకల ప్రాణుల జీవనానికి మూలాధారమైన నేలతల్లి మానవ చర్యలతో చిక్కిశల్యమైపోతోంది. పారిశ్రామిక కార్యకలాపాలు, కాలుష్యకారకాలతో నిర్జీవమైపోతోంది. విధ్వంసక సేద్య విధానాలు, రసాయన ఎరువులు, క్రిమి నాశకాలతో బంగారం పండించే భూమి సహజత్వం కోల్పోయి విషతుల్యమవుతోంది. ఒకవైపు వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతూ మరోవైపు సాగుభూమి తగ్గిపోతూ ఇంకోవైపు మృత్తికా క్రమక్షయంతో నిస్సారమై, ఉత్పాదక శక్తిని కోల్పోతోంది. ముఖ్యంగా పర్యావరణాన్ని నాశనం చేసే రసాయన, సాంద్ర, ఆధునిక సాగు విధానాలతో భారతదేశ నేలల స్వరూపం, వ్యవసాయ ముఖచిత్రం మారిపోతోంది. మిగతా దేశాల కంటే మిన్నగా భారత్‌లో విచక్షణారహితంగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమినాశకాలతో సిరుల నేలలు నిస్సారమై, దిగుబడులు హరించుకుపోతూ నేల, మనుషుల ఆరోగ్యం క్షీణిస్తోంది.


స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో హెక్టారుకు కేజీ రసాయన ఎరువులు వాడితే, ఇప్పుడది సుమారు 150 కేజీలకు చేరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనైతే, ఈ విచ్చలవిడి వాడకం హెక్టారుకు 253 కేజీలకు పెరిగింది. వీటికి తోడు హైబ్రిడ్‌ పంటలకు తెగుళ్ల బెడద అధికమై పురుగులు రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం వల్ల అటు రసాయన పురుగుమందులు, క్రిమి–-కీటక నాశనుల వాడకం ఇంతలంతలైంది. ఈ విధంగా ఏటా లక్షల టన్నుల ఎరువుల వినియోగం, లక్షల లీటర్ల పురుగుమందుల వాడకం వల్ల భూమిలో రసాయన పదార్థాలు పేరుకుపోయి నేలలు రాటుదేలిపోతున్నాయి. ఏటికేడు మృత్తికా క్రమక్షయం పెరిగి ఉత్పాదకత పతనమవుతోంది. దేశంలో ఇప్పటికే 25 శాతం సాగుభూమి నిస్సారమైంది. ఏటా 2.5 కోట్ల ఎకరాల్లో నేల ఫలదక్షత తగ్గుతోంది. పైగా నీటిముంపు, క్షారత్వం, నేలకోత వల్ల పంటభూములు సాగుకి పనికిరాకుండాపోతున్నాయి.


నేలలను బట్టే పంట. విత్తును బట్టే దిగుబడి. మన భూమి బాగుంటే ఏ పంటైనా పండుతుంది. నేలలో దమ్ము ఉంటే ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. సేంద్రియ కర్బనం 5శాతం ఉన్న సారవంతమైన నేలల్లో సిరులు పండించవచ్చు. కానీ నేడు అదే లోపించింది. పట్టుమని అర శాతం కూడా సేంద్రియ కర్బనం లేకుండాపోయింది. సింహభాగం నేలల్లో సేంద్రియ కర్బనం 0.3 శాతానికి మించి లేదు. అందుకే తెగుళ్లు విజృంభిస్తున్నాయి. కరవులు, వరదలు ఏవి ఎక్కువైనా తట్టుకోలేకపోతున్నాయి. నీటిని భూమిలోకి ఇంకించలేక పోతున్నాయి. అంతిమంగా రసాయన ఎరువులు, మందులు వాడనిదే మన నేలలు కనీస దిగుబడులు ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా అప్పులు చేసి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మన భూములు నాశనమైపోతాయి. బస్తాలకొద్దీ ఎరువులు వాడనిదే పంట దిగుబడులు రాకుండాపోతాయి. మందుల పంటలు తిన్న మనుషుల ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుంది. భూతాపం, కాలుష్యం పెరిగిపోయి విపత్తులు పెరిగిపోతాయి. ఈ పరిణామాలు ఆహారకొరత, నీటిఎద్దడి, ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తాయి.


మానవ, జీవరాశి మనుగడకు భూమే ఆధారం. అలాంటి భూమిని ఎంత సజీవంగా, శక్తిమంతంగా ఉంచితే మనకి అంత ఆహారం, ఆరోగ్యం, ఆనందం దక్కుతుంది. ఆధునిక, పుడమి వినాశకర సాగు విధానాలతో జీవం కోల్పోయిన నేలలకు ఇకనైనా చికిత్స చేయాలి. భూసారాన్ని పెంచాలి. భూమి ఆరోగ్యం కాపాడుకోవాలి. నేల సహజత్వం, భౌతిక గుణాలను పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా ప్రతి రైతు తన పొలంలో సేంద్రియ కర్బనం కనీసం 2 శాతానికైనా పెంచుకోవాలి. పశువుల పేడను కచ్చితంగా పంటలకు వేయాలి. పంటల వ్యర్థాలను తగులపెట్టకుండా సహజంగా భూమిలో కుళ్లిపోయే విధానాలు అవలంబించాలి. భూసారాన్ని మెరుగుపరిచే నవధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువుల పంటలను తప్పనిసరిగా సాగు చేయాలి. కలుపు నివారణ కోసం వాడే రసాయన కలుపు నాశకాలను పూర్తిగా నిలిపివేయాలి. వానపాములు, సూక్ష్మజీవుల సంతతిని వృద్ధి చేసే సహజ ఎరువులను నేలలకు అందించాలి. చీడపీడల నియంత్రణ కోసం ఆకుల కషాయాలు, జీవ నియంత్రణ బాక్టీరియా ద్రావకాలను వాడాలి. రసాయన ఎరువులను, పురుగుమందులను ఒకేసారి కాకుండా క్రమపద్ధతిలో తగ్గిస్తూ రావాలి. భూసార పరీక్షల ఆధారిత ఎరువుల వినియోగం పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలి. మిశ్రమ, అంతర పంటల సాగు, ఆచ్ఛాదనతో పంటల ఉత్పత్తి రెట్టింపుచేసుకోవాలి. వీటన్నింటినీ రైతుల పొలాల్లో సాకారం చేయాలన్న సంకల్పంతో ‘భారతీయ కిసాన్‌ సంఘ్‌’ ఒక దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘మనకి బతుకునిచ్చే భూమాతని దోచుకోవడం కాదు... సక్రమంగా కాచుకొని పోషించుకోవాలి’ అన్న నినాదంతో ఏప్రిల్‌ 13న దేశవ్యాప్తంగా ‘భూ సుపోషణ్‌ అభియాన్‌’ అనే వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది.


సహజ ఎరువులు, సేంద్రియ విధానాలతో నిస్సారమైన మన నేలలను పునరుద్ధరింప చేద్దామంటూ రైతులకు పిలుపునిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామంలో నేలతల్లిని పరిపుష్టం చేసే భూపూజ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. జూలై 31 వరకు భూసారం, సేంద్రియ కర్బనం పెంచుకునే పద్ధతులపై నిపుణులు, అనుభవజ్ఞుల ద్వారా రైతులకి అవగాహన కల్పించనుంది. ఇందులో అనేక రైతు సంఘాలు, రైతుల అభ్యున్నతికోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. మనకి అన్నం పెట్టే భూములను సుపోషణ ద్వారా సమృద్ధం, సుసంపన్నం చేసుకుని భావితరాలకి బంగరు నేలలను కానుకగా అందించే ఈ మహాయజ్ఞంలో అందరం పాల్గొందాం.

వై. వెంకటేశ్వరరావు 

భూ సుపోషణ్‌ అభియాన్‌ కమిటీ అధ్యక్షులు


Updated Date - 2021-04-13T06:40:03+05:30 IST