ఏఎంసీలో సెంటినరీ అలూమ్నీ బ్లాక్‌ నిర్మాణానికి భూమి పూజ

ABN , First Publish Date - 2022-05-26T06:43:07+05:30 IST

ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఏర్పాటై వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయంతో నిర్మించనున్న సెంటినరీ అలూమ్నీ బ్లాక్‌కు బుధవారం భూమి పూజ జరిగింది.

ఏఎంసీలో సెంటినరీ అలూమ్నీ బ్లాక్‌ నిర్మాణానికి భూమి పూజ
భూమి పూజలో పాల్గొన్న ఎంపీ, ఏఎంసీ ప్రిన్సిపాల్‌, వైద్యులు

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఏర్పాటై వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయంతో  నిర్మించనున్న సెంటినరీ అలూమ్నీ బ్లాక్‌కు బుధవారం భూమి పూజ జరిగింది. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ ఎదురుగా ఉన్న ఆడిటోరియం స్థలంలో  జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్లాక్‌ నిర్మాణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రవిరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాంబశివరావు, డాక్టర్‌ పీవీ సుధాకర్‌, డాక్టర్‌ రాధ, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఆదినారాయణరావు, డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ అర్జున, డాక్టర్‌ ఎస్‌కేఈ అప్పారావు, డ్టార్‌ ఎస్‌ఎన్‌ఆర్‌ నవీన్‌, డాక్టర్‌ శశి ప్రభ తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ఈ భవన నిర్మాణానికి రూ.25 కోట్లు వెచ్చించనున్నారు. వీరిలో అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థుల సంఘం (అంకనా) రూ.15కోట్లు, డాక్టర్‌ సదాశివరావు రూ.3 కోట్లను అందించగా, మిగిలిన మొత్తాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అందిస్తున్నారు. 1.25 ఎకరాల స్థలంలో 50 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ ఏడాది చివరికి భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ బాధ్యతను ఎంవీవీ నిర్మాణ సంస్థకు అప్పగించారు.  

Updated Date - 2022-05-26T06:43:07+05:30 IST