భోరుమన్న ధర్మవరం

Published: Mon, 28 Mar 2022 03:01:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భోరుమన్న ధర్మవరం

భాకరాపేట ప్రమాదంతో పెళ్లింట విషాదం

వరుడి తండ్రి, మరో నలుగురు కుటుంబసభ్యుల దుర్మరణం

పట్టణానికి చేరిన మృతదేహాలు

ప్రమాదంలో మొత్తం 9మంది మృతి

రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి


ధర్మవరం, తిరుపతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): భాకరాపేట బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందడంతో  అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం భోరుమంది. నిశ్చితార్థానికి ఆనందంగా బయలుదేరి వెళ్లిన ఆ కుటుంబంలో ఒకసారిగా విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించగా చూసి కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ధర్మవరానికి చెందిన చేనేత వ్యాపారి మురళి కుమారుడు వేణు నిశ్చితార్థానికి తిరుచానూరు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మొత్తం 9మంది మృతిచెందగా.. 43మంది గాయపడ్డారు. వరుడి తండ్రి మలిశెట్టి మురళి(45), చిన్నాన్న మలిశెట్టి గణేశ్‌(42), చిన్నమ్మ మలిశెట్టి కాంతమ్మ(38), చినతాత మలిశెట్టి వెంగప్ప(75), ఆయన భార్య మలిశెట్టి నాగలక్ష్మి (70), వరుడి బంధువు కొక్కంటి క్రా్‌సకి చెందిన చందన(8), బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఓ పత్రికా విలేకరి ఆదినారాయణరెడ్డి(45), ధర్మవరం వాసి డ్రైవర్‌ నబీరసూల్‌(40), కదిరికి చెందిన  క్లీనర్‌ షాకీర్‌ (20) మృతిచెందారు. గాయపడిన వారు తిరుపతి బర్డ్స్‌ ఆస్పత్రి, ఎస్‌వీఐఎంఎస్‌, ఆర్‌వీజే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు  ప్రమాద వార్త తెలిసి చిత్తూరు జిల్లా నారాయణవనంలోని పెళ్ళికుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర వేదనకు లోనయ్యారు. 


యంత్రాంగంపై ప్రశంసలు

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బంది వేగంగా చేపట్టిన సహాయక చర్యల కారణంగానే మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కలెక్టర్‌ హరినారాయణ్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు  హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రుయా ఆస్పత్రిలో వైద్యులను, సిబ్బందిని ముందుగానే అప్రమత్తం చేయడంతో క్షతగాత్రులకు సత్వర వైద్యం అందజేశారు.


నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని 

చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ప్రధాని మోదీ నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  


చంద్రబాబు, నేతల విచారం

భాకరాపేట ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదివారం ఓ ప్రకటనలో  ప్రభుత్వాన్ని కోరారు. శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం అలుముకోవడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,  ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.   



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.