సదరం క్యాంపులో పరీక్షలు చేస్తున్న వైద్య నిపుణులు (ఫైల్)
దివ్యాంగులకు సర్టిఫికెట్ల జారీలో అలసత్వం
క్యాంపులు నిర్వహించినా అందజేయని ధ్రువీకరణ పత్రాలు
భూపాలపల్లి జిల్లాలో ఎదురుచూస్తున్న 233 మంది
మెడికల్ బోర్డులు నామ్కే వాస్తే..
జిల్లా ఆస్పత్రి అందుబాటులో రాకపోవడమే కారణం!
భూపాలపల్లి కలెక్టరేట్, మార్చి 23: చట్టాలెన్ని ఉన్నా.. పథకాలు ఎన్ని అమల్లో ఉన్నా దివ్యాంగులు ఇంకా నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. వీరి సంక్షేమం కోసం పాటు పడుతున్నామని సర్కారు పేర్కొంటున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కానరావడం లేదు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అధికార యంత్రాంగం చేతలకు పొంతన ఉండటం లేదు. ముఖ్యంగా దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. క్యాంపులు నిర్వహిస్తున్నారు గానీ.. ధ్రువీరణ పత్రాలు అందజేస్తున్న దాఖలాలు లేవు. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మూడు క్యాంపులు నిర్వహిస్తే ఒక్క సర్టిఫికెట్ కూడా జారీ చేయలేదు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది.
233 మంది ఎదురుచూపులు
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యమివ్వడానికి దివ్యాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల్లో మొత్తం మూడు క్యాంపులు నిర్వహించగా 233 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. డిసెంబర్ 30 నుంచి మార్చి 9 వరకు నిర్వహించిన మూడు క్యాంపుల్లో పరీక్షలు చేయించుకున్న అర్హులైన దివ్యాంగులు కొత్త సర్టిఫికెట్ రాక, పాతవి రిన్యూవల్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 30న సదరం క్యాంపు ద్వారా 119 మంది దివ్యాంగులకు, జనవరి 31న నిర్వహించిన క్యాంపు ద్వారా 114 మందికి సర్టిఫికెట్లు రావాల్సి ఉండగా ఇంత వరకు వాటి ఊసే లేదు. ఇదిలా ఉండగా మార్చి 9న 235 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకోగా కంప్యూటర్ అందుబాటులో లేదనే నెపంతో డీఆర్డీవో అధికారులు అర్హులను గుర్తించలేదు. ఇలా సర్టిఫికెట్లు సకాలంలో రాకపోవడంతో సంక్షేమ ఫలాలు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రంగానే మెడికల్ బోర్డు
సదరం సర్టిఫికెట్ల జారీకి సాధారణంగా పరీక్షలు చేసే వైద్య నిపుణులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఎముకల వైద్య నిపుణులు, ఫిజీషియన్, మత్తు (అనెస్తీషియా), మానసిక వైద్యనిపుణులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే.. జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో మాత్రం ఇద్దరే ఉన్నారు. ఒకరు డీసీహెచ్ డాక్టర్ తిరుపతి అయితే, మరొకరు మత్తు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ మాత్రమే ఉన్నారు. జిల్లా ఆస్పత్రి ప్రారంభం కాకపోవడంతో ఇద్దరితోనే జిల్లాలో మెడికల్ బోర్డును నెట్టుకొస్తున్నారు.
ఇతర జిల్లాల వైద్యులే ఆధారం
జిల్లా ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోకపోవడంతో వైద్య నిపుణులు అందుబాటులో లేక సదరం క్యాంపులో పరీక్షలకు ములుగు జిల్లా ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చెందిన ఎముకలు, చెవి, ముక్కు, గొంతు, మానసిక వైద్య నిపుణులపైనే జిల్లా అధికారులు ఆధారపడుతున్నారు. దీంతో సదరం సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది.
జిల్లా ఆస్పత్రి ప్రారంభమే సరైన మార్గం
సదరం సర్టిఫికెట్ల జారీలో అలసత్వం సమసిపోవ లంటే జిల్లా ఆస్పత్రి ఒక్కటే పరిష్కరమని జిల్లా వైద్య నిపుణులు అంటున్నారు. సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు జిల్లా ఆస్పత్రి వైద్యులే పరీక్షలు చేస్తే సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఎలాంటి జాప్యం చోటు చేసుకోదని అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఆస్పత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉండదని, ప్రతి వారం ఆస్పత్రిలోనే వైద్యులు దివ్యాంగులను పరీక్షించి సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు.
సంక్షేమ ఫలాలు కోల్పోతున్నాం.. : గుండెబోయిన నీలాంబరం, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
సదరం సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అలసత్వం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కోల్పోతున్నాం. కొత్త సర్టిఫికెట్లు రాక పాతవి రిన్యూవల్ కాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి అందే పింఛను నష్టపోతున్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. సకాలంలో సర్టిఫికెట్లు అందేలా చర్యలు చేపట్టాలి.
స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడం వల్లే.. : డాక్టర్ తిరుపతి, డీసీహెచ్వో
జిల్లాలో స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల సదరం సర్టిఫికెట్ల జారీలో ఆలస్యమవుతోంది. డాక్టర్ల కోసం ములుగు జిల్లా ఆస్పత్రి, ఎంజీఎం ఆస్పత్రిపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా ఆస్పత్రి అందుబాటులోకి వస్తే స్పెషలిస్టు డాక్టర్లు ఆందుబాటులో ఉంటారు. ప్రతి వారం ఇక్కడే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేయొచ్చు.