చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబ

ABN , First Publish Date - 2022-09-29T05:52:49+05:30 IST

దసరా ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నవదుర్గా అవతారాల్లో ఒకటైన చంద్రఘంట అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబ

ఆది దంపతులకు రావణ వాహనసేవ
శ్రీశైలంలో వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు


 శ్రీశైలం, సెప్టెంబరు 28: దసరా ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నవదుర్గా అవతారాల్లో ఒకటైన చంద్రఘంట అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు దశ భుజాలతో  ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపిణిగా ఉంటారు. వాహన సేవలలో భాగంగా రావణవాహనసేవను నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులను జేసి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ముంగిట జానపద కళాకారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అశేష భక్తజనం ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు
 
ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు ఉదయం బుధవారం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణాలు, చండీ మం, పంచాక్షరీ, భామరీ,  జపాను ష్ఠానాలు, చండీపారాయణ, చతుర్వేద పారాయణం, కుమారి పూజలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుదాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు,  రుద్రపారాయణాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించారు. ఈ కుమారి పూజలలో రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు.

 నేడు కూష్మాండ దుర్గ అలంకారంలో అమ్మవారు

 దసరా మహోత్సవాల్లో నాలుగో రోజు గురువారం భ్రమరాంబికా అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి, అమ్మ వార్లకు కైలాస వాహనసేవ నిర్వహించనున్నారు.

Updated Date - 2022-09-29T05:52:49+05:30 IST