బుగ్గవాగుపై తాత్సారం

ABN , First Publish Date - 2022-05-20T04:46:13+05:30 IST

బుగ్గవాగు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపుపైనే జిల్లాలోని తాగు, సాగు నీటి సమస్యల పరిష్కారం.. జల్‌జీవన్‌ మిషన్‌.. వాటర్‌ గ్రిడ్‌ పథకాలు ఆధారపడి ఉన్నాయి. ఇంతటి ప్రాథాన్య విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

బుగ్గవాగుపై తాత్సారం
బుగ్గవాగు రిజర్వాయర్‌ గేట్లు

కాగితాల్లోనే రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు

ఏడాదిన్నరగా వ్యయ అంచనాలే రూపొందించని వైనం

ప్రాజెక్టుపైనే జల్‌జీవన్‌, వాటర్‌ గ్రిడ్‌ పథకాల ఆధారం

బుగ్గవాగు బాధ్యత మంత్రి అంబటి తీసుకుంటారని జిల్లావాసుల ఆశ

నరసరావుపేట, మే 19: బుగ్గవాగు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపుపైనే జిల్లాలోని తాగు, సాగు నీటి సమస్యల పరిష్కారం.. జల్‌జీవన్‌ మిషన్‌.. వాటర్‌ గ్రిడ్‌ పథకాలు ఆధారపడి ఉన్నాయి. ఇంతటి ప్రాథాన్య విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నాగార్జున సాగర్‌ కుడి కాలువ పరిధిలోని బుగ్గవాగు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాలని దశాబ్ధాలుగా జిల్లావాసులు కోరుతున్నారు. బుగ్గవాగు సామర్థ్యం పెంపుపైనే తాగునీటి పథకాల అభివృద్ధి ఆధారపడి ఉంది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ప్రజలు వేసవిలో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బుగ్గవాగు సామర్థ్యం పెంచితే ఆయా నియోజకవర్గాల్లో ఏడాది పొడవునా తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఇంతటి ప్రాథాన్య ప్రాజెక్టుకు సంబంధించి పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. బుగ్గవాగు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ దుర్గి ప్రాంతంలో కుడి కాలువ 27 నుంచి 33వ కిలోమీటర్‌ మధ్యలో ఉంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.46 టీఎంసీలు. డెడ్‌ స్టోరేజి 1.69 టీఎంసీలు కాగా 1.77 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తాగు, సాగునీటి అవసరాలు తీర్చవచ్చన్న ప్రతిపాదనలు దశాబ్ధాలుగా ఉన్నాయి. రిజర్వాయర్‌ను 3.46 టీఎంసీల నుంచి 4.77 టీఎంసీలకు పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నిపుణుల కమిటీ కూడా నాడు ఆమోదం తెలిపింది. రూ.424 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. అప్పట్లో ప్రభుత్వం రూ.202 కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది. 

ఆర్భాటపు ప్రకటనతో సరి

ప్రస్తుత ప్రభుత్వం బుగ్గవాగు సామర్థ్యాన్ని 3.46 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచుతామని ఆర్భాటంగా ప్రకటించింది. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల వ్యయ అంచనాలు, డిజైన్లు రూపొందించే ఏజెన్సీని నియమించే టెండర్‌ను జలవనరుల శాఖ ఖరారు చేయలేదు. 2020 అక్టోబరులో డీపీఆర్‌ కోసం కాంట్రాక్టర్‌ను నియమించింది. అయితే ఆ కాంట్రాక్టర్‌ తప్పుకోవడంతో పనుల వ్యయ అంచనాలు రూపొందించడం నిలిచిపోయింది. మరో సారి ఈ పనుల కోసం టెండర్‌ను జలవనరుల శాఖ నిర్వహించింది. తాజాగా మళ్లీ టెండర్‌ ఖరారు చేసి పనులు అప్పగించినా డీపీఆర్‌ వచ్చేసరికే కనీసం ఏడాదైనా సమయం పడుతుంది. 

బుగ్గవాగు అభివృద్ధితో ముడి

గ్రామాల్లో తాగునీటి సమస్యలు పరిష్కారం, ప్రతి వ్యక్తికి 55 లీటర్ల తాగునీరు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకం లక్ష్యం. బోర్లు ద్వారా తాగునీటి సరఫరాను నిలిపి వేసి సాగర్‌ నీటిని అందించాలన్న దిశగా ఈ మిషన్‌ పనులు సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.209 కోట్ల వ్యయంతో జల్‌జీవన్‌ మిషన్‌ పనులు చేపట్టారు. కాగా పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.1500 కోట్ల వ్యయంతో తాగునీటి పథకాలను అభివృద్ధి చేసి బుగ్గవాగు నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని గ్రామాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇలా జల్‌జీవన్‌ మిషన్‌, వాటర్‌ గ్రిడ్‌ పథకాలు బుగ్గవాగు సామర్థ్యం పెంపుపై అధారపడి ఉన్నాయి. అయినా ఎందువలనో బుగ్గవాగు అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే బుగ్గవాగు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు పనులు కాగితాల్లోనే పరిమితమవడం పట్ల జిల్లావాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యయం అంచనాలు రూపొందించే పనుల టెండర్‌ను ఖరారు చేస్తేనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. జిల్లా నుంచే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గానికి బుగ్గవాగు సామర్థ్యం పెంపు ఎంతో అవసరం. ఈ పరిస్థితుల్లో బుగ్గవాగు బాధ్యత మంత్రి తీసుకుని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే  పనులను త్వరతగతిన చేపట్టాలని జిల్లావాసులు ఆశిస్తున్నారు. 


Updated Date - 2022-05-20T04:46:13+05:30 IST