చంద్రబాబు నన్ను విమర్శిస్తే.. బాలకృష్ణ మాత్రం ఫోన్ చేసి అభినందించారు

Published: Fri, 07 Feb 2020 12:06:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చంద్రబాబు నన్ను విమర్శిస్తే.. బాలకృష్ణ మాత్రం ఫోన్ చేసి అభినందించారు

కాంగ్రెస్‌, బాబు మాకు శత్రువులు. మిగతావారంతా ప్రత్యర్థులు

కాంగ్రెస్‌ను కాదని.. కొత్త పార్టీ పెట్టాలని వైఎస్ భావించారు

జగన్ ఒక ధీరుడు.. దూకుడుతో నిలబడి కలబడుతున్నాడు

బీజేపీతో కలుస్తామని మేమెప్పుడూ చెప్పలేదు

పవన్‌ మాకు ప్రత్యర్థి..శత్రువు కాదు

నాపై ఆరోపణలను సీఎం నిరూపించాలి

‘ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే’లో వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి


విప్లవోద్యమంలో కొండపల్లికి కొరియర్‌..పార్లమెంటరీ పంథాలో వైఎస్‌కు నమ్మినబంటు.. వేడెక్కుతున్న రాజకీయాల్లో జగన్‌కు కుడి..ఎడమ. ఆయనే వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంపై 05-02-2017న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే’లో సంభాషించారు.

 

ఎలాఉన్నారు? వెంకటేశ్వరస్వామిపాదాల వద్ద (తిరుపతి) ఉన్నారు. విప్లవ రాజకీయాల్లోంచి వచ్చారు. దేవుడు, అస్థిత్వం ఉండవని నమ్ముతారా?

నాకు దేవుడిపై అపార నమ్మకం ఉంది. విప్లవ రాజకీయాల్లో ఏడేళ్లు ఉన్నా...దేవుడు లేడనే ఆలోచన ఏనాడూ రాలేదు.

 

ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

తిరుపతికి చెందిన త్రిపురనేని మధుసూదనరావు ఉపన్యాసాలు విని..విప్లవ రాజకీయాల్లోకి వచ్చా. కొండపల్లి సీతారామయ్య (పీపుల్స్‌వార్‌ పార్టీ వ్యవస్థాపకుడు)కి కొరియర్‌గా పనిచేశాను. ఎమర్జెన్సీలో జైల్లో రాజారెడ్డితో, 1983లో వైఎస్‌ రాజశేఖరరెడితో ఏర్పడిన పరిచయమే ఈ రాజకీయాల్లోకి తెచ్చింది. వైఎస్‌ పట్టుబట్టి 2009లో పోటీచేయించారుకానీ, ఓడిపోయా. 2014 ఎన్నికల్లో మరోసారి పోయింది. పట్టణ ఓటే దెబ్బతీసింది.

 

2014 ఎన్నికలకి 4 నెలల ముందు స్థానిక బాడీలకు జరిగిన ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వచ్చాయికదా?

చంద్రబాబు హామీలు 2014 ఎన్నికల్లో బాగా పనిచేశాయి. కానీ, జగన్‌ జనాన్ని మోసగించదలుచుకోలేదు. చేయనివాటిని చెప్పనన్న వైఖరికే కట్టుబడ్డారు.

 

తమిళనాడు రాజకీయ పోకడ అయిన శత్రుభావం..ఈ రాష్ట్రాన్ని బలంగా తాకింది. మూడుపక్షం జోక్యంతో ఈ పరిస్థితి ఏమైనా మారుతుందా?

మీరన్నదానితో నేను ఏకీభవిస్తా. కానీ, ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారకులు. ఆయన మమ్మల్ని ప్రత్యర్థులుగా కాక శత్రువుల్లా చూస్తున్నారు. అంత అనువజ్ఞుడే ఇలా వ్యవహరిస్తున్నప్పుడు, ఎవరు మాత్రం ముందుకొచ్చి మాట్లాడగలుగుతారు. నాపైనా(తుని ఘటన) ఎలా ఉంటున్నారో చూస్తున్నారు కదా! ఆఘటన వెనుక నేనున్నానని ఆరోపిస్తున్న చంద్రబాబు..నన్నెందుకు అరెస్టు చేయించడం లేదు.?

 

జగన్మోహన్‌రెడ్డికి మీరు ఎన్నిమార్కులు వేస్తారు?

నూటికి నూరు మార్కులు. చంద్రబాబు లాంటి సీనియర్‌, దేనినైనా మేనేజ్‌ చేయగల సీఎం ఉన్న చోట.. ధీరుడిలా జగన్‌ నిలబడ్డాడు. కేసులపేరిట వేధింపులకు గురిచేస్తారని తెలిసినా.. కాంగ్రెస్‌, సోనియాను ఢీకొట్టారు. పార్టీలో అవమానాలు పడినా, ఓపిగ్గా నిరీక్షించి..వైఎస్‌ అనుకొన్నది సాధించారు.. కోట్ల విజయభాస్కరరెడ్డితో విభేదించి, 1994లో వేరే పార్టీ పెట్టాలని వైఎస్‌ ఆలోచించారు. అనంతర పరిణామాల్లో వైఎస్‌ కాంగ్రెస్‌లోనే కొనసాగడమూ, జగన్‌ ఆపార్టీని ధిక్కరించి బయటకు రావడమూ.. రెండూ కరెక్టే.

 

జాతీయ పార్టీలతో జగన్‌కు పొసగదు. ఆయన తమతో పొత్తు పెట్టుకొంటారని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తుంది?

కాంగ్రెస్‌తో జగన్‌ కలవరు. కాంగ్రెస్‌, బాబు మాకు శత్రువులు. మిగతావారంతా ప్రత్యర్థులు మాత్రమే. బీజేపీతో కలయిక విషయానికి వస్తే.. ఇప్పుడే చెప్పలేం.


చంద్రబాబు నన్ను విమర్శిస్తే.. బాలకృష్ణ మాత్రం ఫోన్ చేసి అభినందించారు

పవన్‌ కల్యాణ్‌ మీకు శత్రువా? ప్రత్యర్థా?ఆయనతో మీరు మంతనాలు జరుపుతున్నారా? పవనేమో తన లక్ష్యం అధికారం కాదంటున్నాడు..జనం కూడా విపక్ష నేతని వదిలి తమ సమస్యలపై ఆయననే కలుస్తున్నారు.

నూటికి నూరుశాతం ప్రత్యర్థే. ఆయనతో నేను మంతనాలు జరుపుతున్నాననడం సరికాదు. సమస్యలతో కలిసి పనిచేస్తామని పవనే చెప్పారు. ఇప్పటికి మా మధ్య సంబంధం అంతవరకే. హోదాపై చంద్రబాబుతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనని చెప్పాం. పవన్‌కు జనం సమస్యలు నివేదించుకోవడం విషయానికి వస్తే..అంతకన్నాకూడా ఆయన పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరే అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. తమకు పవన్‌ దూరం అవుతాడేమోనన్న భయం టీడీపీవాళ్లని వేధిస్తోంది. మాకు అలాంటి భయం లేదు.


బీజేపీని ఇరకాటంలోపెట్టడానికే హోదా అంశమా?

ఇరకాటంలో ఎందుకుపెట్టాలి? బీజేపీతో కలుస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. హోదా అయిపోయిన అంశం కాదు. అదే నిజమైతే, ప్రధాని లేదా వెంకయ్యతో ప్రకటన చేయించమనండి.

 

రాజకీయాల్లో వైఎస్‌ని వ్యతిరేకించినవారు తప్ప ద్వేషించినవారు లేరు. ఆ మాటకొస్తే.. జగన్‌ కన్నా వైఎస్‌ని అభిమానించినవారే ఎక్కువ. కాదంటారా?

వైఎస్‌ని ద్వేషించేవారు లేరనడం సరికాదు. వ్యక్తిత్వం విషయానికి వస్తే..అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వైఎస్‌ కన్నా జగన్‌ వ్యక్తిత్వమే గొప్పదని నిరూపించేరోజు వస్తుంది. ఈ మాట వ్యక్తిగతంగా చెబుతున్నాను.

 

ఆ రోజు ఎప్పటికి వస్తుంది. రెండున్నరేళ్లు పడుతుందా?

వ్యక్తిత్వ నిరూపణకు అధికారమే ప్రమాణం అని నేను అనుకోను. మీరన్నట్టు రెండున్నారేళ్ల తరువాతే అది తేలుతుంది. 2019లో జగన్‌ అధికారంలోకి రావడం ఖాయం. ఆరోజు ఈ విషయం గురించి మీరూ, నేనూ మరోసారి మాట్లాడుకొందాం.

 

వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేస్తారా? రాజకీయాల్లోకి మీ వారసుడిని ప్రవేశపెడతారా? జీవిత లక్ష్యం ఏమిటి? 

వారసత్వం ప్రతిభని నిర్ణయించదు. ప్రతిభే నాయకుడిని చేస్తుంది. రాజకీయాల్లోకి వస్తానని నన్ను అతడు అడగలేదు. క్యాంపెయిన్‌ మటుకే చేస్తున్నాడు.


మీరు టీటీడీ చైర్మన్‌గా ఉండగా, భూకబ్జా ఆరోపణలు ఎందుకొచ్చాయి?

భూకబ్జా ఆరోపణలను చేసింది చంద్రబాబు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. వ్యవస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయి. టీటీడీ విషయంలోగానీ, తుని ఘటన విషయంలోగానీ, నేను చిన్న తప్పుచేసినా (చిన్న లడ్డూ అంత తప్పు చేసినా-ఆర్కే)(నవ్వులు) విచారణ జరిపించాలని సవాల్‌ విసురుతున్నా. నిజానికి, టీటీడీ చైర్మన్‌గా నాపని తీరుని ఆయన బావమరిది బాలకృష్ణ స్వయంగా మెచ్చుకొన్నారు. ఒకసారి బాలకృష్ణ నాకు ఫోన్‌ చేసి.. ‘లోకేశ్‌ పెళ్లి పెట్టుకొని, తిరుమల వస్తున్నాం. మీరు దగ్గరుండి దర్శనాలు అయ్యేలా చూడాలి’ అని కోరారు. తిరుమల వచ్చిన చంద్రబాబు.. దేవస్థాన వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ప్రెస్‌మీట్‌ పెడితే, బాలకృష్ణ మాత్రం ప్రత్యేకంగా ఫోన్‌ చేసి, అభినందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రాజకీయ నేతలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.