భూముల వేలంలో మతలబేమిటి?

ABN , First Publish Date - 2021-04-15T07:39:43+05:30 IST

విశాఖ నగరంలోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది....

భూముల వేలంలో మతలబేమిటి?

విశాఖ నగరంలోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ‘నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారు గత నెల 30న నగరంలోని ఐదు ప్రదేశాలలో ఉన్న 17.48 ఎకరాల భూమిని ఉన్నది ఉన్నట్లుగా అమ్మాలని ఇ టెండర్లను ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్‌ను ఆనుకుని ఉన్న 13.59 ఎకరాల భూమి కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం ఈ భూములు ఎందుకు అమ్ముతోంది అన్నది ఒక అంశం కాగా, అలా అమ్మడం సహేతుకమేనా అన్నది మరొక అంశం. వాస్తవానికి గత సంవత్సరమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినా హైకోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే జగన్ ప్రభుత్వం ‘బిల్డ్‌ ఎపి మిషన్‌’ అమలుకు 2019 నవంబర్ 5న ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణా కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసి)ని జిఓ నెం. 447 ద్వారా ఏర్పాటు చేసింది. సదరు జిఓ ఉపోద్ఘాతంలో కింది విధంగా పేర్కొన్నారు: ‘ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన నవరత్నాలు, నాడు–-నేడు, మౌలికసదుపాయాల అభివృద్ధి పనులు నిరంతరం స్థిరంగా కొనసాగడం కోసం రాష్ట్రంలో దీర్ఘకాలంగా ఖాళీగా పడి ఉన్న భూములను అమ్మి ‘బిల్డ్‌ ఎపిమిషన్‌’కు ఆదాయం సమకూర్చుకోవాలి. ఈ పనిని సమర్థంగా చేయడానికి ‘నేషనల్‌ బిల్డింగ్‌ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్‌’ (ఎన్‌బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవాలి’. ఇందులో మూడు అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మొదటిది- ఖాళీగా ఉన్న భూములు అమ్మడం; రెండవది- స్థిరమైన అభివృద్ధి సాధించడం; మూడవది- ఈ పనిని ఎన్‌బిసిసికి అప్పగించడం. ఈ అంశాలను ప్రభుత్వం ఎలా అమలు చేస్తోంది అన్నదాన్ని బట్టి ఈ భూముల అమ్మకం ప్రక్రియ చేపట్టడంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటన్నది అవగతమవుతుంది.

మొదటి అంశాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం నేడు అమ్మకానికి పెడుతున్న భూములేమీ ఖాళీగా లేవు. దీనికి భిన్నంగా ఇప్పటికే ఉన్న సంస్థలను ఖాళీ చేయించో, లేదా రద్దుచేసో అమ్మకానికి పెడుతున్నారు! ఉదాహరణకు విశాఖపట్నంలో నేడు అమ్మకానికి పెట్టిన (ఆర్కే బీచ్‌లో ఉన్న భూమి సహా) భూములను వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వం కన్వెన్షన్‌ సెంటర్‌, షాపింగ్‌ మాల్‌ నిర్మాణం కోసం ‘లులు’ అనే సంస్థకు లీజుకు ఇచ్చింది. జగన్‌న్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం ఆర్కే బీచ్ భూములను ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఆ రద్దును హర్షించారు. ఇప్పుడు అదే స్థలాన్ని అమ్మకానికి పెట్టడంలో ప్రభుత్వ ఆంతర్యమేమిటని ఆ ప్రజలే విస్తుపోతున్నారు! ఈ ప్రక్రియ కోసం గత సంవత్సరం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమారు పదివేల కోట్ల రూపాయల విలువ చేసే 1400 ఎకరాల భూమి రాష్ట్ర వ్యాప్తంగా 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఏవీ కూడా ప్రభుత్వం పేర్కొన్నట్లు ఖాళీ స్థలాలు కావు. ఎపిఐఐసి, ఇరిగేషన్‌, మునిసిపల్‌, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందిన వివిధ ఆఫీసులు వీటిలో ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వ సంస్థలను ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెడుతూ, మరోపక్క నిరుపయోగంగా ఉన్న స్థలాలనే అమ్ముతామని నమ్మబలకడం నిస్సందేహంగా నయవంచనే. 

రెండో అంశం–స్థిరమైన అభివృద్ధి సాధించడం. భూములు అమ్ముకుంటూ పోతే తరుగుతాయే కానీ పెరగవు కదా! అలాంటప్పుడు ఇది స్థిరమైనది అని ఎలా భావిస్తాం? కొన్నాళ్ళకు ఈ భూములన్నీ అయిపోతే అప్పుడిక ఏవి అమ్ముతారు? స్థిరమైన ఆదాయమంటే ఉన్న సంపదను అమ్ముకోవడం కాదు. అందుకు భిన్నంగా సంపద మరింత పెరిగే చర్యలు చేపట్టడం. ఇది ప్రజల ఆదాయాలు పెరగడం- తద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు పెరగడం. కేంద్రం నుంచి రావలసిన నిధులు రాబట్టుకోవడం, ప్రజా సంపద అన్యాక్రాంతం కాకుండా కాపాడడం ఈ చర్యలలో కొన్ని. కానీ ప్రభుత్వం ఇవేమీ చేయకుండా భూముల అమ్మకానికి తెగబడడం ఏ రకంగానూ సహేతుకం కాదు. ఇక మూడవ అంశానికి వస్తే, ప్రభుత్వం ఒప్పదం చేసుకున్న ఎన్‌బిసిసి కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఎలాంటి అవతతవకలకు తావుండదని ఒక భావం కొంత మందికైనా కలగవచ్చు. అయితే ఈ సంస్థ కూడా నేడు కేంద్రప్రభుత్వ అమ్మకాల జాబితాలో ఉంది. అందువల్ల నేడో, రేపో ప్రైవేటుపరమే. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ సంస్థే కదా అని సరిపెట్టుకోవచ్చు. ఇక్కడే అసలు కథ అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ఈ స్థలాల నుంచి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారం కోసం కెనడా రాజధాని టోరోంటో ప్రధాన కేంద్రంగా ఉన్న కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అమెరికాలోని షికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న జెఎల్‌ఎల్‌ ప్రొపర్టీ కన్సల్టెంట్స్‌ అనే సంస్థలను నియమించారు. ఈ రెండూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రోకర్‌ కంపెనీలు. దీని అర్థమేమిటంటే కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌బిసిసి మాటున విదేశీ గుత్త కంపెనీలను రంగంలోకి దింపడం! అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మతలబు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం చెబుతున్నదానికి, చేస్తున్నదానికి అస్సలు సారూప్యతే లేదు. సరికదా దాని చర్య అనేక సందేహాలకు కూడా తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచననే ప్రశ్నించేలా చేస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకవంతమైన ఆలోచనేనా అనే సందేహం కూడా కలుగుతోంది. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయడమే తమ విధానమని ప్రకటించిన కేంద్రప్రభుత్వ బాటలోనే రాష్ట్రప్రభుత్వమూ పయనిస్తోందా అనే భావం ప్రజలకు తప్పక కలుగుతుంది. ఇప్పుడు విశాఖ భూములతో ప్రారంభించి అనేక ప్రాంతాలలో భూములను అమ్మడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అవగతమవుతోంది. వీటన్నింటికి మించి అసలు ఈ ప్రక్రియ ప్రారంభానికి విశాఖనే ఎంచుకోవడమేమిటి? ఇప్పటికే అనేక సంఘాలు, సంస్థలు, మేధావులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఈ మొత్తం అంశంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఉంది. 

ఎ. అజ శర్మ,

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృధ్ధి వేదిక

Updated Date - 2021-04-15T07:39:43+05:30 IST