Advertisement

‘రాశి’ పోసిన దక్షత, వాసి కెక్కిన విజ్ఞత

Oct 15 2020 @ 00:41AM

నవభారత నిర్మాణంలో ఎందరో తమ వంతు పాత్రను ప్రశస్తంగా పోషించారు. ప్రగతిసాధనలో సిమెంట్ పరిశ్రమ కీలక పాత్ర పోషించింది. ఈ రంగం రారాజు బీవీ రాజుగా సుప్రసిద్ధుడైన భూపతిరాజు విస్సంరాజు. సిమెంట్‌ కొరత రూపుమాపిన నిర్మాణ దక్షుడు. పట్టుదల, కఠోర శ్రమ, ఉదాత్త జ్ఞాన సంపద, ఎల్లలు లేని దాతృత్వానికి పర్యాయపదం బీవీ రాజు. 


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సమీపంలో ఉన్న కుముదవల్లి గ్రామంలోని ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో 1920 అక్టోబరు 15న బీవీ రాజు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం స్వగ్రామంలోనూ, భీమవరం పట్టణంలోనూ, కళాశాల విద్యాభ్యాసం బందరులోనూ, ఉన్నత విద్యాబ్యాసం బెనారస్ లోనూ జరిగింది. కెమికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన రాజు, తన గురువుగా చెప్పుకునే కొలుసు రామకోటయ్య సలహాతో సిమెంట్‌ రంగంపై మక్కువ పెంచుకున్నారు. నిర్మాణ రంగమే కీలకమని అందులో సిమెంట్‌ పాత్ర ముఖ్యమని ఆయన భావించారు. బెంగాల్‌ రాష్ట్రంలో సిమెంటు పరిశ్రమలు బ్రిటిష్‌ వారి యాజమాన్యంలో ఉండేవి. ఒక కంపెనీలో రాజు నెలకు రూ.250 వేతనానికి చేరారు. 1946లో భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వక తప్పదనే నిర్ణయానికి బ్రిటిష్‌ పాలకులు వచ్చారు. దీంతో రాజు పని చేసే కంపెనీ యజమానులు ఆ సంస్థ నిర్వహణ బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆయన తన దీక్షా దక్షతలతో ఆ కంపెనీని మూడేళ్లలో ఒక అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దారు. స్వాతంత్ర్యానంతరం ఆ కంపెనీ ఆనాటి తూర్పు పాకిస్థాన్‌కి వెళ్ళిపోయింది. 1948లో బీవీ రాజు సొంతూరుకు చేరుకున్నారు. అయితే సిమెంట్‌ పరిశ్రమ నుంచి ఆయనకు ఎన్నెన్నో ఆహ్వానాలు వచ్చాయి. తొలుత విజయవాడలోని ఒక సిమెంట్‌ పరిశ్రమలో చేరారు. అక్కడ పనిచేస్తుండగానే శ్రీలంక వెళ్ళే అవకాశం లభించింది. 1951–55 సంవత్సరాల మధ్య సిమెంటు, షుగర్‌ ఫ్యాక్టరీ, పేపర్‌ మిల్లులను నిర్మించడానికి రాజు కృషి చేశారు. మద్రాసు వెళ్ళి అక్కడ దాల్మియా సిమెంటు కంపెనీ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు. దాల్మియా సిమెంట్‌ కంపెనీలో పని చేస్తున్నప్పుడే ఆయన పనితీరు గురించి కేంద్రప్రభుత్వానికి తెలిసింది. దీంతో 1972లో ఆయనను భారత ప్రభుత్వం సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీగా నియమించింది. ఐదేళ్ళ పాటు ఆయన ఆ పదవిలో కొనసాగి సిమెంటు రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.


1970 దశకంలో దేశవ్యాప్తంగా ఎన్నో నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభ మవడంతో సిమెంటు కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నిర్మాణాలపై పరిమితి విధించింది. నిర్మాణరంగ సంస్థలకు కోటా ప్రకారం సిమెంటు అందజేసేవారు. దీనివల్ల నిర్మాణ రంగం పలు సమస్యల పాలయింది. ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన బీవీ రాజు సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు ఆ రంగంలో లాభాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో అరడజనుపైగా సిమెంట్‌ కంపెనీలను ఆయన ప్రారంభించారు. దీంతో ఉత్పత్తి పెరిగింది. సిమెంటు కొరత గణనీయంగా తగ్గిపోయి దాని ధర నేలకు దిగి వచ్చింది. 1982 నాటికి దేశంలో సిమెంట్‌ కొరత తీరిపోయింది. దరిమిలా ప్రభుత్వ సరళీకృత విధానాలతో సిమెంట్ రంగం మరింతగా పురోగమించింది. . ఇదంతా బివిరాజు ప్రతిభే. ఇలా ఆయన ఎన్నో రాష్ట్రాలకు సిమెంటు పరిశ్రమ సలహాదారుగా వ్యవహరించారు. శ్రీలంకతో పాటు నేపాల్. ఇండోనేషియా, భూటాన్‌ మొదలైన దేశాల్లోని సిమెంట్ పారిశ్రామికవేత్తలకు కూడా ఆయన సలహాదారు అయ్యారు. 1979లో రాజు సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పదవీ విరమణ చేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తదుపరి ఆయన ఏమాత్రం విశ్రమించలేదు. భారీ సిమెంట్‌ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అదే రాశి సిమెంట్‌ (రామ.. ఆంజనేయ.. సీత) కంపెనీ నాణ్యతకు పెద్దపీట వేస్తూ నైపుణ్యం కలిగిన సిబ్బందితో ఆ కంపెనీని నిర్వహించారు. సిమెంట్ రంగంలో మరిన్ని ఉత్కృష్ట ప్రమాణాలను ఆయన నెలకొల్పారు. విష్ణు సిమెంట్‌ను కూడా ఆయనే ప్రారంభించారు. ప్రభుత్వాలు ఆయన్ను ప్రోత్సహించాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఐదువేల ఎకరాల భూములలో క్వారీలు కేటాయించారు. ఇలా సిమెంట్‌ రంగాన్ని అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్ళడంతో సిమెంట్‌ రంగంలో రారాజు గా ఆయన తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా బీవీరాజు చేతుల మీదుగా 35 సిమెంట్‌, ఇతర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.


పేదరికం నిర్మూలనకు ప్రతి పారిశ్రామిక వేత్తా కృషి చేయాలని బీవీరాజు ఎప్పుడూ అంటూ ఉండేవారు. సిమెంట్‌ రంగం నుంచి బయటకు వచ్చాక ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువంటే ఆయనకు ఇష్టం. బాగా చదువుకోవాలని యువజనులకు ఆయన సూచించేవారు. 1993లో ఆయనకు విద్యాసంస్థల స్థాపన ఆలోచన వచ్చింది. 1996లో భీమవరంలో బీవీ రాజు ఫౌండేషన్‌ ట్రస్టును స్ధాపించి విద్యాసంస్థలు ప్రారంభించారు. అదే ఇప్పటి శ్రీ విష్ణు ఎడ్యుకేషన్‌ సొసైటీ . విష్ణుపురంలో ఉన్న ఒక క్యాంపస్‌లో 80 ఎకరాల్లో ఇంజనీరింగ్‌ విద్యాసంస్థలు 2, పాలిటెక్నిక్‌, డెంటల్‌ కళాశాల, కంప్యూటర్‌ సైన్స్‌, డిగ్రీ కళాశాల, ఒక పాఠశాల ఉన్నాయి. ఈ భవనాలకు ఆయనకు ఇష్టమైన స్నేహితులు, శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు. 1997లో హైదరాబాద్‌లో కూడా ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని స్థాపించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భీమవరం, శృంగవృక్షం, నరసాపురంలలో కుష్టువ్యాధిగ్రస్తులకు కాలనీల నిర్మాణం, వారికి పింఛన్లు, వైద్య సౌకర్యం వంటి కార్యక్రమాలను రాజు చేపట్టారు. అవి ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాయి. హైదరాబాద్‌లో అనాథ పిల్లలకు ఒక ఆశ్రమం నిర్మించారు. స్వగ్రామం కుముదవల్లిలో మూడు ఎకరాలకు పైగా భూమిని పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చేశారు. గ్రంథాలయానికి విరాళం ఇచ్చారు. నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆయన విష్ణు భక్తుడు. అనేక దేవాలయాలను నిర్మించారు. ఆలయాలకు విరాళాలు ఇచ్చారు. మరణించే వరకూ లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలకు ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. భారత ప్రభుత్వం 1977పద్మశ్రీ, 2001లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 2002 జూన్‌ 8న కర్మయోగి కన్నుమూశారు. సిమెంట్‌ రంగంలో ఆయన ఘనకీర్తి చిరస్థాయిగా నిలిచిఉంటుంది


కె.వరప్రసాద్‌

(నేడు బీవీ రాజు శతజయంతి)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.