Asia Cup 2022: పాకిస్థాన్‌పై ఏ ఇండియన్ సాధించలేని రికార్డు కొల్లగొట్టిన భువనేశ్వర్ కుమార్

ABN , First Publish Date - 2022-08-29T22:25:26+05:30 IST

ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్

Asia Cup 2022: పాకిస్థాన్‌పై ఏ ఇండియన్ సాధించలేని రికార్డు కొల్లగొట్టిన భువనేశ్వర్ కుమార్

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. పొట్టిఫార్మాట్‌లో పాకిస్థాన్‌ (Pakistan)పై ఇప్పటి వరకు ఏ భారతీయ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను 147 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆపై మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 


పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం(10)ని తొలి వికెట్‌గా వెనక్కి పంపి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టిన భువీ.. ఆపై స్లాగ్ ఓవర్లలో బిగ్ హిట్టింగ్ బ్యాటర్ అసిఫ్ అలీ (9), షాదాబ్ ఖాన్ (10), నసీమ్ షా (0)లను పెవిలియన్ పంపాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌పై టీ20ల్లో ఓ భారతీయ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈ క్రమంలో హర్దిక్ పాండ్యా (Hardik Pandya) రికార్డును భువీ బద్దలుగొట్టాడు.


2016 ఆసియాకప్‌లో హార్దిక్ 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. ఇప్పుడా రికార్డును భువీ తిరగరాశాడు. కాగా, భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భువీ రికార్డు రెండో అత్యుత్తమం. అంతకుముందు 2007లో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ (Mohammad Asif) 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.  

Updated Date - 2022-08-29T22:25:26+05:30 IST